Mangalore Bajji Recipe । మంగళూరు బజ్జీలు.. మాన్‌సూన్‌లో మీ మనసు దోచే చిరుతిండి!
Mangalore Bajji Recipe: మంగుళూరు బజ్జీలు మైసూరు బజ్జీలకంటే పరిమాణంలో చిన్నగా ఉంటాయి. ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ఈ కింద సూచనలు చదవండి.
Mangalore Bajji Recipe (istock)
Monsoon Recipes: వర్షాకాలంలో బయట స్ట్రీట్ ఫుడ్ తినకుండా ఉండేందుకు మనల్ని మనం ఎంత కంట్రోల్ చేసుకునేందుకు ప్రయత్నించినా సాధ్యం కాదు. ఈ ఒక్కసారి తిందాం, ఒక్కటే తిందాం అని మొదలుపెడతాం, ఆ తర్వాత లెక్క మరిచిపోతాం. పకోడీలు, మిర్చి బజ్జీలు, పునుగులు, సమోసాలు అంటూ వీధుల వెంబడి ఎన్నెన్నో ఘుమఘుమలు మనల్ని కమ్మగా రమ్మని పిలుస్తాయి. దీనిని ఎదుర్కోవాలంటే ఇంట్లోనే చేసుకోవడం చాలా శ్రేయస్కరం, ఆరోగ్యకరం.
మీకోసం ఇక్కడ మంగుళూరు బజ్జీ రెసిపీని అందిస్తున్నాం, దీనినే గోలిబజ్జీ అంటారు. మంగుళూరు బజ్జీలు మైసూరు బజ్జీలకంటే పరిమాణంలో చిన్నగా ఉంటాయి. ఇవి మనకు తెలిసిన పునుగుల లాగే ఉంటాయి. అయితే, అంతకుమించిన రుచితో ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ఈ కింద సూచనలు చదవండి.
Mangalore Bajji Recipe కోసం కావలసినవి
- 450 గ్రాముల మైదాపిండి
- 1/4 కప్పు కొత్తిమీర ఆకులు (సన్నగా తరిగినవి)
- 1 రెమ్మ కరివేపాకు (సన్నగా తరిగినవి)
- 1 పెద్ద ఉల్లిపాయ
- 1 అంగుళం అల్లం ముక్క
- 2 tsp జీలకర్ర
- ¾ కప్పు పెరుగు
- రుచికి సరిపడా ఉప్పు
- ఒక చిటికెడు బేకింగ్ సోడా
- డీప్ ఫ్రై చేయడానికి నూనె
మంగుళూరు బజ్జీ రెసిపీ- తయారీ విధానం
- ఒక పెద్ద మిక్సింగ్ గిన్నెలో మైదా, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, అల్లం తురుము, జీలకర్ర, పెరుగు, బేకింగ్ సోడా, ఉప్పు వేసి, అన్ని పదార్థాలను బాగా కలపాలి.
- మందపాటి పిండిని తయారు చేయడానికి కొద్దిగా నీరు కలపండి, ఆపై దీనిని సుమారు 10 నిమిషాలు పక్కన పెట్టండి.
- ఇప్పుడు డీప్ ఫ్రై చేసేందుకు సరిపడా కడాయిలో నూనె వేడి చేయండి. నూనె వేడెక్కిన తర్వాత, పిండిని చిన్న బంతులుగా తీసుకొని నూనెలో నెమ్మదిగా జారవిడవండి. బజ్జీలు బంగారు గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి.
- బాగా వేగిన తర్వాత నూనె లోంచి తీసివేసి కిచెన్ టవల్ పేపర్ మీద వేయండి.
- అంతే, మంగుళూరు బజ్జీలు రెడీ.
తాజాగా తయారు చేసిన కొబ్బరి చట్నీతో వేడివేడిగా వడ్డించండి.
సంబంధిత కథనం