Project K: ‘ప్రాజెక్ట్ కే’ టైటిల్ ఏంటి? సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న 4 పేర్లు ఇవే!-what is k in project k four titles surfacing on social media ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Project K: ‘ప్రాజెక్ట్ కే’ టైటిల్ ఏంటి? సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న 4 పేర్లు ఇవే!

Project K: ‘ప్రాజెక్ట్ కే’ టైటిల్ ఏంటి? సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న 4 పేర్లు ఇవే!

Chatakonda Krishna Prakash HT Telugu
Jul 09, 2023 07:57 PM IST

Project K: ప్రాజెక్ట్ కే.. సినిమా టైటిల్ ఏంటనేది ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది. ‘కే’ అంటే ఏంటో కొన్ని టైటిళ్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ప్రాజెక్ట్ కే పోస్టర్
ప్రాజెక్ట్ కే పోస్టర్

Projeck K: అత్యంత భారీ బడ్జెట్‍తో గ్లోబల్ సినిమాగా ‘ప్రాజెక్ట్ కే’ రూపొందుతోంది. స్టార్ హీరో ప్రభాస్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తుండగా.. బాలీవుడ్ సీనియర్ స్టార్ అమితాబ్ బచ్చన్, లోకనాయకుడు కమల్ హాసన్, ప్రముఖ హీరోయిన్ దీపికా పదుకొణ్, దిశా పటానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్‍గా ప్రాజెక్ట్ కే రూపొందుతోంది. ప్రతిష్టాత్మక సాన్ డిగో కామిక్ కాన్ ఈవెంట్‍లో అడుగుపెట్టనున్న తొలి భారతీయ చిత్రంగా ‘ప్రాజెక్ట్ కే’ చరిత్ర సృష్టించనుంది. జూలై 19న ఈ ఈవెంట్‍లో ప్రాజెక్ట్ కే అఫీషియల్ టైటిల్, టీజర్‌ను చిత్ర యూనిట్ ప్రకటించనుంది. అయితే, ఈలోగానే ప్రాజెక్ట్ కే టైటిల్ ఇదేనంటూ సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు పలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ‘ప్రాజెక్ట్ కే’లో ‘కే’ ఇదేనంటూ ట్వీట్లు చేస్తున్నారు. అలా, నాలుగు టైటిళ్లు ఎక్కువగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ప్రాజెక్ట్ కే చిత్రంలో కే అంటే కాలచక్ర, కురుక్షేత్ర అంటూ చాలా మంది ట్విట్టర్‌లో అంచనా వేస్తున్నారు. ఈ సినిమాలో వివిధ టైమ్ లైన్లు ఉంటాయని అందుకే ‘కాలచక్ర’ (Kalachakra) అనే టైటిల్ ఉండనుందని కొందరు ట్వీట్లు చేస్తున్నారు. కాలచక్ర హ్యాష్‍ట్యాగ్‍తో ట్వీటుతున్నారు. ఇక ఫ్రాంచైజీగా యుద్ధాల్లాంటి సీన్లతో ప్రాజెక్ట్ కే ఉండనుందని.. అందుకే కే అంటే ‘కురుక్ష్రేత’ (Kurukshetra) అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ప్రాజెక్ట్ కే టైటిల్ కురుక్ష్రేత్ర అని అంటున్నారు.

ప్రాజెక్ట్ కే సినిమా భారతీయ పురాణాల ఆధారంగా ఉంటుందని అంచనాలు ఉన్నాయి. దీంతో విష్ణుమూర్తి పదో అవతారమైన ‘కల్కి’ (Kalki) అని ప్రాజెక్ట్ కే టైటిల్ ఉంటుందని కొందరు సోషల్ మీడియాలో అభిప్రాయపడుతున్నారు. ప్రాజెక్ట్ కేలో కే అంటే కర్ణ (Karna) అని మరికొందరు ట్వీట్లు చేస్తున్నారు. మొత్తంగా ప్రాజెక్ట్ కే టైటిల్ ఏంటనేది సోషల్ మీడియాలో హాట్‍ టాపిక్‍గా ఉంది. అయితే, ప్రాజెక్ట్ కే అధికారిక టైటిల్ గురించి స్పష్టత రావాలంటే జూలై 19వ తేదీ వరకు ఆగాల్సింది. వీటిలో ఏదైనా ఓ టైటిల్ ‘ప్రాజెక్ట్ కే’కు ఉంటుందా.. వేరే టైటిల్ ఉంటుందా అనే విషయంపై అప్పటి వరకు సస్పెన్స్ కొనసాగనుంది.

ప్రాజెక్ట్ కే చిత్రాన్ని వైజయంతి మూవీస్ పతాకంపై సీహెచ్ అశ్వినీదత్ నిర్మిస్తున్నాడు. సంతోశ్ నారాయణ్ సంగీతం అందిస్తున్నాడు. హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ డోర్జే స్టోజిల్‍కోవిచ్.. ఈ చిత్రానికి పని చేస్తున్నాడు. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదల కానుంది. భారతీయ భాషలతో పాటు కొన్ని విదేశీ భాషల్లోనూ రిలీజ్ అవుతుంది.

భారతీయ పురాణాల ఆధారంగా ‘ప్రాజెక్ట్ కే’ను డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నాడని తెలుస్తోంది. ఈ చిత్రంలో విష్ణుమూర్తిగా ప్రభాస్ కనిపిస్తాడన్న ఊహాగానాలు ఇటీవల బయటికి వచ్చాయి. హాలీవుడ్ సినిమాల్లా ప్రాజెక్ట్ కే సినిమాటిక్ యూనివర్స్‌గా ఉంటుందని తెలుస్తోంది. ప్రాజెక్ట్ కే రెండో భాగంగా కూడా ఉండనుంది.

Whats_app_banner