Squid Game Actor: లైంగిక వేధింపుల కేసులో 79 ఏళ్ల స్క్విడ్ గేమ్ నటుడికి జైలు శిక్ష.. రెండేళ్లపాటు నిషేధం
Squid Game Actor O Yeong Su Sexual Harassment: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కున్న స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్ యాక్టర్ ఓ యోంగ్ సు దోషిగా తేలాడు. 2017లో వచ్చిన అభియోగాలపై ఈ 79 ఏళ్ల నటుడికి ఇప్పుడు శిక్ష విధించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
Squid Game Actor O Yeong Su: స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్‌కు ప్రపంచస్థాయిలో ఎంత పేరు వచ్చిందో తెలిసిందే. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్‌గా వచ్చిన ఈ కొరియన్ సర్వైవల్ థ్రిల్లర్‌కు విపరీతమైన అభిమానులు ఏర్పడ్డారు. దీంతో దీనికి సీక్వెల్ తెరకెక్కించే పనిలో ఉన్నారు మేకర్స్. ఇటీవలే స్క్విడ్ గేమ్ సీజన్ 2పై ఓ వీడియో ద్వారా మేకర్స్ అప్డేట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక మొదటి సీజన్‌లోని నటీనటుల యాక్టింగ్ ఎంతగానో ఆకట్టుకుంది.
వారిలో కీలక పాత్ర పోషించినవారిలో ఓ యోంగ్ సు ఒకరు. 79 ఏళ్ల ఈ దక్షిణ కొరియా నటుడికి లైంగిక వేధింపుల కేసులో శిక్ష పడింది. శుక్రవారం (మార్చి 15) నాడు లైంగిక వేధింపుల కేసులో దోషిగా తేలాడు ఓ యోంగ్ సు. ఏఎఫ్‌రీ నివేదికల ప్రకారం.. సువాన్ జిల్లా కోర్టు సియోంగ్నామ్ శాఖ ఓ యోంగ్ సుకు ఎనిమిది నెలల జైలు శిక్ష విధించింది. అలాగే సినీ రంగంలో రెండేళ్ల పాటు నిషేధం కూడా విధించింది. లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో 40 గంటల్లో హాజరు కావాలని ఆదేశించిన దక్షిణ కొరియా కోర్టు ఓ యోంగ్ సుకు జైలు శిక్షను తీర్పుగా ఇచ్చింది.
79 ఏళ్ల ఓ యోంగ్ సుపై రెండుసార్లు లైంగిక వేధింపుల ఆరోపణలు నమోదు అయ్యాయి. అయితే, 2017లో వచ్చిన ఈ ఆరోపణలను ఓ యోంగ్ మొదట ఖండించాడు. కానీ, బాధితురాలి వాదనలు, దానికి సంబంధించిన రికార్డులు బలంగా, స్థిరంగా ఉండటంతో వాటిని అవాస్తవాలుగా కొట్టిపారేయలేమని న్యాయమూర్తి జియోంగ్ యోన్ జు వెల్లడించారు. 2017లో ఓ గ్రామీణ ప్రాంతంలో థియేటర్ ప్రదర్శన కోసం వెళ్లిన యోంగ్ ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.
వాకింగ్ చేసే దారిలో నివాసం ఉండే బాధితురాలి ఇంటి ముందు ఈ సంఘటనలు జరిగినట్లు ఏఎఫ్‌పీ రిపోర్ట్ తెలుపుతున్నాయి. ఇలాగే 2022లో కూడా గుర్తు తెలియని మహిళపై ఓ యోంగ్ సు లైంగిక వేధింపులు జరిపినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నాడు. కోర్టు తీర్పు తర్వాత బయటకు వెళ్లిన ఓ యోంగ్ సు మీడియాతో మాట్లాడాడు. కోర్టు తీర్పుపై అప్పీల్ చేయాలని ఆలోచిస్తున్నట్లు యోంగ్ తెలిపాడు. యోంగ్ సు అప్పీల్ చేసేందుకు ఇంకా ఏడు రోజుల సమయం ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే "ఓ సరస్సు చుట్టూ నడిచేందుకు మార్గనిర్దేశం చేసేందుకే మహిళ చేతిని పట్టుకున్నట్లు గతంలో యోంగ్ సు చెప్పాడు. నేను ఆమెకు క్షమాపణలు చెప్పాను. ఎందుకంటే ఆమె గొడవ చేయకుండా ఉంటుందని. అలాగని నేను ఆ లైంగిక ఆరోపణలను ఒప్పుకున్నట్లు కాదు" అని గతంలో యోంగ్ సు తెలిపాడు. ఇదిలా ఉంటే 50 ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో ఉంటున్న ఓ యోంగ్ సుకి నెట్‌ఫ్లిక్స్ స్క్విడ్ గేమ్ సిరీస్‌తో సూపర్ క్రేజ్ వచ్చింది.
2021లో విడుదలైన ఈ స్క్విడ్ గేమ్‌ను నాలుగు వారాలలోపే 111 మిలియన్ల మంది వీక్షకులు చూశారు. ఈ సిరీస్‌లో ఓ నామ్ అనే పాత్రలో ఓ యోంగ్ కనిపిస్తాడు. ఇందులో అతని నటనకు చాలా మంది ప్రేక్షకులు ఫిదా అయ్యారు. క్లైమాక్స్‌లో ఓ నామ్ పాత్రతో వచ్చే ట్విస్ట్ అందరికి మైండ్ బ్లాక్ చేస్తుంది. కాగా ఓ యోంగ్ సుకి ఉత్తమ సహాయ నటుడి విభాగంలో గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ కూడా వరించింది. ఓ యోంగ్ సు 1960లో తన యాక్టింగ్ కెరీర్‌ను ప్రారంభించాడు.
టాపిక్