Sanjay Dutt | నేను డ్రగ్స్ తీసుకున్నది వాళ్ల కోసమే అంటున్న కేజీఎఫ్ స్టార్
సంజయ్ దత్.. ఈ బాలీవుడ్ నటుడి జీవితం వివాదాల మయం. డ్రగ్స్ తీసుకోవడం, ముంబై పేలుళ్ల సమయంలో ఓ ఏకే-47 రైఫిల్ కలిగి ఉండటం వంటివెన్నో వివాదాలు అతని కెరీర్‌ను మసకబార్చాయి.
కేజీఎఫ్ ఛాప్టర్ 2లో అదిరిపోయే నటనతో మరోసారి అందరి నోళ్లలో నానుతున్నాడు బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్. ఈ మూవీలో అతడు పోషించిన విలనీకి అభిమానులు ఫిదా అయిపోతున్నారు. అయితే ఈ మధ్య అతడు తనకున్న డ్రగ్స్ అలవాటు గురించి మరోసారి పబ్లిగ్గా మాట్లాడాడు. ఆ సమయంలో తనను అందరూ చర్సీ (డ్రగ్స్‌కు బానిస) అని పిలిచే వారని, అయితే తనపై వాళ్లకున్న అభిప్రాయాన్ని మార్చడానికి ఎంతో శ్రమించాల్సి వచ్చిందని అతడు చెప్పాడు. నిజానికి సంజయ్ దత్ బయోపిక్ సంజూ మూవీలోనూ అతని జీవితాన్ని కళ్లకు కట్టినట్లు చూపించిన విషయం తెలిసిందే.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో సంజయ్ దత్.. తనకున్న డ్రగ్స్ అలవాటు గురించి చెప్పాడు. ఆడవాళ్లతో మాట్లాడటానికి కావాల్సిన ధైర్యం కోసమే తాను డ్రగ్స్ తీసుకునే వాడినని అతడు చెప్పడం విశేషం. "నేను చాలా సిగ్గరిని. ముఖ్యంగా మహిళలతో మాట్లాడటానికి సిగ్గు పడేవాన్ని. అందుకే కూల్‌గా కనిపించడానికి డ్రగ్స్ అలవాటు చేసుకున్నాను. డ్రగ్స్ తీసుకుంటే లేడీస్‌తో కూల్ గాయ్ అనిపించుకుంటారు. వాళ్లతో మాట్లాడతారు" అని సంజయ్ చెప్పాడు.
తన కెరీర్లో తాను పదేళ్లు వృథా చేసుకున్నానని, ఆ సమయంలో తాను కేవలం తన గది, బాత్రూమ్కే పరిమితమయ్యానని సంజూ వాపోయాడు. తాను రీహ్యాబిలిటేషన్ పూర్తి చేసుకొని వచ్చిన తర్వాత కూడా తనను చూసి చర్సీ అని పిలిచేవారని అతనన్నాడు. వాళ్లు అలా హేళన చేసిన తర్వాతే.. ఇది తప్పు.. నేను మారాలి అనుకొని వర్కౌట్ చేయడం ప్రారంభించానని చెప్పాడు. ఆ తర్వాతే తనను చూసి క్యా బాడీ హై అంటూ అందరూ మెచ్చుకున్నారని సంజూ తెలిపాడు.
కెరీర్ తొలినాళ్లలో ఖల్నాయక్, వాస్తవ్, ఆ తర్వాత అగ్నిపథ్‌లాంటి మూవీల్లో విలన్ పాత్ర పోషించిన సంజయ్ దత్.. మళ్లీ కేజీఎఫ్ చాప్టర్ 2లో నెగటివ్ పాత్రలో కనిపించాడు. ఈ మూవీ పెద్ద హిట్ కావడంతోపాటు సంజయ్ నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయి.
సంబంధిత కథనం
టాపిక్