Actor Thalapathy Vijay Party: తమిళ హీరో విజయ్ పార్టీ పేరు ఇదే.. అధికారిక ప్రకటన.. అందుకోసమే రాజకీయాల్లోకి అంటూ..-tamil actor thalapathy vijay announces political party name as tamizhaga vetri kazhagam kollywood tamil nadu news ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Actor Thalapathy Vijay Party: తమిళ హీరో విజయ్ పార్టీ పేరు ఇదే.. అధికారిక ప్రకటన.. అందుకోసమే రాజకీయాల్లోకి అంటూ..

Actor Thalapathy Vijay Party: తమిళ హీరో విజయ్ పార్టీ పేరు ఇదే.. అధికారిక ప్రకటన.. అందుకోసమే రాజకీయాల్లోకి అంటూ..

Chatakonda Krishna Prakash HT Telugu
Feb 02, 2024 07:40 PM IST

Actor Thalapathy Vijay Party: తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ రాజకీయ రంగ ప్రవేశంపై అధికారిక ప్రకటన వచ్చేసింది. పార్టీ పేరును ఆయన నేడు వెల్లడించారు. రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకున్నారో వివరించారు.

Actor Thalapathy Vijay Party: తమిళ హీరో విజయ్ పార్టీ పేరు ఇదే.. అధికారిక ప్రకటన
Actor Thalapathy Vijay Party: తమిళ హీరో విజయ్ పార్టీ పేరు ఇదే.. అధికారిక ప్రకటన

Tamil Actor Thalapathy Vijay Party: తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ రాజకీయాల్లోకి వస్తారంటూ కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై నేడు (ఫిబ్రవరి 2) అధికారిక ప్రకటన వచ్చింది. తమిళనాడులో అత్యధిక స్థాయిలో అభిమాన గణం, భారీ క్రేజ్ ఉన్న విజయ్ ఎట్టకేలకు రాజకీయాల్లో అడుగుపెట్టారు. తమిళ రాజకీయాలను కీలక మలుపుతిప్పారు. కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. ఈ విషయాన్ని నేడు అధికారికంగా ప్రకటించారు విజయ్.

పార్టీ పేరు ఇదే

తన రాజకీయ పార్టీకి సంబంధించిన ప్రకటనను నేడు సోషల్ మీడియా ప్లాట్‍ఫామ్ ఎక్స్ (ట్విట్టర్‌)లో వెల్లడించారు దళపతి విజయ్. తన పార్టీకి తమిళగ వెట్రి కజగమ్ (Tamizhaga Vetri Kazhagam) అని పేరు పెట్టారు. ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. ఈ పార్టీకి విజయ్ అధ్యక్షుడిగా ఉండనున్నారు.

అందుకే రాజకీయ పార్టీ.. 2026లో పోటీ

సమాజంలో మార్పు రావాలంటే అభిమాన సంఘం మాత్రమే సరిపోదని, రాజకీయ రంగంలో దిగాలని విజయ్ తన ప్రకటనలో పేర్కొన్నారు. సమాజంలో మార్పు కోసమే రాజకీయ పార్టీ స్థాపించానని పేర్కొన్నారు. 2026లో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ తమిళగ వెట్రి కజగమ్ పోటీ చేస్తుందని కూడా విజయ్ స్పష్టం చేశారు.

“కొన్ని సంవత్సరాలుగా విజయ్ మక్కల్ ఇయక్కమ్ సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అయితే సమాజంలో మార్పును ఒక్క ఫ్యాన్ క్లబ్‍తోనే తీసుకురాలేం. అందుకు రాజకీయంగా మనుగడ ఉండడం అవసరం. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు అందరికీ తెలుసు. ఓవైపు అవినీతి, పాలనలో అవకతవకలు.. మరోవైపు కులం, మతం ప్రాతిపదికన విభజన రాజకీయాలు సాగుతున్నాయి. ఇవి ప్రజల అభివృద్ధికి అడ్డుగా ఉన్నాయి” అని ప్రకటనలో విజయ్ పేర్కొన్నారు.

సమాజంలోని అలాంటి సమస్యలను తొలగించి, ఐక్యతను సాధించేందుకు రాజకీయ పార్టీని స్థాపించినట్టు విజయ్ వెల్లడించారు. “పార్టీల రాజకీయాలు మన రాజ్యాంగానికి లోబడి ఉండాలి. అందరినీ సమానంగా చూసేలా సమానత్వపు హక్కును పరిరక్షించాలి. ప్రజా శక్తితోనే మా పార్టీ ఈ విలువలను నిలబెట్టేందుకు ప్రయత్నిస్తుంది. ఇందుకోసం ప్రజల మద్దతు భారీగా కావాలి” అని విజయ్ కోరారు. 

సినిమాల విషయానికి వస్తే..

దళపతి విజయ్ ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (GOAT)’ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్‍గా నటిస్తున్నారు. జయరాం, మిక్ మోహన్, ప్రభు దేవ, యోగిబాబు కీరోల్స్ చేస్తున్నారు. యువన్ శంకర్ రాజా ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు. ఏజీఎస్ ఎంటర్‌టైన్‍మెంట్ బ్యానర్‌పై అర్చనా కల్పతి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో హీరో విజయ్ డ్యుయల్ రోల్‍లో కనిపించనున్నారు.

ఈ మూవీ తర్వాత దళపతి విజయ్ (Thalapathy 69).. డీవీవీ ఎంటర్‌టైన్‍మెంట్స్ పతాకంలో ఓ సినిమాకు అంగీకరించినట్టు తెలుస్తోంది. కార్తీక్ సుబ్బరాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం ఉంది. అయితే, ఈ మూవీపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఆ తర్వాత సినిమాల నుంచి బ్రేక్ తీసుకొని 2026 తమిళనాడు ఎన్నికలకు ఆయన రెడీ అవుతారని టాక్. తమిళగ వెట్రి కజగమ్ పార్టీని విజయ్ ముందుండి నడిపించనున్నారు.