Valatty OTT Streaming: ఓటీటీలోకి వచ్చేసిన డాగ్స్ లవ్ మూవీ ‘వాలట్టి’.. తెలుగులోనూ స్ట్రీమింగ్: వివరాలివే..
Valatty OTT Streaming: వాలట్టి సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‍కు వచ్చింది. కుక్కల మధ్య లవ్ స్టోరీతో ఈ సినిమా వచ్చింది. తెలుగులోనూ ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.
Valatty OTT Streaming: మలయాళ సినిమా ఇండస్ట్రీ నుంచి కొన్ని విభిన్నమైన సినిమాలు వస్తుంటాయి. డిఫరెంట్ కాన్సెప్టులతో చిత్రాలు రూపొందుతుంటాయి. అలాంటి చిత్రమే ‘వాలట్టి’ కూడా. డాగ్స్ (శునకాలు) మధ్య లవ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ తెరకెక్కింది. వీఎఫ్ఎక్స్ కాకుండా నిజమైన కుక్కలనే యాక్టర్లుగా తెరకెక్కించిన తొలి భారతీయ చిత్రంగానూ ‘వాలట్టి’ నిలిచింది. జూలై 21న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు.. వాలట్టి మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది.
వాలట్టి సినిమా డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి నేడు స్ట్రీమింగ్‍కు వచ్చింది. మలయాళంతో పాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడలోనూ ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రానికి దేవన్ జయకుమార్ దర్శకత్వం వహించారు.
వాలట్టి చిత్రంలో శునకాలకు రోషన్ మాథ్యూ, రవీనా రవి, సౌబిన్ షాహిర్, సన్నీ వైన్, సైజు కురుప్, అజు వర్గీస్, ఇంద్రన్స్, రజినీ హరిదాస్ లాంటి స్టార్లు వాయిస్ ఓవర్ ఇచ్చారు. టామీ అనే గోల్డెన్ రిట్రైవర్ డాగ్, బ్రహ్మణ కుటుంబం పెంచుకునే ‘అమలు’ అనే కాకర్ స్పేనియల్ డాగ్ మధ్య జరిగే లవ్ స్టోరీనే వాలట్టి చిత్రం ప్రధాన కథగా ఉంది.
టామీ, అమలు లవ్ స్టోరీకి చాలా ఆటంకాలు వస్తాయి. అలాగే, కామెడీ కూడా ఉంటుంది. ఈ వాలట్టి సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. రివ్యూలు కూడా అధిక శాతం సానుకూలంగా వచ్చాయి. బాక్సాఫీస్ వద్ద కూడా వాలట్టికి మంచి కలెక్షన్లు వచ్చాయి.
వాలట్టి చిత్రాన్ని ఫ్రైడే ఫిల్మ్ హౌస్ పతాకంపై విజయ్ బాబు నిర్మించారు. దర్శకుడు దేవన్ జయకుమార్ అద్భుతంగా, హృద్యంగా తెరకెక్కించారు. వరుణ్ సునీల్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. విష్ణు పనికర్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు.