The Kashmir Files | 'కశ్మీర్ ఫైల్స్' డైరెక్టర్‌కు 'వై' కేటగిరి భద్రత-the kashmir files director granted y category security ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  The Kashmir Files | 'కశ్మీర్ ఫైల్స్' డైరెక్టర్‌కు 'వై' కేటగిరి భద్రత

The Kashmir Files | 'కశ్మీర్ ఫైల్స్' డైరెక్టర్‌కు 'వై' కేటగిరి భద్రత

HT Telugu Desk HT Telugu
Mar 18, 2022 06:40 PM IST

ది కశ్మీర్ ఫైల్స్ చిత్ర దర్శకుడు వివేక్ అగ్నిహోత్రికి కేంద్ర వై కేటగిరి భద్రతను కల్పించింది. ఇకపై ఆయనకు సీఆర్పీఎఫ్ బలగాలు సెక్యురిటీగా ఉంటాయి. చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. వంద కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది.

<p>వివేక్ అగ్నిహోత్రి డైరెక్టర్ కు వై కేటగిరి సెక్యురిటీ</p>
వివేక్ అగ్నిహోత్రి డైరెక్టర్ కు వై కేటగిరి సెక్యురిటీ (Hindustan times)

చిన్న సినిమాగా విడుదలై.. భారీ సినిమా రేంజ్ కలెక్షన్లను రాబడుతోంది ది కశ్మీర్ ఫైల్స్(The Kashmir Files) చిత్రం. ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి కేవలం మౌత్ టాక్‌తోనే అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి(Vivek Agnihotri)కి కేంద్ర ప్రభుత్వం వై కేటగిరి భద్రతను కల్పించింది. ది కశ్మీర్ ఫైల్స్ చిత్రం రిలీజ్ అయినప్పటి నుంచి ఆయనకు బెదిరింపులు ఎక్కువ కావడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

1990లో జమ్మూ-కశ్మీర్‌లో అల్లరిమూకలు కశ్మీరి హిందువులపై దాడులకు తెగబడ్డాయి. ఆ ఆకృత్యాలను తట్టుకోలేక ఎంతో మంది కశ్మీరి పండిట్లు కట్టుబట్టలతో వలస వెళ్లిపోయారు. ఆనాటి భయానక ఘటనలను కళ్లకు కట్టినట్లు చూపిస్తూ వివేక్ కశ్మీర్ ఫైల్స్ సినిమాను తెరకెక్కించారు. అయితే ఈ సినిమాలో ఓ వర్గం వారిని హంతకులుగా చూపించారని వివేక్‌పై నిరసలు వెల్లువెత్తాయి. దీంతో ఆయనకు వై కేటగిరి భద్రతను కల్పించింది కేంద్రం. ఇకపై ఆయనకు ఎక్కడకు వెళ్లినా సీఆర్పీఎఫ్ బలగాలతో భద్రత కల్పిస్తారు.

ప్రస్తుతం ఈ సినిమా కలెక్షన్ల పరంగా దూసుకెళ్తోంది. రికార్డు స్థాయిలో వసూళ్లను రాబడుతోంది. 7 రోజుల్లోనే వంద కోట్ల మార్కును అందుకుంది. ఇప్పటి వరకు రూ.106 కోట్లను రాబట్టింది. ఇలాంటి కళాత్మక సినిమాలు ఇంతటి వసూళ్లను రాబట్టడం విశేషం.

ఈ సినిమాలో మిథున చక్రవర్తి, అనుపమ్ ఖేర్, దర్శన్ కుమార్ పల్లవి జోష్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. వివేక్ అగ్నిహోత్రి నిర్మించి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జీ స్టూడియోస్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై ఈ సినిమాను నిర్మించారు. మే నెలలో ది కశ్మీర్ ఫైల్స్ సినిమాను ఓటీటీలో విడుదల చేయాలని చిత్రబృందం ప్రణాళికను రూపొందిస్తున్నట్లు సమాచారం. మే 6న స్ట్రీమింగ్ అయ్యే అవకాశమున్నట్లు చిత్రవర్గాల ద్వారా తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంపై అధికారిక సమాచారం వచ్చే అవకాశముంది.

Whats_app_banner

సంబంధిత కథనం