Utsavam Movie Review: ఉత్సవం మూవీ రివ్యూ - రెజీనా లేటెస్ట్ తెలుగు మూవీ హిట్టా? ఫట్టా?
Utsavam Movie Review: ఏడాది గ్యాప్ తర్వాత ఉత్సవం సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది రెజీనా. దిలీప్ ప్రకాష్ హీరోగా నటించిన లవ్ స్టోరీ మూవీకి అర్జున్ సాయి దర్శకత్వం వహించాడు. శుక్రవారం థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుందా? లేదా? అంటే?
Utsavam Movie Review: దిలీప్ ప్రకాష్, రెజీనా హీరోహీరోయిన్లుగా నటించిన ఉత్సవం మూవీ సెప్టెంబర్ 13న (శుక్రవారం) థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది. అర్జున్ సాయి దర్శకత్వం వహించిన ఈ మూవీలో ప్రకాష్‌రాజ్, నాజర్, బ్రహ్మానందంతో పాలు పలువురు సీనియర్ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించారు. మెసేజ్ ఓరియెంటెడ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ మూవీ ఎలా ఉందంటే?
కృష్ణ, రమ ప్రేమకథ...
అభిమన్యు నారాయణ (ప్రకాష్ రాజ్) రంగస్థల కళాకారుడిగా గొప్ప పేరుప్రఖ్యాతులతో పాటు అనేక అవార్డులను అందుకుంటాడు. అతడి కొడుకు కృష్ణ (దిలీప్ ప్రకాష్) ఇంజినీరింగ్ పూర్తిచేసి ఉద్యోగం చేయకుండా అంతరించిపోతున్న నాటక రంగానికి బతికించే ప్రయత్నాల్లో ఉంటాడు. కొడుకు తనలా నాటకాల్లోకి రాకుండా మంచి జాబ్ చేయాలని అభిమన్యు నారాయణ కలలు కంటుంటాడు.
స్నేహితుడైన రంగస్థలకారుడు మహాదేవనాయుడు (నాజర్) కూతురు రమతో (రెజీనా) కృష్ణ పెళ్లిని ఫిక్స్ చేస్తాడు అభిమన్యు నారాయణ. పెళ్లికి కొద్ది గంటల ముందు రమ, కృష్ణ కనిపించకుండాపోతారు.
వారి మిస్సింగ్ వెనకున్న కారణమేమిటి? పెళ్లి కుదరడానికి ముందే ఒకరినొకరు ప్రాణంగా ఇష్టపడ్డ కృష్ణ, రమ ఎలా విడిపోయారు? ప్రేమ జంట మధ్య మనస్పర్థలకు కారణమేమిటి? వారి ప్రేమకథ ఎలా మొదలైంది? కృష్ణ, రమ లవ్ స్టోరీ ఎలా సుఖాంతమైంది అన్నదే ఉత్సవం మూవీ కథ.
నాటకాల నేపథ్యంలో...
నాటక రంగ గొప్పతనం, అంతరించిపోతున్న రంగస్థల కళను కాపాడుకోవడం కోసం కళాకారుల పడే ఆరాటం, వారి వ్యథలను ఆవిష్కరిస్తూ తెలుగులో కృష్ణవందేజగద్గురుమ్, రంగమార్తండ తో పాటు మరి కొన్ని సినిమాలు మాత్రమే వచ్చాయి. చాలా రోజుల తర్వాత మళ్లీ నాటకాల నేపథ్యంలో వచ్చిన మూవీనే ఉత్సవం.
కళాకారుల కష్టాలు...
సురభి నాటక రంగ నేపథ్యానికి ఓ లవ్‌స్టోరీని జోడించి దర్శకుడు అర్జున్ సాయి ఉత్సవం కథను రాసుకున్నాడు. నాటకాలకు సరైన ఆదరణ ఆదాయం లేకపోయినా ఇప్పటికీ ఈ కళనే నమ్ముకొని కొందరు ఎలా బతుకుతున్నారు? వారి కష్టాలు ఎలా ఉన్నాయన్నది హార్ట్ టచింగ్‌గా సినిమాలో చూపించాడు డైరెక్టర్. ఓ వైపు నాటకాలు..మరోవైపు ప్రేమకథను సమాంతరంగా చూపిస్తూ కథను ముందుకు నడిపించాడు.
ఓ ప్రేమ పెళ్లి జరిపించే క్రమంలో హీరోహీరోయిన్ల మధ్య పరిచయం ఏర్పడటం, వారి ప్రేమకథ, ఆ జంట మధ్య మనస్పర్థలను ప్రథమార్థంలో చూపించాడు. రంగస్థల కళాకారుల తెర వెనుక జీవితాల్ని ఎమోషనల్‌గా ఆవిష్కరించారు. పెద్దలు తమ ఇద్దరికి పెళ్లి జరిపించాలని అనుకున్న విషయం తెలియక ఇంట్లో నుంచి పారిపోయి కలిసే జర్నీ చేయడం, వారి మధ్య అలకలు, అపార్థాలతో చుట్టూ సెకండాఫ్‌ను సెన్సిబుల్‌గా సాగుతుంది. నాటకాలకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు నాయకానాయికల చేసే ప్రయత్నాలను ద్వితీయార్థంలో స్క్రీన్‌పై ప్రజెంట్ చేశారు.
లవ్ స్టోరీ రొటీన్...
ఉత్సవం సినిమాలోని మెయిన్ లవ్ స్టోరీ రొటీన్‌గా రాసుకున్నాడు దర్శకుడు. నాటకాల తాలూకు ఎపిసోడ్స్ కథతో సంబంధం లేకుండా స్క్రీన్‌పై వస్తుంటాయి. కళాకారుల కష్టాలను పైపైనే టచ్ చేసినట్లుగానే అనిపిస్తుంది. నాటక రంగాన్ని బతికించడం కోసం నాయకానాయికలు చేసే ప్రయత్నాలు లాజిక్‌లకు దూరంగా సాగుతాయి.
సీనియర్ ఆర్టిస్టులు..
ఉత్సవం సినిమాకు సీరియల్ ఆర్టిస్టులు ప్రకాష్‌రాజ్, నాజర్, బ్రహ్మానందం, రాజేంద్రప్రసాద్ ప్రధాన బలంగా నిలిచారు. నాటకాల తాలూకు సీన్స్‌లో వారి నటన ఆకట్టుకుంటుంది. కృష్ణ పాత్రలో దిలీప్ ప్రకాష్ నటన బాగుంది. ఎమోషనల్ సీన్స్‌లో పరిణతితో కూడిన యాక్టింగ్‌ను కనబరిచాడు. రమ పాత్రలో రెజీనా ఒదిగిపోయింది. అలీ, ఎల్‌బీ శ్రీరామ్‌తో పాటు చాలా మంది ఆర్టిస్టులు తమ పరిధుల మేర మెప్పించారు. రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫీ, అనూర్ రూబెన్స్ మ్యూజిక్ ఈ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీకి ప్లస్ పాయింట్‌గా నిలిచాయి.
మంచి మెసేజ్...
ఉత్సవం రంగస్థల కళ ఔన్యత్యాన్ని చాటిచెప్పే ఎమోషనల్ లవ్ ఎంటర్‌టైనర్ మూవీ. కథలో చిన్న చిన్న లోపాలున్న సందేశం మాత్రం ఆకట్టుకుంటుంది.
రేటింగ్ : 2.75/5