Society Of The Snow Review: సొసైటీ ఆఫ్ ది స్నో రివ్యూ - ఆస్కార్ రేసులో నిలిచిన సర్వైవల్ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే?
Society Of The Snow Review: 2024 ఆస్కార్స్‌లో నాలుగు నామినేషన్స్ పొందిన సొసైటీ ఆఫ్ ది స్నో మూవీ ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైంది. యథార్ఠ ఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమాకు జే ఏ బయోనా దర్శకత్వం వహించాడు.
Society Of The Snow Review: గత ఏడాది రిలీజైన స్పానిష్ మూవీ సొసైటీ ఆఫ్ ది స్నో అంతర్జాతీయ స్థాయిలో అనేక అవార్డులను గెలుచుకుంది. 2024 ఆస్కార్ అవార్డుల్లో బెస్ట్ ఇంటర్‌నేషనల్ ఫీచర్ ఫిల్మ్‌తో పాటు మరో మూడు విభాగాల్లో నామినేట్ అయ్యింది.
గోల్డెన్ గ్లోబ్స్ అవార్డుల్లో నాన్ ఇంగ్లీష్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో తుది లిస్ట్‌లో నిలిచింది. 1972లో జరిగిన అండీస్ ఫ్లైట్ డిజాస్టర్ ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీకి జేఏ బయోనా దర్శకత్వం వహించాడు. ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ రిలీజైంది. తెలుగులో ఆడియోతో ఈ హాలీవుడ్ మూవీ ఓటీటీ ఆడియెన్స్‌కు అందుబాటులో ఉంది. ఈ సర్వైవల్ థ్రిల్లర్ కథతో తెరకెక్కిన సొసైటీ ఆఫ్ ది స్నో ఎలా ఉందంటే...
రగ్భీ ఫుట్‌బాల్ టీమ్ కథ...
ఉరుగ్వేకు చెందిన ఓ రగ్బీ టీమ్ టోర్నమెంట్ కోసం చిలీలోని శాంటియాగోకు బయలుదేరుతుంది. ఆటగాళ్లు, వారి కుటుంబసభ్యులతో పాటు ఐదుగురు విమాన సిబ్బందితో కలిసి మొత్తం నలభై ఐదు మంది ఆ ఫ్లైట్‌లో జర్నీ చేస్తుంటారు. మంచు తుఫాను కారణంగా ఆండీస్ పర్వత శ్రేణుల్లో రగ్బీ ఆటగాళ్లు ప్రయాణిస్తున్న విమానం కూలిపోతుంది. ఆ ప్రమాదంలో కొందరు ప్రాణాలు కోల్పోగా...మరికొందరు గాయాలతో బయటపడతారు.
చుట్టూ ఎత్తైన మంచు పర్వతాలు, మైనస్ 20 డిగ్రీలకు పైగా చలి, తినడానికి తిండి కూడా లేని కఠిన పరిస్థితుల్లో రగ్బీ ఆటగాళ్లు ప్రాణాలను నిలుపుకోవడానికి ఎలాంటి పోరాటం చేశారు? నలభై ఐదు మందిలో చివరకు ఎంత మంది ప్రాణాలతో మిగిలారు? తాము బతికే ఉన్నామనే విషయం ప్రపంచానికి వారు ఎలా చాటిచెప్పారు? అన్నదే సొసైటీ ఆఫ్ ది స్నో మూవీ కథ.
యథార్థ ఘటనలతో..
సొసైటీ ఆఫ్ ది స్నో 1972లో ఆండీస్ ఫ్లైట్ డిజాస్టర్ ఆధారంగా తెరకెక్కింది. మనిషి బ్రతకడానికి వీలులేని అత్యంత కఠిన పరిస్థితుల్లో ఆత్మవిశ్వాసంతో ప్రాణాలను నిలుపుకోవడానికి రగ్భీ ఆటగాళ్లు సాగించిన పోరాటాన్ని స్ఫూర్తిదాయకంగా సినిమాలో ఆవిష్కరించారు.
కమర్షియల్ హంగులతో చెప్పే స్కోపు ఉన్న కథ ఇది. మనసుల్ని కదిలించే ఎమోషన్స్, ప్రేమ, ఫ్యామిలీ సెంటిమెంట్ అన్ని ఈ కథలో ఇమిడి ఉన్నాయి. కానీ కమర్షియల్ కోణంలో కాకుండా దర్శకుడు జే ఏ బయోనా మాత్రం రగ్బీ ఆటగాళ్ల కథను కళ్లకు కట్టినట్లుగా రియలిస్టిక్‌గా నిజాయితీతో ఈ సినిమాలో చూపించారు. 1972లో జరిగిన విషాదాన్ని నిజంగానే చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది.
కన్నీళ్లు తెప్పించే ఎమోషన్స్...
ప్రాణాలను నిలుపుకోవడానికి తమ టీమ్‌లోనే మరణించిన వారి శవాలను తినే పరిస్థితి వారికి ఎలా వచ్చింది? ఈ క్రమంలో ఏది తప్పు, ఏది ఒప్పు అన్నది తెలియ వారి ఎదుర్కొనే సంఘర్షణ ఉద్వేగానికి లోను చేస్తుంది.
ప్రాణాలు పోతాయని తెలిసిన కూడా అనుక్షణం సంతోషంగా ఉండటానికి వారు పడే తపన కన్నీళ్లను తెప్పిస్తుంది. ఒకరికొకరు తోడుగా నిలుస్తూ బాధను మర్చిపోతున్న క్షణంలో వారు తలదాచుకున్న ప్లైట్‌పై మంచు పర్వతం కూలిపోయే సీన్...నాలుగు రోజుల పాటు అందులో కూరుకుపోయి వారు పడే వేదనను చూపించే సీన్ కదిలిస్తుంది.
విషాదాంతంగా హీరో పాత్ర...
సొసైటీ ఆఫ్ స్నో మూవీ చాలా వరకు నూమా అనే పాత్ర నేపథ్యంలోనే సాగుతుంది. అతడు వాయిస్ ఓవర్‌తోనే సినిమా కథను ఎండింగ్ వరకు ఇంట్రెస్టింగ్‌గా నడిపించారు డైరెక్టర్. అతడే సినిమాకు హీరోలా అనిపిస్తుంది. అలాగని హీరోయిజంతో అతడి క్యారెక్టర్‌ను చూపించలేదు. అతడి పాత్ర కూడా విషాదాంతంగానే ముగుస్తుంది. నుమాతో పాటు ప్రతి పాత్రకు సమానంగానే ఇంపార్టెన్స్ ఉంది.
ఆర్ట్ మూవీ...
సొసైటీ ఆఫ్ స్నో మూవీ చాలా వరకు ఆర్ట్ ఫిల్మ్‌లా నెమ్మదిగా సాగుతుంది. నిడివి రెండున్నర గంటలపైనే ఉండటంతో సాగదీసినట్లుగా అనిపిస్తుంది.
బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్...
సొసైటీ ఆఫ్ స్నో బెస్ట్ హాలీవుడ్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ. కొంచెం ఓపికగా చూస్తే మాత్రం మరచిపోలేని థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుంది.