Greenpeas Masala Curry Recipe: పచ్చి బఠానీలతో మసాలా కర్రీ, వేడి వేడి అన్నంలో అదిరిపోతుంది-greenpeas masala curry recipe in telugu know how to make it ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Greenpeas Masala Curry Recipe: పచ్చి బఠానీలతో మసాలా కర్రీ, వేడి వేడి అన్నంలో అదిరిపోతుంది

Greenpeas Masala Curry Recipe: పచ్చి బఠానీలతో మసాలా కర్రీ, వేడి వేడి అన్నంలో అదిరిపోతుంది

Haritha Chappa HT Telugu
Dec 20, 2023 05:00 PM IST

Greenpeas Masala Curry Recipe: పచ్చి బఠానీలతో మసాలా కర్రీ ఎలా వండాలో తెలుసుకోండి. ఈ రెసిపీ చాలా సులువు.

పచ్చి బఠానీల మసాలా కర్రీ
పచ్చి బఠానీల మసాలా కర్రీ (Youtube)

పచ్చి బఠానీల మసాలా కర్రీ రెసిపీ

Greenpeas Masala Curry Recipe: పచ్చి బఠానీలు అధికంగా దొరికే కాలం ఇది. తక్కువ ధరకే ఇవి లభిస్తాయి. ఈ కాలంలో మాత్రమే దొరికే వీటిని తినడం చాలా ముఖ్యం. వీటితో తయారు చేసే ఎన్నో రకాల రెసిపీలు ఉన్నాయి. స్నాక్స్, బిర్యానీలు, కూరలు... ఇలా ఎన్నో వీటితో వండుకోవచ్చు. ఇప్పుడు మనం పచ్చి బఠానీలతో మసాలా కర్రీ ఎలా వండాలో తెలుసుకుందాం. ఈ కూరను చూస్తేనే నోరూరిపోతుంది.

పచ్చిబఠాణి మసాలా కర్రీ రెసిపీకి కావలసిన పదార్థాలు

పచ్చి బఠానీలు - పావుకిలో

జీలకర్ర - ఒక స్పూను

ఆవాలు - ఒక స్పూను

నూనె - మూడు స్పూన్లు

కరివేపాకులు - గుప్పెడు

పసుపు - పావు స్పూను

ఉల్లిపాయ - ఒకటి

ఎండుమిర్చి - రెండు

అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూన్

కారం - ఒక స్పూను

టమాటాలు - రెండు

ధనియాల పొడి - ఒక స్పూను

పసుపు - పావుస్పూను

జీలకర్ర పొడి - ఒక స్పూను

గరం మసాలా - అర స్పూను

కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు

నీళ్లు - సరిపడా

పచ్చి బఠానీల మసాలా కర్రీ రెసిపీ

1. పచ్చి బఠానీలను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.

2. ఇప్పుడు టమోటోలను మిక్సీలో వేసి పేస్ట్‌లా చేసి ఒక గిన్నెలో వేసుకోవాలి.

3. ఉల్లిపాయలను సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి.

4. ఇప్పుడు కళాయిని స్టవ్ మీద పెట్టి నూనె వేయాలి. నూనె వేడెక్కాక జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసి వేయించాలి.

5. అవి చిటపడలాడాక ఉల్లిపాయల తరుగు, కరివేపాకు, పసుపు వేసి వేయించుకోవాలి.

6. అవి బాగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ను కూడా వేసి కలపాలి. చిటికెడు ఉప్పు వేస్తే అవన్నీ బాగా వేగుతాయి.

7. ఇప్పుడు పచ్చి బఠానీలు కూడా వేసి బాగా కలుపుకోవాలి. చిన్న మంట మీద మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి.

8. తర్వాత ముందుగా మిక్సీలో చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ వేసి కలపాలి.

9. రెండు నిమిషాలు మూత పెట్టి వేయించాలి. అందులో కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వంటివన్నీ వేసి కలుపుకోవాలి.

10. రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. మూత పెట్టి పావుగంట సేపు ఉడికించాలి.

11. తర్వాత తీసి ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. దగ్గరగా గ్రేవీలాగా అయ్యేవరకు ఉడికించాలి.

12. దించే ముందు కొత్తిమీరను చల్లుకొని స్టవ్ కట్టేయాలి. అంతే పచ్చి బఠానీలతో మసాలా కూర రెడీ అయినట్టే.

13. దీన్ని చపాతీలతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే వేడి వేడి అన్నంలో కలుపుకున్న చాలా రుచిగా ఉంటుంది.

పచ్చి బఠానీలు సీజనల్‌గా దొరుకుతాయని ముందే చెప్పుకున్నాం. కాబట్టి వీటిని కచ్చితంగా తినాలి. ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే శక్తిని కూడా అందిస్తాయి. ఉదయాన్నే పచ్చి బఠానీలతో చేసిన బ్రేక్ ఫాస్ట్‌ను తినడం వల్ల రోజంతా ఉత్సాహంగా, చురుగ్గా ఉంటారు. దీనిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి జీర్ణవ్యవస్థకు ఇది మేలు చేస్తుంది. వీటితో చేసిన ఆహారాలు ఏవైనా రుచిగా కూడా ఉంటాయి.

Whats_app_banner