The Kashmir Files in OTT | ఓటీటీలో కశ్మీర్ ఫైల్స్ వచ్చేది అప్పుడే.. ఎందులో అంటే?
వివేక్ అగ్నిహోత్రి నిర్మించి, దర్శకత్వం వహించిన ది కశ్మీర్ ఫైల్స్ చిత్రం జీ5లో స్ట్రీమింగ్ కానుంది. మొదట ఏప్రిల్‌లో ఓటీటీలో విడుదల చేయాలని భావించినప్పటికీ.. మే మాసంలో తీసుకురావాలని చిత్రబృందం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
చిన్న సినిమాగా విడుదలై దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న సినిమా ‘ది కశ్మీర్ ఫైల్స్’. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ చిత్రం గురించే చర్చ నడుస్తోంది. సామాన్యుడు నుంచి సెలబ్రెటీల వరకు ఎంతో మంది ఈ సినిమాపై ప్రశంసల వర్షాన్ని కురిపిస్తున్నారు. రాజీకయ నాయకులు సైతం ఈ చిత్రంపై సానుకూలంగా స్పందిస్తున్నారు. తొలి రోజు సాధారణంగా వసూళ్లను రాబట్టి ఈ చిత్రం.. రెండో రోజు, మూడో రోజు కలెక్షన్లు మూడు రెట్లు పెరిగాయంటే ఈ సినిమా ఎంతో సంచలనం సృష్టిస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం ప్రజలు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం ఓటీటీ హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ జీ5 సొంతం చేసుకుంది.
వాస్తవానికి ఈ సినిమా థియేటర్లలో విడుదలైన నాలుగు వారాలు తర్వాత ఓటీటీలో రిలీజ్ చేయాలని చిత్రబృందం భావించింది. అయితే ఈ మూవీకి పెరుగుతున్న ప్రేక్షకాదరణ చూసి తమ నిర్ణయాన్ని మార్చుకున్నారట. నాలుగు వారాలంటే ఏప్రిల్‌లో కాకుండా మే నెలలో ది కశ్మీర్ ఫైల్స్ సినిమాను ఓటీటీలో విడుదల చేయాలని ప్రణాళికను రూపొందిస్తున్నట్లు సమాచారం. మే 6న స్ట్రీమింగ్ అయ్యే అవకాశమున్నట్లు చిత్రవర్గాల ద్వారా తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంపై అధికారిక సమాచారం వచ్చే అవకాశముంది.
ఇదిలా ఉంటే ఈ సినిమాకు ప్రేక్షకాదరణ రోజురోజుకు పెరుగుతోంది. ఎంతో మంది సినీ, రాజకీయ ప్రముఖులు ఈ చిత్రాన్ని చూసి సానుకూలంగా స్పందించడమే కాకుండా తప్పకుండా చూడాల్సిందిగా విన్నవిస్తున్నారు. అంతేకాకుండా ది కశ్మీర్ ఫైల్స్ సినిమాకు పలు రాష్ట్రాల ప్రభుత్వాలు వినోదపు పన్ను మినహాయింపును ఇచ్చాయి. అసోం గవర్నమెంట్ అయితే తమ ఉద్యోగులకు సెలవు కూడా మంజూరు చేసింది.
1990లో కశ్మీర్‌లో హిందూ పండిట్లపై జిహాదీలు దారుణ మారణకాండకు పాల్పడ్డారు. వారు ఆస్తులను స్వాధీనం చేసుకుని స్వదేశంలోనే శరణార్థులుగా అయ్యేలా చేశారు. అప్పుడు కశ్మీర్ లోయలో జరిగిన ఈ భయానక సంఘటనలకు, భావోద్వేగాలకు ఈ సినిమా అద్దం పట్టింది. ఈ సినిమాలో మిథున చక్రవర్తి, అనుపమ్ ఖేర్, దర్శన్ కుమార్ పల్లవి జోష్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. వివేక్ అగ్నిహోత్రి నిర్మించి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జీ స్టూడియోస్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై ఈ సినిమాను నిర్మించారు.
సంబంధిత కథనం
టాపిక్