Srikanth Addala: ‘పెదకాపు 1’ చిత్రానికి పవన్ కల్యాణ్‍ను స్పూర్తిగా తీసుకున్నారా?: శ్రీకాంత్ అడ్డాల ఆన్సర్ ఇదే
Srikanth Addala: పెదకాపు 1 చిత్రం కోసం పవన్ కల్యాణ్‍ను స్ఫూర్తిగా తీసుకున్నారా అనే ప్రశ్నకు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల సమాధానం ఇచ్చారు. అలాగే, అందరూ సామాన్యులే అంటూ మంచి స్పీచ్ ఇచ్చారు.
Srikanth Addala: శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన పెదకాపు 1 సినిమా ట్రైలర్ నేడు రిలీజ్ అయింది. రా అండ్ రస్టిక్ రూరల్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం ఉండనుంది. సెప్టెంబర్ 29న ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ కానుంది. కొన్ని వర్గాల, కొందరు నాయకుల అణచివేతను, ఆధిపత్యాన్ని ఎదిరించి ఓ సామాన్యుడు నాయకుడిగా ఎదిగే కథాంశంతో పెదకాపు 1 చిత్రాన్ని ఆయన తెరకెక్కించినట్టు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. విరాట్ కర్ణ ఈ చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా ట్యాగ్ లైన్ కూడా ‘ఓ సామాన్యుడి సంతకం’ అని ఉంది. పెదకాపు 1 ట్రైలర్ లాంచ్ ఈవెంట్‍లో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కొన్ని ఆసక్తికర ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.
సామాన్యుడి సంతకం అని ఉండటంతో పెదకాపు 1 చిత్రం కోసం పవర్ స్టార్, జనసేనాని పవన్ కల్యాణ్‍ను స్ఫూర్తిగా తీసుకున్నారా అని శ్రీకాంత్ అడ్డాలకు ప్రశ్న ఎదురైంది. “సామాన్యుడి సంతకం అని ట్యాగ్ లైన్ పెట్టారు. పవన్ కల్యాణ్ కూడా సామాన్యుడినంటూ రాజకీయ రంగంలోకి దిగి భారీగా ప్రచారం చేస్తున్నారు. ఆయన క్యారెక్టర్ స్ఫూర్తి ఏమైనా ఇందులో ఉందా” అని ఒకరు శ్రీకాంత్‍ను ప్రశ్న అడిగారు. అయితే, పవన్ కల్యాణ్‍ను దృష్టిలో పెట్టుకొని ఈ చిత్రం చేయలేదని, ఇది మొత్తం సామాన్యులందరికీ సంబంధించిందని చెబుతున్నానని శ్రీకాంత్ అడ్డాల అన్నారు. అలాగే, లోకంలో దాదాపు అందరూ సామాన్యులేనని ఈ ఆన్సర్‌కు ముందు తన ఫిలాసఫీ చెప్పారు.
“ఎవరైనా సామాన్యులే. ఏ కులమైనా.. ఏ మతమైనా.. ఏ స్థానంలో ఉన్నా.. ఎంత ధనవంతులైనా అందరూ సామాన్యులే. అందరిలోనూ అన్ని ఎమోషన్లు ఉంటాయి. ఎవరం కూడా చాలా ఉన్నతంగానో.. ఉత్తమంగానో ఉండే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనందరం సాధారణమైన వారం. ఎందుకంటే మనలోనూ కోపాలు ఉంటాయి, ఈర్ష్య ఉంటుంది.. మనలోనూ తాపాలు ఉంటాయి. అలాగే మంచి కోసం ప్రయత్నం నిరంతరం ఉంటూనే ఉంటుంది” అని శ్రీకాంత్ అడ్డాల చెప్పారు. అలాగే, పవన్ కల్యాణ్‍ను దృష్టిలో పెట్టుకొని ఈ చిత్రాన్ని తీయలేదని అడ్డాల స్పష్టం చేశారు.
కొత్తబంగారు లోకం, సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు లాంటి చిత్రాలు చేసిన తాను.. యాక్షన్ సినిమాలకు ఎందుకు మారారన్న ప్రశ్నకు కూడా ఆయన సమాధానం చెప్పారు. ఒక డైరెక్టర్‌గా ఉన్నప్పుడు ఎలాంటి సబ్జెట్‍నైనా డీల్ చేయాల్సిందేనని శ్రీకాంత్ చెప్పారు. నారప్పతో యాక్షన్ మోడ్‍లోకి మారిన శ్రీకాంత్ అడ్డాల.. పెదకాపు 1ను కూడా అదే జానర్‌లో తెరకెక్కించారు.
పెదకాపు 1 చిత్రాన్ని ద్వారకా క్రియేషన్స్ నిర్మించగా.. మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. ప్రగతి శ్రీవాత్సవ, రావురమేశ్, నాగబాబు, తనికెళ్ల భరణి, బ్రిగాడ సాగా, రాజీవ్ కనకాల కీలకపాత్రలు చేశారు. డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల కూడా ముఖ్యమైన పాత్ర పోషించారు.
సంబంధిత కథనం