OG Glimpse: అన్నీ పేలుతాయి.. ఊహలకు మించి!: ‘ఓజీ’ గురించి హింట్ ఇచ్చిన డీవీవీ ఎంటర్‌టైన్‍మెంట్స్-you can expect never before high on september 2 dvv entertainments on og movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Og Glimpse: అన్నీ పేలుతాయి.. ఊహలకు మించి!: ‘ఓజీ’ గురించి హింట్ ఇచ్చిన డీవీవీ ఎంటర్‌టైన్‍మెంట్స్

OG Glimpse: అన్నీ పేలుతాయి.. ఊహలకు మించి!: ‘ఓజీ’ గురించి హింట్ ఇచ్చిన డీవీవీ ఎంటర్‌టైన్‍మెంట్స్

Chatakonda Krishna Prakash HT Telugu
Jan 08, 2024 06:32 PM IST

OG Glimpse: ఓజీ టీజర్ కోసం పవన్ కల్యాణ్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అప్‍డేట్లు లేకపోవటంతో కొందరు చిత్ర యూనిట్‍పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్ స్పందించింది.

ఓజీ పోస్టర్
ఓజీ పోస్టర్

OG Glimpse: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న ‘ఓజీ’ చిత్రంపై అంచనాలు అత్యంత భారీగా ఉన్నాయి. ఈ సినిమాలో గ్యాంగ్‍స్టర్‌గా పవన్ నటిస్తుండటంతో మరింత క్రేజ్ ఏర్పడింది. సుజీత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సాహో తర్వాత ఆయన డైరెక్షన్ చేస్తున్న మూవీ ఇదే. పాన్ ఇండియా లెవెల్‍లో ఓజీ రూపొందుతోంది. సెప్టెంబర్ 2న పవన్ కల్యాణ్ పుట్టిన రోజు కావటంతో ఓజీ టీజర్ లేదా గ్లింప్స్ వస్తుందనే అంచనాలు భారీగా ఉన్నాయి. సోషల్ మీడియాలో ఫుల్ బజ్ నడుస్తోంది. ఈ తరుణంలో ఈ సినిమాను నిర్మిస్తున్న డీవీవీ ఎంటర్‌టైన్‍మెంట్స్ ఇచ్చిన ఓ రిప్లై ఆసక్తికరంగా మారింది.

పవన్ బర్త్ డే అయిన సెప్టెంబర్ 2న ఓజీ టీజర్/గ్లింప్స్ వస్తుందని కొంతకాలంగా ప్రచారం జరుగుతున్నా.. మూవీ యూనిట్ మాత్రం ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు. దీంతో పవర్ స్టార్ అభిమానుల్లో అసంతృప్తి పెరుగుతోంది. ఓజీ గురించి ప్రకటన చేయాలని డీవీవీ ఎంటర్‌టైన్‍మెంట్స్‌ను డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ యూజర్ ‘ఎక్స్’ (ఇంతకు ముందు ట్విట్టర్) ప్లాట్‍ఫామ్‍లో ఓ ట్వీట్ చేశారు. “అరేయ్ మైండ్ పనిచేయట్లేదా.. ఏదో ఒకటి మాట్లాడరా” అంటూ డీవీవీ ఎంటర్‌టైన్‍మెంట్స్‌ను ట్యాగ్ చేసి ట్వీట్ చేశారు. దీనికి డీవీవీ ఎంటర్‌టైన్‍మెంట్స్‌ స్పందించింది.

“రేయ్.. ఆగండి.. అన్నీ పేలతాయి. మీరు ఎప్పుడూ పొందని హైను సెప్టెంబర్ 2న అంచనా వేయవచ్చు” అని డీవీవీ ఎంటర్‌టైన్‍మెంట్స్‌ రిప్లై ఇచ్చింది. అంటే సెప్టెంబర్ 2న ఏదో అప్‍డేట్ ఇస్తున్నట్టు ధ్రువీకరించింది. అయితే, ఓజీ టీజర్ గురించే ఆ సంస్థ హింట్ ఇచ్చిందని నెటిజన్లు అంచనా వేస్తున్నారు. సెప్టెంబర్ 2న ఓజీ టీజర్ లేదా గ్లింప్స్ రావడం పక్కా అంటూ సంతోషిస్తున్నారు.

ఓజీ గ్లింప్స్/టీజర్ 72 సెకన్ల నిడివితో ఉంటుందని కొంతకాలంగా సమాచారం చక్కర్లు కొడుతోంది. తమిళ యాక్టర్ అర్జున్ దాస్ ఈ టీజర్‌కు వాయిస్ ఓవర్ ఇచ్చారని టాక్.

ఓజీ సినిమా ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉండనుంది. పవర్ ఫుల్ గ్యాంగ్‍స్టర్ పాత్రను పవన్ కల్యాణ్ చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‍గా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్‍ పాత్ర పోషిస్తుండగా.. ప్రకాశ్ రాజ్, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి కీరోల్స్ చేస్తున్నారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‍మెంట్స్‌ బ్యానర్‌పై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Whats_app_banner