800 Movie Trailer: ఉత్కంఠంగా 800 మూవీ ట్రైలర్.. సచిన్ చేతులమీదుగా విడుదల-sachin tendulkar released muttiah muralitharan biopic 800 movie trailer ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  800 Movie Trailer: ఉత్కంఠంగా 800 మూవీ ట్రైలర్.. సచిన్ చేతులమీదుగా విడుదల

800 Movie Trailer: ఉత్కంఠంగా 800 మూవీ ట్రైలర్.. సచిన్ చేతులమీదుగా విడుదల

Sanjiv Kumar HT Telugu
Sep 05, 2023 04:14 PM IST

Sachin Tendulkar: క్రికెట్ చరిత్రలో ఎంతోమంది దిగ్గజాలుగా వెలుగొందారు. అలాంటివారిలో లెజండరీ ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ ఒకరు. ముత్తయ్య మురళీధరన్ బయోపిక్‍గా వస్తున్న సినిమా 800. ఈ మూవీ ట్రైలర్‍ను మరో దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ విడుదల చేశారు.

800 మూవీ ట్రైలర్
800 మూవీ ట్రైలర్

క్రికెట్‍కు, సినిమాకు చాలా దగ్గరి సంబంధం ఉంటుంది. ఈ రెండు రంగాల్లోని వ్యక్తులను ప్రేక్షకులు అమితంగా అభిమానిస్తారు. ఇక క్రికెట్ దిగ్గజాల బయోపిక్ సినిమాలు ఎన్నో వచ్చాయి. ఇప్పుడు తాజాగా 800 అనే మరో మూవీ రానుంది. శ్రీలంకన్ ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ (Muttiah Muralitharan) టెస్ట్ క్రికెట్ ప్రపంచంలో 800 వికెట్లు తీసి లెజండరీగా పేరు తెచ్చుకున్నాడు. ఆయన జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్న 800 సినిమాలో స్లమ్‍డాగ్ మిలియనీర్ మూవీ ఫేమ్ మధుర్ మిట్టల్ మెయిన్ లీడ్ రోల్ చేస్తున్నారు. అలాగే ఆయన భార్య మదిమలర్ పాత్రలో మహిమా నంబియార్ నటించారు.

ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహించిన 800 మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‍ను సెప్టెంబర్ 5న ముంబైలో ఘనంగా నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ హాజరయ్యారు. 800 మూవీ ట్రైలర్‍ను సచిన్ విడుదల చేశారు. ఎంతో ఆసక్తిగా సాగిన 800 మూవీ ట్రైలర్‍లో ముత్తయ్య మురళీధరన్ క్రికెట్ ప్రయాణం, ఎత్తుపల్లాలు, గెలుపు, ఓటమి, పడిన అవమానాలు, రాజకీయాలు వంటి తదితర విషయాలను చాలా ఉత్కంఠంగా చూపించారు. ట్రైలర్ చివరలో "నేను క్రికెటర్" అని మధుర్ మిట్టల్ చెప్పడం హైలెట్‍గా నిలిచింది.

తమిళంలో తెరకెక్కిన 800 సినిమాను తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ సినిమాను అక్టోబర్‍లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో నాజర్, నరెన్, వేల్ రామమూర్తి, రిత్విక, వడివుక్కరసి, అరుల్ దాస్, హరి కృష్ణన్, శరత్ లోహితశ్వ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ట్రైన్ మోషన్ పిక్చర్స్ సంస్థ నిర్మాణంలో రూపొందిన 800 చిత్రానికి జిబ్రాన్ సంగీతం అందించారు. ఆర్.డి రాజశేఖర్ సినిమాటోగ్రఫీ, ప్రవీణ్ కెఎల్ ఎడిటర్‍గా బాధ్యతలు చేపట్టారు.

Whats_app_banner