Garmi Web Series Review: యూనివర్సిటీల్లోని స్టూడెంట్స్ పాలిటిక్స్‌కు అద్దం పట్టిన గర్మీ.. వెబ్ సిరీస్ రివ్యూ
Garmi Web Series Review: యూనివర్సిటీల్లోని స్టూడెంట్స్ పాలిటిక్స్‌కు అద్దం పట్టింది గర్మీ వెబ్ సిరీస్. టాలెంటెడ్ డైరెక్టర్ తిగ్మాంషు ధూలియా డైరెక్ట్ చేసిన ఈ సిరీస్ సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది.
Garmi Web Series Review: యూనివర్సిటీల్లో స్టూడెంట్స్ పాలిటిక్స్ పై ఇప్పటికే ఎన్నో సినిమాలు, సిరీస్ లు చూసే ఉంటారు. తాజాగా మరో వెబ్ సిరీస్ కూడా వచ్చింది. ఈ సిరీస్ పేరు గర్మీ(Garmi). మరి ఈ కొత్త సిరీస్ ఎలా ఉంది? అసలు స్టోరీ ఏంటి? మస్ట్ వాచ్ సిరీసా లేక టైంపాస్ కోసం చూడొచ్చా అన్నది ఇక్కడ చూద్దాం.
వెబ్ సిరీస్: గర్మీ (Garmi)
నటీనటులు: వ్యోమ్ యాదవ్, దిశా ఠాకూర్, నూరగ్ ఠాకూర్, వినీత్ కుమార్, ముకేశ్ తివారీ
క్రియేటర్, డైరెక్టర్: తిగ్మాంషు ధూలియా
స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్: సోనీ లివ్ (sony liv)
రన్‌టైమ్: 9 ఎపిసోడ్లు, ఒక్కొక్కటి సుమారు 45 నిమిషాలు
గర్మీ (Garmi) కథేంటి?
మన యూనివర్సిటీల్లో పాలిటిక్స్ గురించి తెలిసే ఉంటుంది. కానీ యూపీలోని యూనివర్సిటీల్లో పాలిటిక్స్ ఎలా ఉంటాయో కళ్లకు కట్టింది ఈ గర్మీ వెబ్ సిరీస్. ఎలాగైనా యూపీఎస్సీ కొట్టి ఐఏఎస్ కావాలని కలలు కనే అరవింద్ (వ్యోమ్) అనే స్టూడెంట్ చుట్టూ తిరిగే కథ ఇది. యూపీలోని ఓ చిన్న టౌన్ నుంచి అంతకుముందే ఎంతో మంది గొప్ప వ్యక్తులను దేశానికి అందించిన త్రివేణిపూర్ యూనివర్సిటీ తన కలను నెరవేర్చుకోవడానికి వస్తాడు.
అయితే ఆ యూనివర్సిటీలోని రెండు గ్రూపుల మధ్య ఆధిపత్యం కోసం జరుగుతున్న పోరులో అరవింద్ చిక్కుకుంటాడు. తెలివిపరుడే అయినా ఆవేశం ఎక్కువగా ఉండే అరవింద్.. అనుకోకుండానే ఆ పాలిటిక్స్ అనే బురదలో చిక్కుకుంటాడు. రెండు గ్రూపుల మధ్య నలిగిపోతాడు. ఈ క్రమంలోనే అదే యూనివర్సిటీలో పరిచయమైన తన గర్ల్‌ఫ్రెండ్ ను కూడా కోల్పోతాడు.
జైలుకు వెళతాడు. పోలీసుల లాఠీ దెబ్బల రుచి చూస్తాడు. చివరికి తన గర్ల్‌ఫ్రెండ్ మరణానికి కారణమైన యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ లీడర్ హత్యకు కూడా ప్రయత్నిస్తాడు. ఆ క్రమంలోనే యూనివర్సిటీ రాజకీయాలను బయటి నుంచి శాసించే పెద్దల దృష్టిలోనూ పడతాడు. ఏకంగా స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్ష పదవి కోసం పోటీలో నిలబడే స్థాయికి చేరుకుంటాడు.
గర్మీ (Garmi) ఎలా ఉందంటే?
ఇప్పటికే వివిధ జానర్ లలో వెబ్ సిరీస్ లు రూపొందించిన టాలెంటెడ్ డైరెక్టర్ తిగ్మాంషు ధూలియా.. ఈ గర్మీ (Garmi) వెబ్ సిరీస్ రూపొందించాడు. మర్డర్ మిస్టరీ నేపథ్యంలో సాగే ది గ్రేట్ ఇండియన్ మర్డర్, థ్రిల్లర్ సిరీస్ ఔట్ ఆఫ్ లవ్, కోర్ట్ డ్రామా క్రిమినల్ జస్టిస్ లాంటి వెబ్ సిరీస్ లు రూపొందించిన తిగ్మాంషు.. ఈసారి యూనివర్సిటీ పాలిటిక్స్ ను తన కథాంశంగా ఎంచుకున్నాడు.
నిజానికి చాలా కాలంగా ఎన్నో బాలీవుడ్ సినిమాల్లో చూపించిన కథనే ఎంచుకొని అతడు సాహసమే చేశాడు. రాష్ట్ర రాజధానిలో కూర్చునే పెద్దలు యూనివర్సిటీల్లోని పాలిటిక్స్ ను ఎలా శాసిస్తారు? దానికి అమాయకులైన స్టూడెంట్స్ ఎలా బలవుతారన్నది ఈ సిరీస్ లో చూడొచ్చు. స్టోరీ పాతదే అయినా ఇందులోని ఒక్కో పాత్రను మలచిన తీరు సిరీస్ పై ఆసక్తి రేపుతోంది.
అమాయకుడు, చదువుకొని ఏదైనా సాధించాలన్న పట్టుదల కలిగిన యువకుడే అయినా ఆవేశం అనేది ఎలా తప్పుదోవ పట్టిస్తుందో అరవింద్ అనే లీడ్ క్యారెక్టర్ ద్వారా దర్శకుడు ఈ వెబ్‌సిరీస్‌లో చెప్పే ప్రయత్నం చేశాడు. ఈ 21వ శతాబ్దంలోనూ యూపీలాంటి రాష్ట్రాల్లో ఉన్న కులాల కుంపట్లను కూడా ఈ సిరీస్ లో చక్కగా చూపించారు. నక్సలైట్లు, కమ్యూనిస్టుల సిద్ధాంతం, అవినీతిలాంటి అంశాలనూ ఇందులో స్పృషించారు.
గర్మీ (Garmi).. వీళ్ల నటనే ప్లస్
అరవింద్ అనే లీడ్ క్యారెక్టర్ కు వ్యోమ్ యాదవ్ పూర్తి న్యాయం చేశాడని చెప్పాలి. ఇంతకుముందు ఢిల్లీ క్రైమ్ అనే సిరీస్ లో కనిపించిన అతడు.. ఈ గర్మీలో పూర్తి స్థాయి పాత్ర పోషించాడు. గోవింద్ అనే స్టూడెంట్ లీడర్ పాత్రలో కనిపించిన అనురాగ్ ఠాకూర్, మృత్యుంజయ్ సింగ్ అనే పోలీసు ఇన్సెక్టర్ పాత్రలో కనిపించిన జతిన్ గోస్వామిలాంటి వాళ్లు చాలా సహజంగా నటించారు.
యూపీఎస్సీ క్లియర్ చేయాలన్న లక్ష్యంతో వచ్చిన కుర్రాడు.. ఏకంగా స్టూడెంట్ లీడర్ గా ఎదిగిన క్రమాన్ని ఈ గర్మీలో చూపించారు. స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్ష పదవి ఎన్నికలకు అరవింద్ సిద్ధమవుతున్న సమయంలో అతను భవిష్యత్తులో ఎదుర్కోబోయే సవాళ్లను చూపిస్తూ.. గర్మీ రెండో సీజన్ పై ఆసక్తి రేపేలా తొలి సీజన్ ముగించారు. ఓవరాల్ గా యూనివర్సిటీ పాలిటిక్స్ ను కళ్లకు కట్టిన ఈ గర్మీ వెబ్ సిరీస్ ఓ మంచి ప్రయత్నమే అని చెప్పొచ్చు.
సంబంధిత కథనం