Shaakuntalam Movie Review: శాకుంత‌లం మూవీ రివ్యూ - స‌మంత పౌరాణిక ప్రేమ‌క‌థ ప్రేక్ష‌కుల్ని మెప్పించిందా?-shaakuntalam movie review samantha dev mohan mythological love story movie review ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Shaakuntalam Movie Review: శాకుంత‌లం మూవీ రివ్యూ - స‌మంత పౌరాణిక ప్రేమ‌క‌థ ప్రేక్ష‌కుల్ని మెప్పించిందా?

Shaakuntalam Movie Review: శాకుంత‌లం మూవీ రివ్యూ - స‌మంత పౌరాణిక ప్రేమ‌క‌థ ప్రేక్ష‌కుల్ని మెప్పించిందా?

Nelki Naresh Kumar HT Telugu
Apr 14, 2023 06:45 AM IST

Shaakuntalam Movie Review: స‌మంత టైటిల్ పాత్ర‌లో న‌టించిన మైథ‌లాజిక‌ల్ ల‌వ్‌స్టోరీ శాకుంత‌లం శుక్ర‌వారం థియేట‌ర్ల ద్వారా పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో భారీ స్థాయిలో రిలీజైంది. గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా ఎలా ఉందంటే...

స‌మంత‌, దేవ్ మోహ‌న్‌
స‌మంత‌, దేవ్ మోహ‌న్‌

Shaakuntalam Movie Review: పౌరాణిక క‌థాంశంతో కెరీర్‌లో తొలిసారి అగ్ర హీరోయిన్ స‌మంత (Samantha) చేసిన సినిమా శాకుంత‌లం(Shaakuntalam) . కాళిదాసు రాసిన అభిజ్ఞాన శాకుంత‌లం ఆధారంగా ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్ ఈ సినిమాను తెర‌కెక్కించారు. దేవ్‌మోహ‌న్‌(Dev Mohan), మోహ‌న్‌బాబు (Mohan Babu)) కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

త్రీడీలో భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ సినిమా శుక్ర‌వారం (నేడు) థియేట‌ర్ల ద్వారా పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో రిలీజైంది. ఈ సినిమాను గుణ‌శేఖ‌ర్ (Gunashekar) త‌న‌య నీలిమ‌తో క‌లిసి దిల్‌రాజు (Dil Raju) నిర్మించారు. పౌరాణిక క‌థాంశంతో స‌మంత పాన్ ఇండియ‌న్ ప్రేక్ష‌కుల్ని మెప్పించిందా? శ‌కుంత‌ల పాత్ర‌కు ఆమె ఏ మేర‌కు న్యాయం చేసింది? గుణ‌శేఖ‌ర్ చేసిన ఈ సినిమా యూత్‌కు క‌నెక్ట్ అవుతుందా? లేదా? అన్న‌ది చూద్ధాం...

Shaakuntalam Story -మేన‌క కూతురు...

విశ్వామిత్రుడి త‌ప‌స్సును భంగం చేయ‌డానికి వ‌చ్చిన మేన‌క అత‌డితో ప్రేమ‌లో ప‌డుతుంది. ఫ‌లితంగా వారికి ఓ కూతురు జ‌న్మిస్తుంది. కానీ మాన‌వ‌క‌న్య‌కు దేవ‌లోక ప్ర‌వేశం లేక‌పోవ‌డంతో పుట్టిన బిడ్డ‌ను అనాథ‌గా భూమిపైనే వ‌దిలి వెళ్లిపోతుంది మేన‌క‌. ఆ బిడ్డ‌ను క‌ణ్వ‌ మ‌హ‌ర్షి పెంచిపెద్ద‌చేస్తాడు. లోక క‌ళ్యాణం కోసం క‌ణ్వ మ‌హ‌ర్షి ఆశ్ర‌మ‌వాసులు చేస్తోన్న ఓ యాగాన్ని కాల‌నేమి అనే రాక్ష‌సులు భ‌గ్నం చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తారు. వారిని పురు రాజు దుష్యంతుడు ఎదురిస్తాడు.

ఆ ఆశ్ర‌మంలోనే ఉన్న శ‌కుంత‌ల అంద‌చందాల‌కు ముగ్ధుడై ఆమెతో ప్రేమ‌లో ప‌డ‌తాడు. ఆమెను గంధ‌ర్వ వివాహం చేసుకుంటాడు. త‌న ప‌ట్టుపురాణిగా రాజ్యానికి తీసుకెళ్లాన‌ని మాటిచ్చి ఆశ్ర‌మం నుంచి వెళ్లిపోతాడు.

దుష్యంతుడు తిరిగి రాక‌పోవ‌డంతో శ‌కుంత‌ల అత‌డి రాజ్యానికి వెళుతుంది. కానీ శ‌కుంత‌ల ఎవ‌రో త‌న‌కు తెలియ‌ద‌ని దుష్యంతుడు చెబుతాడు. నిండు స‌భ‌లో గర్భవతి అని చూడకుండా ఆమెను అవ‌మానిస్తాడు. అందుకు కార‌ణ‌మేమిటి?

ప్రాణంగా ప్రేమించిన శ‌కుంత‌ల‌ను దుష్యంతుడు ఎందుకు గుర్తుప‌ట్ట‌లేదు? దుర్వాస మ‌హాముని శాపం కార‌ణంగా దుష్యంతుడి ప్రేమ‌కు శ‌కుంత‌ల ఎలా దూర‌మైంది? శ‌కుంత‌ల ప్రేమ కోసం దుష్యంతుడు ఎలా ప‌రిత‌పించాడు? చివ‌ర‌కు వారు ఎలా ఏక‌మ‌య్యార‌న్న‌దే శాకుంత‌లం(Shaakuntalam Movie Review) సినిమా క‌థ‌.

పౌరాణిక క‌థ‌...

పురాణాలు, ఇతిహాసాల్లో సామాన్యుల‌కు తెలియ‌ని ఎన్నో గొప్ప క‌థ‌లు ఉన్నాయి. వాటిలో శ‌కుంత‌ల, దుష్యంతుల ప్ర‌ణ‌య‌గాథ ఒక‌టి. మ‌హాభార‌తంలోని ఆదిప‌ర్వంలో ఉన్న అజ‌రామ‌ర ప్రేమ‌ క‌థ‌ను నేటి త‌రానికి తెలియ‌జేప్పాల‌నే సంక‌ల్పంతో గుణ‌శేఖ‌ర్ శాకుంత‌లం సినిమాను తెర‌కెక్కించారు.

ఈ పౌరాణిక ప్రేమ‌క‌థ‌ను త్రీడీ హంగుల‌తో విజువ‌ల్ వండ‌ర్‌గా స్క్రీన్‌పై ప్ర‌జెంట్ చేయాల‌ని గుణ‌శేఖ‌ర్‌ సంక‌ల్పించాడు. కానీ శ‌కుంత‌ల క‌థ‌ను నేటిత‌రం క‌నెక్ట్ అయ్యేలా చెప్ప‌డంలో మాత్రం గుణ‌శేఖ‌ర్ పూర్తిస్థాయిలో స‌క్సెస్ కాలేక‌పోయాడు.

shaakuntalam analysis -క‌త్తి మీద సాము…

పౌరాణిక సినిమాలు చేయ‌డం అంటే క‌త్తి మీద సాము లాంటిది. ఈ సినిమాల్ని తెర‌కెక్కించ‌డంలో ఏ మాత్రం త‌డ‌బ‌డిన విమ‌ర్శ‌ల పాల‌య్యే అవ‌కాశం ఉంటుంది. ఈ క‌థ‌ల‌కు ఫిక్ష‌న్‌ను జోడిస్తే పురాణాల్ని చెడ‌గొట్టేశాడ‌నే నెగెటివ్ కామెంట్స్ వినిపిస్తాయి. అలాగ‌ని ఉన్న‌ది ఉన్న‌ట్లుగా చేస్తే తెలిసిన కథ‌నే స్క్రీన్‌పై చూపించాడ‌నే విమర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతాయి.

శాకుంత‌లం సినిమా విష‌యంలో గుణ‌శేఖ‌ర్ ఆ సంఘ‌ర్ష‌ణ‌ను ఎదుర్కొన్న‌ట్లుగా క‌నిపించింది. శ‌కుంత‌ల‌, దుష్యంతుల జీవితంలో ఏం జ‌రిగిందో అదే స్క్రీన్‌పై చూపించారు. ఎలాంటి క‌ల్పిత అంశాల జోలికి వెళ్ల‌లేదు. కానీ వారి ప్రేమ‌లో బ‌ల‌మైన ఎమోష‌న్స్ సంఘర్షణ లేక‌పోవ‌డంతో శాకుంత‌లం యావ‌రేజ్ ఫీలింగ్‌ను క‌లిగిస్తుంది. రెండు ముక్క‌ల్లోనే చెప్ప‌గ‌లిగే పాయింట్‌ను రెండు గంట‌ల ఇర‌వై నిమిషాలు చూపించ‌డంతో సాగ‌దీసినట్లుగా అనిపిస్తుంది.

శ‌కుంత‌ల‌, దుష్యంతుల ప్రేమ‌క‌థ‌...

శ‌కుంత‌ల పుట్టుక గురించి గ్రాఫిక్స్‌తోనే చెప్పించి సినిమాను మొద‌లుపెట్టారు గుణ‌శేఖ‌ర్‌. ఆ త‌ర్వాత దుష్యంతుడి ప‌రాక్ర‌మం, క‌ణ్వ ఆశ్ర‌మంలో శ‌కుంత‌ల‌ను చూసి ఆమె ప్రేమ‌లో ప‌డ‌టంతో అస‌లు క‌థ మొద‌ల‌వుతుంది. శ‌కుంత‌ల, దుష్యంతుల ప్ర‌ణ‌య క‌లాపాల‌తో ఫ‌స్ట్ హాఫ్ క‌థంటూ(Shaakuntalam Movie Review) ఏమీ లేకుండా సాగిపోతుంది.

దుర్వాస మ‌హాముని శాపం పెట్ట‌డం, ఆ విష‌యం తెలియ‌కుండా దుష్యంతుడి కోసం పురు రాజ్యానికి వెళ్లిన శ‌కుంత‌ల‌కు అవ‌మానం ఎదుర‌వ్వ‌డం, ఆ త‌ర్వాత వాస్త‌వాన్ని తెలుసుకున్న దుష్యంతుడు ...శ‌కుంత‌ల‌ను అన్వేషించే స‌న్నివేశాల‌తో సెకండాఫ్ పూర్తిగా న‌త్త‌న‌డ‌క‌న సాగుతుంది. ఎడ‌బాటుకు కార‌ణం తెలుసుకొని వారిద్ద‌రు ఏకం కావ‌డంతో శాకుంత‌లం సుఖాంత‌మ‌వుతుంది.

స‌మంత యాక్టింగ్ ప్ల‌స్‌...

శ‌కుంత‌ల‌గా స‌మంత చ‌క్క‌టి యాక్టింగ్ ఎక్స్‌ప్రెష‌న్స్‌ను క‌న‌బ‌రిచింది. ఈ పౌరాణిక పాత్ర‌ను అర్థం చేసుకొని న‌టించిన తీరు బాగుంది. కానీ సొంత డ‌బ్బింగ్ కొంత ఇబ్బంది పెట్టింది. దుష్యంతుడిగా దేవ్‌మోహ‌న్ ప‌ర్‌ఫెక్ట్ యాప్ట్‌గా నిలిచాడు. కానీ యాక్టింగ్‌లో మ‌రి కొంత మెచ్యూరిటీ చూపిస్తే బాగుండేది.

క‌ణ్వ మ‌హ‌ర్షిగా స‌చిన్ ఖేడ్క‌ర్‌, శ‌కుంత‌ల ను పెంచిన త‌ల్లిగా గౌత‌మికి మంచి క్యారెక్ట‌ర్స్ ద‌క్కాయి. దుర్వాసుడిగా అతిథి పాత్ర‌లో మోహ‌న్‌బాబు చిన్న పాత్రే అయినా త‌న డైలాగ్ డెలివ‌రీ, మేన‌రిజ‌మ్స్‌తో అద‌ర‌గొట్టారు.

అన‌న్యా నాగ‌ళ్ల‌, క‌బీర్ బేడీ, అర్జున్ క‌ళ్యాణ్‌, శివ‌బాలాజీ ఇలా చాలా మందే ఉన్నా ఎవ‌రికి పెద్ద‌గా ఇంపార్టెన్స్ లేదు. చివ‌ర‌లో అల్లు అర్జున్ త‌న‌య అల్లు అర్హ అతిథి పాత్ర‌లో క‌నిపించింది. ఆమె డైలాగ్స్ ఫ్యాన్స్‌ను మెప్పిస్తాయి. మణిశర్మ మ్యూజిక్ బాగుంది.

Shaakuntalam Review - యూత్‌కు క‌నెక్ట్ కావ‌డం క‌ష్ట‌మే...

శాకుంత‌లం క‌థాప‌రంగా, సాంకేతికంగా కొత్త‌ద‌నం వాస‌న‌లు అస‌లే లేని మూవీ. స‌మంత‌, మోహ‌న్‌బాబు,దేవ్‌మోహ‌న్ లాంటి ప్ర‌తిభావంతులైన న‌టీన‌టులు ఉన్నా బ‌ల‌మైన క‌థ లేక‌పోవ‌డంతో ఈ పౌరాణిక సినిమా యువ‌త‌రానికి క‌నెక్ట్ కావ‌డం కొంత క‌ష్ట‌మే.

IPL_Entry_Point