Curd Vs Buttermilk : పెరుగు Vs మజ్జిగ.. శరీరంలో వేడి తగ్గించేందుకు ఏది బెస్ట్-curd vs buttermilk which is better to beat heat in summer ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Curd Vs Buttermilk : పెరుగు Vs మజ్జిగ.. శరీరంలో వేడి తగ్గించేందుకు ఏది బెస్ట్

Curd Vs Buttermilk : పెరుగు Vs మజ్జిగ.. శరీరంలో వేడి తగ్గించేందుకు ఏది బెస్ట్

Anand Sai HT Telugu
Apr 28, 2023 09:52 AM IST

Curd Vs Buttermilk : ఎండాకాలం కావడంతో చాలా మంది రోజువారీ ఆహారంలో పెరుగు లేదా మజ్జిగను తీసుకుంటారు. ఎందుకంటే ఇవి మండు వేసవిలో శరీరానికి చల్లదనాన్ని అందిస్తాయి. అయితే పెరుగు, మజ్జిగలో శరీరంలోని వేడిని తగ్గించడంలో ఏది మంచిదనే ప్రశ్న చాలా మందికి ఉంటుంది.

పెరుగు వర్సెస్ మజ్జిగ
పెరుగు వర్సెస్ మజ్జిగ

వేసవిలో పెరుగు, మజ్జిగ రెండింటినీ ఎక్కువగా తీసుకుంటాం. ఏది తీసుకుంటే బెటర్ అనే విషయం కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు. మీ మనసులో కూడా ఈ ప్రశ్న ఉందా? ఎండాకాలం(Summer) వస్తే స్పైసీ ఫుడ్ తినడానికి ఎక్కువగా ఇష్టపడరు. ఇప్పటికే విపరీతంగా చెమటలు పట్టే పరిస్థితిలో స్పైసీ ఫుడ్స్ తీసుకోవడం వల్ల శరీరంలో వేడి మరింత పెరిగి చెమట పట్టేలా చేస్తుంది. ఒంట్లో వేడి వల్ల చాలా మంది వేసవిలో తమ ఆహారంలో పెరుగు(Curd), మజ్జిగ(Butter Milk)ను ఎక్కువగా చేర్చుకుంటారు. పెరుగు, మజ్జిగ రెండింటిలోనూ శరీరానికి మేలు చేసే పోషకాలు ఉంటాయి.

పెరుగు, మజ్జిగ రెండూ పాల నుండే వస్తాయి. రెండింటిలోనూ పేగులకు మేలు చేసే ప్రోబయోటిక్స్ ఉంటాయి. కానీ ఒకదాని నుండి మరొకదానికి మారుతున్నప్పుడు, దాని పోషకాలు, లక్షణాలలో స్వల్ప మార్పులు ఉంటాయి. మజ్జిగలో కాల్షియం, విటమిన్ B12, జింక్, రిబోఫ్లావిన్, ప్రోటీన్లు ఉంటాయి. అందువల్ల, మజ్జిగ.. ఎముకలు ఆరోగ్యంగా ఉండేందుకు, చెడు కొలెస్ట్రాల్(Bad Cholesterol) స్థాయిలను తగ్గించడానికి, క్యాన్సర్‌ను నిరోధించడానికి, ఒత్తిడిని తగ్గించేందుకు ఉపయోగపడుతుంది.

పెరుగు(Curd)లో కాల్షియం, ఫాస్పరస్, విటమిన్ బి12, విటమిన్ బి5, విటమిన్ బి2 ఉంటాయి. ఇందులో పొటాషియం, ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. అందువలన ఇది రక్తపోటు, గుండె జబ్బులను నివారిస్తుంది. దంతాలు, ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ప్రధానంగా టెన్షన్, ఒత్తిడి(Stress)ని తగ్గించడంలో సహాయపడుతుంది.

పెరుగు, మజ్జిగ ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు అయినప్పటికీ, వాటిని సరైన సమయంలో తీసుకోవాలి. రాత్రిపూట పెరుగు తినకూడదని ఆయుర్వేదం చెబుతోంది. పెరుగు తినడానికి ఉత్తమ సమయం మధ్యాహ్నం. ఎందుకంటే ఈ సమయంలో జీర్ణవ్యవస్థ బలంగా ఉంటుంది. అలాగే మజ్జిగ నీటి రూపంలో ఉంటుంది కాబట్టి రోజులో ఎప్పుడైనా తీసుకోవచ్చు. అల్పాహారానికి 15 నిమిషాల ముందు తీసుకుంటే.. కడుపు సంబంధిత సమస్యలు ఉంటే నయమవుతాయి.

మజ్జిగ, పెరుగు రెండూ శరీరానికి చల్లదనాన్ని ఇస్తాయి. కానీ పెరుగు కంటే మజ్జిగ శరీరాన్ని ఎక్కువసేపు చల్లగా ఉంచుతుంది. ఎందుకంటే మజ్జిగ నీటి రూపంలో ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారం పెరుగు రోజువారీ ఆహారంలో చేర్చకూడని ఆహార పదార్థం. పెరుగు రోజువారీ తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు పెరుగుతుంది. చర్మ సమస్యలు(Skin Problems), శ్వాస సమస్యలు, దగ్గు మొదలైనవి వస్తాయి.

రోజూ మజ్జిగ తీసుకుంటే శరీరంలోని వివిధ వ్యాధులను నయం చేస్తుంది. ముఖ్యంగా ఇది కాల్షియం లోపాన్ని నయం చేస్తుంది. డీహైడ్రేషన్(Dehydration) సమస్యలను సరిచేస్తుంది. అలాగే శరీరం నుండి అవాంఛిత హానికరమైన టాక్సిన్స్‌ను తొలగిస్తుంది. జీర్ణ ప్రక్రియలో సహాయపడుతుంది. నోటి, పొట్టలో పుండ్లను నయం చేస్తుంది. ఆయుర్వేదం ప్రకారం, పైల్స్ ఉన్నవారు పెరుగు తినకూడదు. బదులుగా మజ్జిగ మాత్రమే తాగాలి. పెరుగు నుంచే వచ్చినా, వేసవిలో తాగడానికి ఉత్తమమైనది మజ్జిగ. మజ్జిగ తాగండి.. మీ శరీరాన్ని చల్లగా ఉంచుకోండి.

WhatsApp channel