Thursday Motivation: ఈ అలవాట్లు నేర్చుకుంటే ఒక నెలలో మీ జీవితం అందంగా మారుతుంది-motivational story learning these habits will change your life in a month ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Thursday Motivation: ఈ అలవాట్లు నేర్చుకుంటే ఒక నెలలో మీ జీవితం అందంగా మారుతుంది

Thursday Motivation: ఈ అలవాట్లు నేర్చుకుంటే ఒక నెలలో మీ జీవితం అందంగా మారుతుంది

Haritha Chappa HT Telugu
Apr 04, 2024 05:00 AM IST

Thursday Motivation: జీవితం అందంగా, ఆనందంగా సాగాలంటే మీకున్న అలవాట్లే నిర్ణయిస్తాయి. కొన్ని రకాల అలవాట్లను నేర్చుకోవడం ద్వారా జీవితాన్ని మార్చుకోవచ్చు. ఉదయానే చేయాల్సిన కొన్ని పనులు గురించి తెలుసుకోవాలి.

మోటివేషనల్ స్టోరీ
మోటివేషనల్ స్టోరీ (Pixabay)

Thursday Motivation: రోజులో అతి ముఖ్యమైన సమయం ఉదయం. ఉదయాన్నే సానుకూల అలవాట్లు పెంపొందించుకుంటే శారీరకంగా, మానసికంగా ఎంతో ఆరోగ్యంగా ఉండవచ్చు. ఆ రోజంతా ప్రొడక్టివిటీగా పనిచేయవచ్చు. కొన్ని శక్తివంతమైన అలవాట్లను చేర్చుకుంటే... కేవలం ఒక్క నెలలోనే మీ జీవితం ఎంతో మారుతుంది. మీరు చేసే పనిలో ఏకాగ్రత పెరుగుతుంది. మీ మార్గంలో ఎదురొచ్చే సవాళ్లను ఎదుర్కోవడానికి కావలసిన ప్రేరణ మీకు దక్కుతుంది.

ఎంతోమంది విజయవంతమైన వ్యక్తుల దినచర్యలో ముఖ్య లక్షణం తెల్లవారుజామునే లేవడం. పొదెక్కేదాకా నిద్రపోవడం వల్ల బద్ధకం పెరుగుతుంది. కానీ ఉత్సాహం, చురుకుదనం రాదు. ప్రొడక్టివిటీ కూడా పెరగదు. ఉదయం అయిదుగంటల కల్లా నిద్ర లేవడం అలవాటు చేసుకోండి.ఆ రోజంతా ఉత్సాహంగా ఉంటారు. ఒక అరగంట పాటు ధ్యానం, వ్యాయామం వంటివి చేయండి. అలాగే డైరీ రాయడం వంటి పనులు కూడా చేయవచ్చు. మీ శరీరాన్ని, ఆత్మను ప్రశాంతంగా ఉంచుతాయి. ఆ రోజంతా సానుకూలంగా సాగేలా చేస్తాయి.

ధ్యానం చేయడం వల్ల ఆ రోజంతా మీకు ప్రశాంతంగా ఉంటుంది. ఒత్తిడిని తట్టుకునే శక్తి వస్తుంది. మీ దృష్టి, ఏకాగ్రత మీరు చేసే పనులపైనే ఉంటుంది. ధ్యానం చేయడం అంటే... నిశ్శబ్ద వాతావరణంలో మీలో మీరు జీవించడం. మీ శ్వాసపై దృష్టి పెట్టి ధ్యానం అలవాటు చేసుకోండి. ఇది మీ అంతర్గత శాంతికి చాలా ముఖ్యం. అలాగే మీలో స్పష్టమైన ఆలోచనలను కూడా పెంచుతుంది.

శరీరం ఎంత హైడ్రేటెడ్ గా ఉంటే అంతగా మీరు ఆనందంగా ఉంటారు. మీ జీవక్రియ ప్రారంభించడానికి, రాత్రి నిద్రలో వచ్చిన డిహైడ్రేషన్ సమస్యను ఎదుర్కోవడానికి ఉదయాన్నే గ్లాస్ నీటిని తాగడం చాలా అవసరం. శరీరంలో కోల్పోయిన ద్రవాలను నింపాల్సిన బాధ్యత మీదే. ఉదయాన్నే గ్లాసుడు సాధారణ నీళ్లను తాగడం అలవాటు చేసుకోండి. లేదా గోరువెచ్చని నీళ్లను, ఆ గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం వేసుకొని తాగడం వంటివి చేస్తే ఎంతో మంచిది. ఇక బ్రేక్ ఫాస్ట్ లో పండ్లు, కూరగాయలు, లీన్ ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉన్న ఆహారాలను ఎంచుకొని తినాలి. ఇలా చేయడం వల్ల రోజంతా శక్తి స్థిరంగా అందుతుంది. మానసిక స్థితి మెరుగుపడుతుంది.

ప్రతిరోజూ వ్యాయామం చేయడం చాలా అవసరం. శారీరక ఆరోగ్యానికి ఎంతో ముఖ్యం. గంట పాటు నడవడం, యోగా చేయడం వంటివి మీకు అనుకూల శక్తిని ఇస్తాయి. కేవలం 30 నిమిషాలు వ్యాయామం చేయండి చాలు. లేదా 30 నిమిషాలు జోరుగా నడవండి చాలు. మీ శరీరానికి పునరుజ్జీవం వస్తుంది. రిఫ్రెష్ గా ఉంటారు.

మీరు ఎప్పుడూ ఒకరి పట్ల కృతజ్ఞత వైఖరిని అవలంబించండి. ఇది సానుకూల మనస్తత్వాన్ని పెంచుతుంది. ఆరోగ్యకరమైన సంబంధాలు ఈ జీవితంలో చాలా ముఖ్యమైనవి. ఎప్పుడైతే మీ ఆలోచనలు నెగిటివ్ గా ఉంటాయో మీ ఆరోగ్యం కూడా అలానే ఉంటుంది. కాబట్టి మీరు ఆరోగ్యంగా ఉండాలంటే... పూర్తిగా పాజిటివ్ మైండ్ సెట్ తో మాత్రమే ఉండాలి.

లక్ష్యాన్ని పెట్టుకొని పని చేయడం అలవాటు చేసుకోండి. దారి, గమ్యం లేని ప్రయాణం వల్ల ఎలాంటి లాభం లేదు. కాబట్టి ఒక లక్ష్యం పెట్టుకొని... ఆ లక్ష్య సాధనకు ప్రయత్నించండి. దాన్ని సాకారం చేసుకునేందుకు అన్ని విధాలా కృషి చేయండి.

ఇది డిజిటల్ యుగం... ఫోన్ల దగ్గర నుంచి లాప్టాప్ ల వరకు అన్ని పనులు ఎలక్ట్రానిక్ వస్తువుల మీదే నడుస్తున్నాయి. నోటిఫికేషన్లు, ఈమెయిళ్లు, సోషల్ మీడియా అప్డేట్లతో ఎంతోమంది బిజీగా ఉంటారు. అలాంటి బిజీ జీవితంలో చిక్కుకుపోవద్దు. వాటికంటూ ఒక సమయం పెట్టుకోండి. మీ ఉదయం దినచర్యలో భాగంగా డిజిటల్ డిటాక్స్‌ను అమలు చేయండి. అంటే నిద్రలేచాక కనీసం రెండు గంటల పాటు ఫోన్, లాప్టాప్ వంటివి ముట్టుకోకూడదు. మెయిల్స్ చెక్ చేసుకోకూడదు. మీకోసం మాత్రమే మీరు ఆలోచించుకోవాలి. మీకు ఇష్టమైన పనులను మాత్రమే చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీకు మానసిక సంతృప్తి కచ్చితంగా లభిస్తుంది.

Whats_app_banner