Romancham Review Telugu: దెయ్యంతోనే గేమా? రొమాంచం ఎలా ఉందంటే?
Romancham Movie Review: మలయాళంలో సూపర్ డూపర్ హిట్టయిన రోమాంచం మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. సౌబిన్ షాహిర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు వెర్షన్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంది.
సినిమా- రోమాంచం(2023)
నటీనటులు- సౌబిన్ శాహిర్, అనంతరామన్, సాజిన్ గోపు, అబిన్ బినో, సిజు సన్నీ, అఫ్జల్ పీహెచ్, జగదీష్, అర్జున్ అశోకన్ తదితరులు
ఓటీటీ- డిస్నీ ప్లస్ హాట్ స్టార్
దర్శకుడు- జీతూ మాధవన్
నిర్మాతలు- జాన్ పాల్ జార్జ్, గిరీ గంగాధరన్, జోబీ జార్జ్.
Romancham Movie Review: కంటెంట్ ఉన్న సినిమాలకు పెట్టింది పేరు మలయాళ చిత్రసీమ. ప్రేక్షకులకు ఎప్పుడూ సరికొత్త, వైవిధ్యభరితమైన కథలను సినిమాలుగా తీసి అందించడంలో మలయాళ మేకర్స్ ముందు వరుసలో ఉంటారు. ఓటీటీల పుణ్యామాని భాషతో సంబంధం లేకుండా మలయాళ సినిమాలకు పాటు దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఇక సినిమా బాగుందంటే ఎంత చిన్న సినిమానైనా సూపర్ హిట్ చేయడంలో తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ముందుంటారు. అలాంటి కోవకు చెందిందే రోమాంచం. ఫిబ్రవరి 3న మలయాళంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్టయింది. తాజాగా ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ డిజిటల్ వేదిక హాట్‌స్టార్‌లో ఇది నేటి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. మాతృకతో పాటు తెలుగులోనూ అందుబాటులో ఉంది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
కథ..
జీవన్ అనే వ్యక్తి కళ్లు తెరిచి చూసేసరికి ఆసుపత్రి బెడ్‌పై ఉంటాడు. అతడు ప్రమాదానికి గురయ్యాడని, కోమాలోకి వెళ్లి వచ్చాడని వైద్యుల ద్వారా తెలుసుకుంటాడు. తనకు ఇలా కావడానికి కారణమేంటో అతడు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఇలా ఆలోచిస్తూ ఫ్లాష్‌బ్యాక్ గురించి ఆలోచిస్తాడు. కట్ చేస్తే జీవన్ తన స్నేహితులతో కలిసి బెంగళూరు ఔటస్కర్ట్స్‌లో ఓ ఇంట్లో నివసిస్తూ ఉంటారు. అందరూ బ్యాచిలర్లు కావడం వల్ల.. సరదాగా ఆనందంగా జీవితాన్ని కొనసాగిస్తుంటారు. అలా ఓ సారి దెయ్యాన్ని ఆవహన చేసేందుకు ఉపయోగించే ఓజా బోర్డుతో ఆడటం ప్రారంభిస్తారు. అలా వారు ఓ దెయ్యాన్ని తమ ఇంట్లోకి ఆహ్వానిస్తారు. సరదాగా మొదలైన వీరి ఆట కారణంగా అనుకోని సమస్యలు తలెత్తుతాయి. అసలు ఆ సమస్యలేంటి? వాటిని వాళ్లు ఎలా ఎదుర్కొన్నారు? ఆ దెయ్యం సంగతేంటి? జిబిన్‌కు ప్రమాదం ఎలా అయింది? లాంటి విషయాలను సినిమా చూసే తెలుసుకోవాలి.
ఎలా ఉందంటే?
హర్రర్ కామెడీ కాన్సెప్టుతో తెలుగులో చాలా సినిమాలొచ్చాయి. వీటిలో చాలా వరకు ప్రేక్షకాదరణ పొందాయి. రోమాంచం సినిమా కూడా అదే కోవకు చెందుతుంది. ఈ ఫార్ములాతోనే మంచి కామెడీతో పాటు హర్రర్, సస్పెన్స్‌ను సృష్టించింది. ప్రారంభంలో కాస్త నిదానంగా సాగినప్పటికీ ఆ తర్వాత ఈ సినిమా అంతా ఆసక్తికరంగా, ఉల్లాసభరితంగా ఉంటుంది. నిజజీవిత ఘటనల ద్వారా స్ఫూర్తి పొందిన దర్శక, రచయిత జీతూ మాధవన్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. వాస్తవిక ఘటనలను తెరపై చూపడంలో తన ప్రతిభను చాటుకున్నారు. కాస్త అజాగ్రత్తగా ఉన్న కథ తప్పుగా మారే అవకాశముంటుంది. కానీ ఈ విషయంలో దర్శకుడు జీతూ మాధవన్ తన మార్కు చూపించారు. ఫుల్ కామెడీని జనరేట్ చేశారు. సినిమా చూస్తున్నంత సేపు వినోదాత్మకంగా ఉంటుంది.
బలాలు..
దెయ్యాన్ని ఆకర్షించాలని యువకుల చేతే ఓజా బోర్డు ఆడించి వారి నుంచి హాస్యం రాబట్టుకునే ప్రయత్నం చేశారు. సరైన సమయంలో కామెడీ సన్నివేశాలను పడటంతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వుకుండా. కామెడీకి హర్రర్‌ను జోడిస్తూ తన పాయింట్‌ను కరెక్ట్‌గా ప్రెజెంట్ చేశాడు డైరెక్టర్. చివరి 15-20 నిమిషాలైతే హర్రర్‌తో పాటు ఫుల్ కామెడీ ఉంటుంది. క్లైమాక్స్ కూడా కన్విన్సింగ్‌గా ముగించారు. బ్యాచిలర్ గదుల్లో కుర్రాళ్ల ప్రవర్తనను, వారి జీవన విధానాన్ని అద్భుతంగా చూపించారు. ఫ్యామిలీతో కలిసి సరదాగా ఈ సినిమా చూసేయొచ్చు.
బలహీనతలు..
ఈ సినిమాలో మన నేటివిటీ కాస్త మిస్సయినప్పటికీ మూవీకి కనెక్ట్ అయితే అది పెద్ద సమస్య కాదు. మొదటి 15 నిమిషాలు కాస్త ఓపికగా చూడాలి. ఈ మూవీ గురించి ముందు తెలియనివాళ్లకు ఆరంభంలో ఏం జరుగుతుందో అర్థం కాదు. కానీ ఓజా బోర్డుతో ఆట మొదలైనప్పటి నుంచి చివరి వరకు ఆసక్తికరంగా ఉంటుంది. మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా ఒక్క సన్నివేశం కూడా లేకపోవడం ఇందులో మరో బలహీనత.
ఎవరెలా చేశారంటే..
అసలు దెయ్యాన్ని చూపించకుండా.. కేవలం పాత్రలతోనే అనుకున్న కథను అద్భుతంగా చెప్పారు. తమ నటనతో నవ్వులు పూయించారు. ప్రధాన పాత్రలో నటించిన షౌబిన్ షాహిర్ అధ్భుతంగా చేశాడు. సినిమాలో కాస్తో కూస్తో తెలిసిన నటుడు అతడే. అతడితో పాటు మిగిలిన ఆరుగురు బ్యాచిలర్ల పాత్రల్లో నటించిన వారు కూడా బాగా మెప్పించారు. ప్రతి పాత్రకు ఓ ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. దర్శకుడు క్యారెక్టరైజేషన్ బాగా రాసుకున్నారు.
సాంకేతిక వర్గం..
ప్రొడక్షన్ వ్యాల్యూస్ సినిమా అవసరానికి మేర ఉన్నాయి. దెయ్యం సినిమా అంటే విజువల్ ఎఫెక్ట్స్ భారీగా ఉండాలనే భావనను తొలగిస్తూ కేవలం యాక్టర్ల పర్ఫార్మెన్స్, కెమెరా పనితనంతోనూ భయాన్ని కలిగించవచ్చని ఈ సినిమా నిరూపిస్తుంది. దర్శకుడు ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా సింపుల్‌గా ఈ స్టోరీని రాసుకోవడమే కాకుండా పక్కాగా తెరకెక్కించారు. ఈ విషయంలో అతడు సఫలీకృతులయ్యారు. సుశిన్ శ్యామ్ అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు. మూవీలో అతడి పనితనం కనబడుతుంది.
చివరగా.. ఈ సినిమా 'దెయ్యంతో కామెడీ అద్భుతహా' అనే రీతిలో ఉంది
రేటింగ్.. 3.5/5