Trisha: త్రిషపై అసభ్య వ్యాఖ్యలు చేసిన రాజకీయ నాయకుడు.. ఆగ్రహం వ్యక్తం చేసిన స్టార్ హీరోయిన్
Trisha Controversy: స్టార్ హీరోయిన్ త్రిషపై ఓ రాజకీయ నాయకుడు అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై త్రిష కూడా స్పందించారు.
Trisha: స్టార్ హీరోయిన్ త్రిషపై నటుడు మన్సూర్ అలీ ఖాన్ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు గతేడాది దుమారం రేపాయి. హైకోర్టు వరకు ఈ విషయం వెళ్లింది. మన్సూర్‌కు న్యాయస్థానం మొట్టికాయలు వేసింది. తాజాగా, త్రిషపై తమిళనాడుకు చెందిన రాజకీయ నాయకుడు, అన్నాడీఎంకే మాజీ నేత ఏవీ రాజు అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. ఓ ఎమ్మెల్యే నుంచి త్రిష రూ.25లక్షలు తీసుకున్నారని అనడంతో పాటు మరిన్ని అభ్యంతర కామెంట్లు చేశారు. దీంతో ఆయనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా త్రిష కూడా ఈ విషయంపై స్పందించారు.

అసభ్య కామెంట్లు చేసిన ఏవీ రాజుపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని త్రిష వెల్లడించారు. ఇలాంటి నీచమైన మనుషులను పదేపదే చూడడం అసహ్యంగా అనిపిస్తోందని ట్వీట్ చేశారు. కఠినమైన చర్యలకు దిగుతానని ఆగ్రహం వ్యక్తం చేశారు..
“దృష్టిని ఆకర్షించేందుకు ఏ స్థాయికైనా దిగజారిపోయే హేయమైన మనుషులను, నీచమైన జీవితాలను పదేపదే చూడడం అసహ్యంగా ఉంది. కచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటా. మిగిలినది నా లీగల్ డిపార్ట్‌మెంట్ చూసుకుంటుంది” అని త్రిష ట్వీట్ చేశారు.
నెటిజన్ల ఆగ్రహం
త్రిషపై ఏవీ రాజు చేసిన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో నెటిజన్లు ఆయనను తిట్టి పోస్తున్నారు. ఇలాంటి అబద్ధాలు, నీచమైన కామెంట్లు చేయడం సరికాదని రాజుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయనను ఊరికే వదిలిపెట్టకూడదని, కేసులు వేయాలని త్రిషకు చాలా మంది నెటిజన్లు సూచిస్తున్నారు. త్రిష స్పందనను బట్టి చూస్తే.. ఆమె కూడా చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతున్నట్టుగా అర్థమవుతోంది.
పార్టీ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఏవీ రాజును ఇప్పటికే అన్నాడీఎంకే పార్టీ బహిష్కరించింది. అయినా.. ఆయన తీరు మార్చుకోలేదు. త్రిషపై అసభ్య కామెంట్లు చేశారు.
మన్సూర్ అలీ ఖాన్ వివాదం
లియో చిత్రంలో తనకు త్రిషతో రేప్ సీన్ ఉండాల్సిందంటూ నటుడు మన్సూర్ అలీ ఖాన్ గతేడాది అసభ్య వ్యాఖ్యలు చేశారు. అభ్యంతరకరంగా మాట్లాడారు. అప్పుడు కూడా ఆయనపై త్రిష ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, ఆయన క్షమాణలు చెప్పినట్టే చెప్పి.. మళ్లీ యూటర్న్ తీసుకున్నారు. త్రిషతో పాటు ఆమెకు మద్దతుగా మాట్లాడిన మెగాస్టార్ చిరంజీవి, నటి ఖుష్బూపై మద్రాస్ హైకోర్టులో పరువు నష్టం కేసు వేశారు.
అసభ్య వ్యాఖ్యలు చేసిందే కాకుండా.. కేసు వేసిన మన్సూర్ అలీ ఖాన్‍పై మద్రాస్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వైఖరి మార్చుకోవాలని మొట్టికాయలు వేసింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం మానాలంటూ మన్సూర్‌కు బుద్ధి చెప్పింది.
సినిమాల విషయానికి వస్తే.. త్రిష ప్రస్తుతం తమిళ స్టార్ అజిత్‍తో విదా ముయర్చి మూవీ చేస్తున్నారు. తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్‍లో ఆమె ఇటీవలే పాల్గొన్నారు. కమల్ హాసన్ ప్రధాన పాత్ర చేస్తున్న థగ్‍లైన్ చిత్రం కూడా త్రిష లైనప్‍లో ఉంది. మలయాళంలోనూ ఓ మూవీని ఓకే చేశారు త్రిష. ఇలా వరుస సినిమాలతో ఆమె చాలా బిజీగా ఉన్నారు.