Co-Branded Credit cards | కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డు ప్రయోజనాలు తెలుసా?
Co-Branded credit card | కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డు అంటే ఒక క్రెడిట్ కార్డు సంస్థ, ఒక ఉత్పత్తులు లేదా సేవలు అందించే సంస్థ కలిసి ఒక ఒప్పందం చేసుకుని రెండింటి పేరు కలిపి ఒక క్రెడిట్ కార్డు సృష్టించడమే. ఇందులో ఆ రెండు సంస్థలకు మాత్రమే కాకుండా సంబంధిత క్రెడిట్ కార్డు హోల్డర్‌కు కూడా ప్రయోజనమే.
మీరు చాలా కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులు చూసే ఉంటారు. ఎస్‌బీఐ - బిగ్ బజార్, ఐసీఐసీఐ - అమెజాన్ పే, ఎస్‌బీఐ - ఐఆర్సీటీసీ, ఫ్లిప్‌కార్ట్ - యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు, ఎస్‌బీఐ - యాత్ర క్రెడిట్ కార్డు, మేక్ మై ట్రిప్ - ఐసీఐసీఐ సిగ్నేచర్ కార్డు, విస్తారా ఎయిర్ లైన్స్ - యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు, ఇండియన్ ఆయిల్ - సిటీ ప్లాటినమ్ క్రెడిట్ కార్డు.. ఇలా అనేక కో-బ్రాండెడ్ కార్డులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.
వీటి పేరులోనే మనకు ఆయా కార్డుల ప్రాముఖ్యత, ప్రాధాన్యత తెలిసిపోతుంది. వీటి ద్వారా కేవలం ఆయా బ్రాండెడ్ సేవలను మాత్రమే కాకుండా, సాధారణ క్రెడిట్ కార్డులా అన్ని సేవలు కూడా పొందవచ్చు. కానీ ఆయా బ్రాండ్ సేవలపై ప్రత్యేక రాయితీలు, ప్రోత్సాహకాలు లభిస్తాయి.
ఉదాహరణకు ఐసీఐసీఐ - అమెజాన్ పే క్రెడిట్ కార్డు ప్రత్యేకత ఏంటంటే.. మీకు నెలవారీ సరుకులు, ఇతరత్రా షాపింగ్ ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేసే అలవాటు ఉంటే ఇది బంపర్ ఆఫర్ కిందే లెక్క. ఎందుకంటే మీరు అమెజాన్‌లో కొనుగోలు చేసే ప్రతి ఆర్డర్‌పై ఇతర డిస్కౌంట్లు పోనూ 5 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అందుతుంది.
అంతేాకాదు మీరు యుటిలిటీ బిల్లుల చెల్లింపు చేస్తున్నప్పుడు మీకు 2 శాతం నుంచి 5 శాతం వరకు క్యాష్ బాక్ అందుతుంది. ప్రతి ట్రాన్సాక్షన్‌కు రివార్డులు లభిస్తాయి. ఈ రివార్డులు మీకు అమెజాన్ పే బాలెన్స్ రూపంలో వచ్చిచేరుతాయి. అంతేకాదు పండగలు, ఇతర ప్రత్యేక సందర్భాల్లో వచ్చే గ్రేట్ ఇండియా సేల్ వంటి ప్రత్యేక అమ్మకాల్లో ఒక్కోసారి ఈ కో బ్రాండెడ్ కార్డుపై 10 శాతం అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఇంచుమించుగా ఫ్లిప్‌కార్ట్ - యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు కూడా ఇదే రీతిలో పనిచేస్తోంది.
మీ అవసరాలను బట్టి..
కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డులను మీ అవసరాలను బట్టి ఎంచుకోవాలి. మీరు రెగ్యులర్‌గా చేసే ఖర్చును బట్టి ఈ కార్డులను ఎంచుకోవడం మేలు. మీరు తరచూ విమాన ప్రయాణాలు చేసే వారైతే ట్రావెల్ సంస్థకు చెందిన కో బ్రాండెడ్ కార్డు, లేదా విమానయాన సంస్థకు సంబంధించిన కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డు తీసుకుంటే మీకు ప్రయోజనం చేకూరుతుంది. అవి ఇచ్చే రివార్డులను తిరిగి వాటి సేవలు పొందేందుకు ఉపయోగించుకోవచ్చు. విమానయాన సంస్థల కో బ్రాండెడ్ కార్డులు అవి ఇచ్చే రివార్డులతో ఉచిత విమాన టికెట్ కూడా పొందవచ్చు.
అలాగే మీరు తరచుగా రోడ్డు ప్రయాణం చేసేవారైతే, మీరు పెట్రోల్, డీజిల్ అధికంగా వినియోగించేవారైతే మీరు పెట్రోలియం సంస్థల కోబ్రాండెడ్ కార్డులు తీసుకోవడం ప్రయోజనం చేకూరుస్తుంది. అలాగే మీరు తరచూ రెస్టారెంట్లకు వెళ్లాల్సి వస్తే డైనర్స్ క్లబ్ - హెచ్‌డీఎఫ్‌సీ కార్డు వంటివి ఉపయోగపడతాయి. వీటి వల్ల మీరు డిస్కౌంట్లు పొందవచ్చు.
రివార్డులు, క్యాష్ బ్యాక్‌లు కేవలం 5 శాతం, 4 శాతం, 3 శాతమే అని చూడకండి. కేవలం అమెజాన్ లో సగటున నెలకు ఐదారు వేల రూపాయల షాపింగ్ చేస్తే ఏడాదికి ఏడెనిమిది వేల రూపాయల మేర రివార్డులు పొందవచ్చని అంచనా. మీరు బాగా ఖర్చు చేసే వారైతే మీకు మరింత ప్రయోజనం లభిస్తుంది.
సంస్థలకు ఏం లాభం?
కో - బ్రాండెడ్ కార్డులను జారీ చేసే రెండు సంస్థలకు కూడా ప్రయోజనం ఉంటుంది. సాధారణంగా సేవలు, ఉత్పత్తులు అందించే సంస్థలు తమ సేవలు, ఉత్పత్తులను అమ్ముకునేందుకు మధ్యవర్తులకు నాలుగైదు శాతం అఫ్లియేట్ కమిషన్, బ్రోకరేజ్ కమిషన్ తదితర రూపాల్లో చెల్లిస్తాయి. ఇక్కడ ఆయా అఫ్లియేట్ కమిషన్లు మధ్యవర్తులకు ఇవ్వాల్సిన అవసరం లేకుండా ఆమేరకు డిస్కౌంట్లు ఇస్తాయి. కో-బ్రాండెడ్ కార్డు కలిగిన వినియోగదారుడు డిస్కౌంట్ కోసం తప్పనిసరిగా మళ్లీమళ్లీ అదే బ్రాండ్ సేవలను వినియోగిస్తారు. ఇక క్రెడిట్ కార్డు సంస్థ కూడా ఈ సదుపాయం వల్ల ఇంకా చాలా మంది ఖాతాదారులను సమకూర్చుకోగలుగుతుంది.
సంబంధిత కథనం
టాపిక్