OTT Releases: థియేటర్లలో రిలీజైన ఎనిమిది వారాల తర్వాతే ఓటీటీలోకి స్టార్స్ సినిమాలు - థియేటర్స్ అసోసియేషన్ నిర్ణయం
OTT Releases: థియేటర్లలో రిలీజైన ఎనిమిది వారాల తర్వాతే స్టార్ హీరోల సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేయాలని తమిళనాడు థియేటర్స్, మల్టీప్లెక్స్ ఓనర్స్ అసోసియేషన్ నిర్ణయం తీసుకున్నది. ఐపీఎల్ మ్యాచ్‌లను థియేటర్లలో లైవ్ స్క్రీనింగ్ చేసేలా అనుమతులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరింది.
OTT Releases: ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కు తమిళనాడు థియేటర్స్ మల్టీప్లెక్స్ అసోసియేషన్ షాకిచ్చింది. థియేటర్లలో రిలీజైన ఎనిమిది వారాల తర్వాతే ఓటీటీలో స్టార్ హీరోల సినిమాలను రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నది. అలాగే ఐపీఎల్ మ్యాచ్‌లను థియేటర్లలో స్క్రీనింగ్ చేయాలని జనరల్ బాడీ మీటింగ్‌లో తీర్మాణించింది. తమిళనాడు థియేటర్, మల్టీప్లెక్స్ ఓనర్స్ జనరల్ బాడీ మీటింగ్ ఇటీవల జరిగింది. ఈ మీటింగ్‌లో ప్రధానంగా థియేటర్, ఓటీటీ రిలీజ్ మధ్య గ్యాప్ గురించే చర్చ జరిగినట్లు సమాచారం.
నాలుగు వారాలు కాదు...ఎనిమిది వారాలు...
ప్రస్తుతం రజనీకాంత్, విజయ్ వంటి స్టార్ హీరోల సినిమాలు సైతం థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోనే ఓటీటీలలోకి వస్తుండటంతో థియేటర్స్ రెవెన్యూ తగ్గిపోతుంది. ఈ ట్రెండ్ వల్ల సింగిల్ స్క్రీన్స్‌తో పాటు మల్టీప్లెక్స్‌లు తీవ్రంగా నష్టపోతుండటంతో థియేటర్, ఓటీటీ రిలీజ్ మధ్య గ్యాప్ ఖచ్చితంగా ఎనిమిది వారాలు ఉండేలా చూడాలని అసోసియేషన్ తీర్మాణించింది. త్వరలోనే తమ డిమాంట్స్‌ను ప్రొడ్యూసర్లతో పాటు ఓటీటీ సంస్థల ముందుకు తీసుకోపోనున్నట్లు తెలిసింది.
ఈ రూల్‌ను స్టార్ హీరోల సినిమాల విషయంలో ఖచ్చితంగా అమలు చేసేలా చూడాలని కోరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఓటీటీల కారణంగా థియేటర్ల రెవెన్యూ రానురాను తగ్గిపోతుందని, కష్టాల నుంచి గట్టెక్కాలంటే తమ డిమాండ్స్‌ను నెరవేర్చాలని థియేటర్, మల్టీప్లెక్స్ ఓనర్స్ అసోసియేషన్ జనరల్ బాడీ మీటింగ్‌లో నిర్ణయం తీసుకున్నట్లు చెబుతోన్నారు.
ఐపీఎల్ మ్యాచ్‌ల స్క్రీనింగ్...
థియేటర్ల రెవెన్యూ పెంచేందుకు ఐపీఎల్ మ్యాచ్‌లను థియేటర్లలో లైవ్ స్క్రీనింగ్ చేసుకునేలా అనుమతులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని తమిళ థియేటర్స్, మల్టీప్లెక్స్ అసోసియేషన్ కోరింది. ఐపీఎల్ సీజన్‌లో థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతుంది, లైవ్ స్క్రీనింగ్ వల్ల ఆ నష్టాలు తగ్గడమే కాకుండా థియేటర్లకు లాభం చేకూరే అవకాశం ఉందని మీటింగ్‌లో తీర్మాణించినట్లు తెలిసింది.
2024 ఐపీఎల్ మార్చి 22 నుంచి మొదలుకానున్న నేపథ్యంలో తమ డిమాండ్‌ను ప్రభుత్వం తొందరగా నెరవేర్చాలని థియేటర్ ఓనర్స్ అసోసియేషన్ తెలిపినట్లు సమాచారం. లోక్ బాడీ ఎంటర్‌టైన్‌మెంట్ టాక్స్‌ను తొలగించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం లోక్ బాడీ ఎంటర్‌టైన్‌మెంట్ టాక్స్ 8 శాతం వసూలు చేస్తున్నారు.
ప్రభుత్వం ముందుకు డిమాండ్స్...
తమ డిమాండ్స్‌తో తొందరలోనే ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లేందుకు థియేటర్, మల్టీప్లెక్స్ అసోసియేషన్ ప్రయత్నాలు చేస్తోన్నట్లు తెలిసింది. అయితే ఈ డిమాండ్స్ చాలా కాలంగా పరిష్కారం కాకుండా ఉన్నాయి. థియేటర్, ఓటీటీ మధ్య గ్యాప్‌ను తగ్గిస్తామని చాలా సార్లు నిర్మాతలు థియేటర్ ఓనర్స్‌కు మాటిచ్చారు. కానీ ఇప్పటివరకు ఆ హామీ మాత్రం నెరవేరలేదు.
ఇటీవల తమిళంలో సంక్రాంతికి రిలీజైన ధనుష్ కెప్టెన్ మిల్లర్, శివకార్తికేయన్ అయలాన్ సినిమాలు నెల రోజులు కూడా కాకముందే ఓటీటీలోకి వచ్చాయి. థియేటర్లలో ఈ సినిమాలు స్క్రీనింగ్ అవుతోండగానే ఓటీటీలో రిలీజ్ చేయడం విమర్శలకు దారి తీసింది. సంక్రాంతి సినిమాల కారణంగానే థియేటర్ ఓనర్స్ అసోసియేషన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతోన్నారు. రజనీకాంత్ లాల్ సలామ్ మూవీ ఇరవై రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతోంది.
టాపిక్