RGV Upcoming Movie Vyuham: రామ్ గోపాల్ వర్మ రియల్ పిక్.. రాజకీయ కుట్రలపై 'వ్యూహం'
RGV Upcoming Movie Vyuham: సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన తదుపరి ప్రాజెక్టును ప్రకటించారు. వాస్తవిక ఘటనల ఆధారంగా రియల్ పిక్ తీస్తున్నానంటూ ట్విటర్ వేదికగా ప్రకటించారు. రాజకీయ కుట్రల ఆధారంగా తెరకెక్కనున్న ఈ సినిమాకు వ్యూహం అనే టైటిల్ పెట్టారు.
RGV Upcoming Movie Vyuham: వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో సరికొత్త కాంట్రవర్సీకి తెరలేపారు. తన చిత్రాలు, మాటలతో ఎప్పుడూ సంచలనాలను సృష్టించే వర్మ.. తన తదుపరి ప్రాజెక్టు గురించి తెలియజేశారు. ఇంతకుముందు రక్త చరిత్ర, వంగవీటి, అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు లాంటి బయోపిక్, నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రాలతో వార్తల్లో నిలిచిన తాజాగా మరోసారి చర్చనీయాంశమయ్యారు. తన తదుపరి చిత్రం రాజకీయ నేపథ్యంలో తెరకెక్కుతుందని ట్విటర్ వేదికగా ప్రకటించారు. వ్యూహం పేరుతో తొలి భాగాన్ని, శపథం పేరుతో రెండో భాగాన్ని రూపొందిస్తున్నట్లు ప్రకటించారు.
"నేను అతి త్వరలో 'వ్యూహం' అనే రాజకీయ సినిమా తియ్యబోతున్నాను ..ఇది బయోపిక్ కాదు బయో పిక్ కన్నా లోతైన రియల్ పిక్. బయో పిక్ లో అయినా అబద్దాలు ఉండొచ్చు కానీ, రియల్ పిక్‌లో నూటికి నూరు పాళ్ళు నిజాలే ఉంటాయి. అహంకారానికి, ఆశయానికి మధ్య జరిగిన పోరాటం నుండి ఉద్భవించిన 'వ్యూహం' కథ , రాజకీయ కుట్రల విషం తో నిండి వుంటుంది .
రాచకురుపు పైన వేసిన కారం తో బొబ్బలెక్కిన ఆగ్రహానికి ప్రతికాష్టే 'వ్యూహం' చిత్రం.
ఈ చిత్రం 2 పార్ట్స్‌గా రాబోతుంది .. మొదటి పార్ట్ 'వ్యూహం', 2nd పార్ట్ 'శపథం' .. రెండింటిలోనూ రాజకీయ అరాచకీయాలు పుష్కలంగా వుంటాయి.
రాష్ట్ర ప్రజలు మొదటి చిత్రం 'వ్యూహం' షాక్ నుంచి తెరుకునే లోపే వాళ్ళకి ఇంకో ఎలెక్ట్రిక్ షాక్ , పార్ట్ 2 'శపథం'లో తగులుతుంది .
'వ్యూహం' చిత్ర నిర్మాత నాతో అంతకు ముందు వంగవీటి సినిమా తీసిన దాసరి కిరణ్ .
ఎలక్షన్స్ టార్గెట్‌గా ఈ చిత్రం తియ్యట్లేదని చెప్తే ఎవ్వరూ నమ్మరు కనక ఏం చెప్పాలో, ఏం చెప్పకూడదో చెప్పాల్సిన అవసరం లేదని మీకు వేరే చెప్పక్కర్లేదు కనక చెప్పట్లేదు.
ఇట్లు మీ భవదీయుడు.. రామ్ గోపాల్ వర్మ" అంటూ ఆర్జీవీ వరుస ట్వీట్లలో తన సారాంశాన్ని తెలియజేశారు.
బుధవారం నాడు ఏపీ సీఎం జగన్‌తో సమావేశమే తిరుగు ప్రయాణంలో గన్నవరం విమానాశ్రయం చేరుకున్న ఆర్జీవీని మీడియా ప్రశ్నించింది. ముఖ్యమంత్రితో భేటీ గురించి అడుగ్గా.. ఆయన పెద్దగా స్పందించలేదు. దీంతో తాను తీయబోయే సినిమా గురించి చర్చించందుకే ఆర్జీవీ.. ముఖ్యమంత్రిని కలిశారంటూ వార్తలొచ్చాయి. తాజాగా ఆయన చేసిన ఈ ట్వీట్‌తో క్లారిటీ వచ్చింది.
సంబంధిత కథనం