sarkaru vaari paata | సితార ఎంట్రీ అదుర్స్... మహేష్ తో కలిసి స్టెప్పులేసిన తనయ
‘సర్కారువారి పాట’ సినిమాలోని సెకండ్ సింగిల్ ఆదివారం విడుదలైంది.ఈ పాటలో మహేష్ బాబుతో పాటు ఆయన తనయ సితార వేసిన స్టెప్పులు ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటున్నాయి.
‘సర్కారువారి పాట’ సినిమా లోని ‘పెన్నీ..’ సాంగ్ లో తండ్రి మహేష్ బాబు తో కలిసి చిన్నారి సితార వేసిన డ్యాన్స్ స్టెప్పులు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఈ పాటను ఆదివారం సాయంత్రం చిత్రయూనిట్ విడుదలచేసింది. సితార సినిమాల్లో కనిపించడం ఇదే మొదటిసారి. తండ్రి సినిమాతో ఆమె అరంగేట్రం చేయబోతుండటంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. తండ్రీకూతుళ్లు ఇద్దరిని ఒకే ఫ్రేమ్ లో చూసి మురిసిపోతున్నారు. ఈ పాటలో మహేష్ బాబు స్టైలిష్ గా కనిపిస్తున్నారు. అతడితో పాటు సితార వేసిన డ్యాన్స్ మూవ్ మెంట్స్ ఆకట్టుకుంటున్నాయి. రుణాలకు ఎగవేసే వారికి వార్నింగ్ ఇస్తూనే పైసా విలువను ఆవిష్కరిస్తూ సాగిన ఈ పాటను అనంత శ్రీరామ్ రాశారు. నకాష్ అజీజ్ ఆలపించారు. తమన్ సంగీతాన్ని అందించారు. సితారను ఈ పాటలో చూపించాలనే ఆలోచన సంగీత దర్శకుడు తమన్ దని సమాచారం. ఆయనే చిత్ర బృందానికి ఈ విషయాన్ని చెప్పారని తెలిసింది. వారికి తమన్ ఐడియా నచ్చడంతో అందరూ కలిసి మహేష్ ను ఒప్పించినట్లు చెబుతున్నారు.
ఈ పాటలో మహేష్ బాబు, సితారతో పాటు నకాష్ అజీజ్, తమన్ కనిపించారు. మాస్, క్లాస్ మేళవింపుతో ఈ ఫాస్ట్ బీట్ సాంగ్ ఆకట్టుకుంటోంది. ‘సర్కారు వారి పాట’ చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్ ఎంటర్‌టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాను సంక్రాంతికి విడుదలచేయాలని భావించారు. కానీ కరోనా థర్డ్ వేవ్ కారణంగా మే 12కు వాయిదావేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో మహేష్ బాబుతో పాటు ప్రధాన తారాగణంపై కీలక ఘట్టాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ తో సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుందని సమాచారం.
టాపిక్