Paneer popcorn Recipe: పనీర్ పాప్‌కార్న్... ఇలా ఐదు నిమిషాల్లో చేసేయండి, రెసిపీ చాలా సులువు-paneer popcorn recipe in telugu know how to make it ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Paneer Popcorn Recipe: పనీర్ పాప్‌కార్న్... ఇలా ఐదు నిమిషాల్లో చేసేయండి, రెసిపీ చాలా సులువు

Paneer popcorn Recipe: పనీర్ పాప్‌కార్న్... ఇలా ఐదు నిమిషాల్లో చేసేయండి, రెసిపీ చాలా సులువు

Haritha Chappa HT Telugu
Dec 27, 2023 03:40 PM IST

Paneer popcorn Recipe: పనీర్‌తో చేసే వంటకాలకు ఫ్యాన్స్ ఎక్కువ. అలాంటి వారి కోసమే ఈ పనీర్ పాప్‌కార్న్ రెసిపీ.

పనీర్ పాప్‌కార్న్
పనీర్ పాప్‌కార్న్ (Youtube)

Paneer popcorn Recipe: మాంసాహారులకు చికెన్, మటన్ ఎంత ఇష్టమో... శాకాహారులకు పనీర్‌తో చేసే వంటకాలు అంటే అంత ఇష్టం. వారికి స్పెషల్ వంటకాలంటే... పనీర్‌తో చేసినవే. అలాంటి వారి కోసమే ఈ పనీర్ పాప్‌కార్న్ రెసిపీ. ప్రతిసారీ పనీర్ బిర్యానీ, పనీర్ 65, పనీర్ మంచూరియన్ వంటివి తిని బోర్ కొడితే ఒకసారి పనీర్ పాప్‌కార్న్ చేసుకుని చూడండి. ఇది ఐదు నిమిషాల్లో రెడీ అయిపోతుంది. ఈవినింగ్ స్నాక్స్‌గా పనికొస్తుంది. పిల్లలు, పెద్దలు ఇద్దరికీ ఇది నచ్చడం ఖాయం. పనీర్ పాప్‌కార్న్ రెసిపీ ఎలాగో చూద్దాం.

పనీర్ పాప్‌కార్న్ రెసిపీకి కావలసిన పదార్థాలు

పనీర్ - 200 గ్రాములు

కార్న్ ఫ్లోర్ - పావు కప్పు

చిల్లీ ఫ్లేక్స్ - ఒక స్పూను

బ్రెడ్ పొడి - ఒక కప్పు

ఉప్పు - రుచికి సరిపడా

నూనె వేయించడానికి - సరిపడా

నీళ్లు - తగినన్ని

ధనియాల పొడి - ఒక స్పూను

జీలకర్ర పొడి - ఒక స్పూను

పసుపు - పావు స్పూను

పనీర్ పాప్‌కార్న్ రెసిపీ

1. పనీర్‌ను క్యూబ్స్ రూపంలో కట్ చేసుకోవాలి. సూపర్ మార్కెట్లలో పనీర్ క్యూబ్స్ నేరుగా దొరుకుతున్నాయి. వాటిని తీసుకుంటే పనీర్ పాప్‌కార్న్ చేయడం చాలా సులువు.

2. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో కార్న్ ఫ్లోర్, ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్, ధనియాల పొడి, జీలకర్ర పొడి వంటివన్నీ వేసి కలుపుకోవాలి.

3. వాటిలో పనీర్ క్యూబ్స్ వేసుకోవాలి. బ్రెడ్ పొడిని మరో పక్కన పెట్టుకోవాలి.

4. ఇప్పుడు మిశ్రమం నుంచి ఒక్కో పనీర్ ముక్కను తీసి బ్రెడ్ పొడిలో రెండుసార్లు ఇటు అటు రోల్ చేయాలి.

5. తరువాత వాటిని ఒక ప్లేట్లో వేయాలి. ఆ ప్లేటును ఫ్రిజ్లో అరగంట పాటు ఉంచాలి.

6. ఈ లోపు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.

7. ఆ నూనె వేడెక్కాక పనీర్ ముక్కలను వేసి నూనెలో డీప్ ఫ్రై చేయాలి. అంతే పనీర్ పాప్‌కార్న్ రెడీ అయినట్టే.

8. ఇది చాలా రుచిగా ఉంటుంది. క్రిస్పీగా ఉంటుంది.

9. వీటిని సాస్‌లో ముంచుకుని తింటే టేస్టీగా ఉంటుంది.

10. పిల్లలకు ఈవినింగ్ పూట ఇవ్వడానికి ఇది బెస్ట్ స్నాక్స్ అని చెప్పుకోవచ్చు.

పనీర్ ప్రయోజనాలు

ఇందులో ప్రధానంగా వాడింది పనీర్. దీన్ని తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. పనీర్లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. శాకాహారులకు ప్రోటీన్ అందించే ఉత్తమ ఆహారం పనీర్. దీనిలో కాల్షియం, విటమిన్ డి లభిస్తాయి. పనీర్ తినే మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే ఛాన్స్ తగ్గుతుంది. మానసిక ఆందోళన, ఒత్తిడిని తట్టుకోవడానికి కావలసిన శక్తిని పనీర్ అందిస్తుంది. అలాగే రేచీకటితో బాధపడుతున్న వారు పనీర్ ను తీసుకుంటే మంచిది. పనీర్లో సెలీనియం అధికంగా ఉంటుంది. కాబట్టి శరీరంలో చేరకుండా ఉంటాయి. మన రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి పనీర్ చాలా అవసరం.

పనీర్ అధికంగా తింటే బరువు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రతిరోజు మితంగానే పనీర్ తినడం అలవాటు చేసుకోవాలి. దీనిలో ప్రోటీన్ అధికంగా, కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. కాబట్టి మధుమేహ రోగులు పనీర్‌ను ఆహారంలో చేర్చుకోవచ్చు. పాల ఉత్పత్తుల ఎలర్జీ ఉన్నవారు మాత్రం పనీరు తమకు పడుతుందో లేదో ఒకసారి చూసుకోవడం చాలా ముఖ్యం. పనీర్ తిన్నాక కడుపు నొప్పిగా, ఉబ్బరంగా, గ్యాస్ వస్తున్నట్టు అనిపిస్తే మీకు పనీర్ అలెర్జీ ఉందేమో అని ఒకసారి టెస్ట్ చేయించుకోవడం మంచిది.

Whats_app_banner