Tollywood Releases This Week: స్కంద వర్సెస్ కంగనా రనౌత్ - ఈ వారం బాక్సాఫీస్ విన్నర్ ఎవరో?
Tollywood Releases This Week: ఈ వారం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రామ్ స్కంద, కంగనా రనౌత్ చంద్రముఖి 2తో పాటు శ్రీకాంత్ అడ్డాల పెదకాపు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.
Tollywood Releases This Week: ఈ వారం టాలీవుడ్ బాక్సాఫీస్ పోరు ఆసక్తికరంగా మారింది. మాస్ సినిమాతో హీరో రామ్ పోతినేని, బ్లాక్‌బస్టర్ హారర్ సీక్వెల్‌తో బాలీవుడ్ నాయిక కంగనా రనౌత్ గురువారం ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. వీరితో పాటు పెదకాపు సినిమాతో సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల కూడా రేసులో నిలిచాడు. ఈ ముగ్గురిలో బాక్సాఫీస్ విన్నర్ ఎవరన్నది ఆసక్తికరంగా మారింది.
రామ్ పోతినేని స్కంద…
హీరో రామ్‌పోతినేని, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో ఫస్ట్ టైమ్ రూపొందిన స్కంద మూవీ ఈ గురువారం పాన్ ఇండియన్ లెవెల్‌లో రిలీజ్ అవుతోంది. తనదైన శైలి మాస్, యాక్షన్ అంశాలకు ఫ్యామిలీ ఎమోషన్స్ జోడించి బోయపాటి శ్రీను స్కంద సినిమాను తెరకెక్కించారు.
ఈ వారం రిలీజ్ అవుతోన్న సినిమాల్లో స్కందపైనే భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ట్రైలర్స్, టీజర్స్‌తో ఈ సినిమాలో యాక్షన్ ఏ రేంజ్‌లో ఉంటుందో శాంపిల్ చూపించేశారు బోయపాటి శ్రీను. గురువారం నుంచి మాస్ రచ్చతో థియేటర్లు ఊగిపోవడం ఖాయమని టాలీవుడ్ వర్గాలు చెబుతోన్నాయి.
స్కంద సినిమాలో శ్రీలీల, సయి మంజ్రేకర్ హీరోయిన్లుగా నటించారు. శ్రీకాంత్, ప్రిన్స్ కీలక పాత్రలు పోషించారు. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ హిందీ భాషల్లో ఈ సినిమా సెప్టెంబర్ 28న రిలీజ్ కాబోతోంది.
చంద్రముఖి 2…
రజనీకాంత్ కెరీర్‌లో కల్ట్ క్లాసిక్ హిట్‌గా నిలిచిన సినిమాల్లో చంద్రముఖి ఒకటి. దాదాపు 18 ఏళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ రాబోతోంది. చంద్రముఖి 2 పేరుతో రూపొందిన ఈ సినిమా సెప్టెంబర్ 28న తెలుగుతో పాటు తమిళ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఈ సినిమాలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ టైటిల్ పాత్రలో నటిస్తోండగా లారెన్స్ హీరోగా కనిపించబోతున్నాడు. పి. వాసు ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. స్కంద పోటీని తట్టుకొని కంగనా సినిమా బాక్సాఫీస్ వద్ద నిలబడుతుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.
పెదకాపు…
సెన్సిబుల్ చిత్రాల దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తన పంథాకు భిన్నంగా రూపొందించిన పెదకాపు సినిమా సెప్టెంబర్ 29న రిలీజ్ కానుంది. విరాట్ కర్ణా, ప్రగతి శ్రీవాత్సవ హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న ఈ సినిమాలో శ్రీకాంత్ అడ్డాల ఓ కీలక పాత్రను పోషించాడు.
సమాజంలోని అసమానతలపై ఓ సామాన్యుడు సాగించిన పోరాటం నేపథ్యంలో పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ తెరకెక్కుతోంది. రిలీజ్‌కు ఒక రోజు ముందుగానే ఈసినిమా ప్రీమియర్స్‌ను తెలుగు రాష్ట్రాల్లో ప్రదర్శించబోతున్నారు.