Army personnel missing: సిక్కింలో ఆకస్మిక వరదలు; 23 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతు-23 army personnel missing in flash flood triggered by cloudburst in sikkim ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Army Personnel Missing: సిక్కింలో ఆకస్మిక వరదలు; 23 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతు

Army personnel missing: సిక్కింలో ఆకస్మిక వరదలు; 23 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతు

HT Telugu Desk HT Telugu
Oct 04, 2023 10:57 AM IST

Sikkim flash floods: ఈశాన్య రాష్ట్రం సిక్కింలో ఆకస్మిక వరదలు సంభవించాయి. నీటి మట్టం ఒక్కసారిగా 20 అడుగుల వరకు పెరగడంతో ఆర్మీ వాహనాలు అందులో కొట్టుకుపోయాయి.

ఉత్తర సిక్కింలో తీస్తా నది ఉగ్రరూపం
ఉత్తర సిక్కింలో తీస్తా నది ఉగ్రరూపం

Sikkim flash floods: ఉత్తర సిక్కింను ఆకస్మిక వరదలు వణికించాయి. ఎగువ నుంచి వచ్చిన వరద నీటితో తీస్తా నది నీటి మట్టం ఒక్కసారిగా 20 అడుగుల మేర పెరిగింది. దాంతో నది పక్కన ఉన్న జనావాసాల్లోకి నీరు చేరింది. రహదారులపైకి దూసుకువచ్చిన నీరు అదే వేగంతో రోడ్లపై ఉన్న వాహనాలను ఈడ్చుకువెళ్లాయి. అందులో పలు ఆర్మీ వాహనాలు కూడా ఉన్నాయి.

23 మంది సైనికులు

సిక్కిం ఆకస్మిక వరదల్లో 23 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతయ్యారు. సిక్కింలోని లాచెన్ లోయ ప్రాంతంలో తీస్తా నది ఉగ్ర రూపం దాల్చడంతో, ఆ వరద నీటిలో 23 మంది సైనికులు కొట్టుకుపోయారు. నది ప్రవాహ తీవ్రతకు ఆర్మీ వాహనాలు కొట్టుకుపోయాయి. ఆ వాహనాలు సింగ్తం సమీపంలో బార్డంగ్ వద్ద తీస్తా నది తీరంలో నిలిచి ఉన్నాయి. ఎగువన హిమాలయాల్లోని సరస్సు కట్ట తెగడంతో ఈ ఆకస్మిక వరదలు సంభవించినట్లు భావిస్తున్నారు. తీస్తా నది నీటి మట్టం ఒక్కసారిగా, క్షణాల్లో 20 అడుగుల మేర పెరిగి, తీవ్రమైన వేగంతో తీర ప్రాంతాన్ని కమ్మేసింది. చుంగ్తాంగ్ లో నీటి ప్రవా హ తీవ్రతకు తీర ప్రాంతంలోని పలు భవనాలు కుప్పకూలాయి. పెద్ద సంఖ్యలో ప్రజలు గల్లంతయ్యారు. ప్రాణ నష్టంపై ఇంతవరకు సమాచారం రాలేదు.

గాలింపు..

నదీ ప్రవాహంలో గల్లంతైన సైనికులు, ఇతర పౌరుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎగువ నుంచి ఒక్కసారిగా వరదలు రావడంతో తీస్తా నది ప్రవాహ తీవ్రత పెరిగి తీరంలోని జాతీయ రహదారిని కూడా ముంచెత్తింది. సిక్కింలోని మెల్లి తో పశ్చిమబెంగాల్ ను కలిపే జాతీయ రహదారి 10 కొన్ని చోట్ల పూర్తిగా ధ్వంసమై, రాకపోకలు నిలిచిపోయాయి. ఆకస్మిక వరదలపై సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమంగ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. గత కొన్ని రోజులుగా సిక్కింలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా ఎగువన హిమాలయాల్లో ఉన్న లోహ్నాక్ సరస్సు కట్ట తెగిపోవడంతో, పెద్ద మొత్తంలో ఆ సరస్సు నీరు తీస్తా నదిలోకి వచ్చింది.

Whats_app_banner