Rajinikanth: 33 ఏళ్ల తర్వాత ఆయనతో మళ్లీ పని చేస్తున్నా: సంతోషంతో రజినీకాంత్ ట్వీట్
Rajinikanth - Thalaivar 170: రజినీకాంత్ హీరోగా తలైవర్ 170 సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ కీలకపాత్ర పోషిస్తున్నారు.
Rajinikanth - Thalaivar 170: తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ మంచి స్పీడ్ మీదున్నారు. ఆయన హీరోగా నటించిన జైలర్ సినిమా ఆగస్టులో రిలీజై కలెక్షన్ల సునామీ సృష్టించింది. కాగా ప్రస్తుతం ఆయన మరో సినిమా చేస్తున్నారు. జై భీమ్ ఫేమ్ దర్శకుడు టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో తలైవర్ 170 మూవీ చేస్తున్నారు. ఈ చిత్రం రజినీకాంత్‍కు 170 సినిమాగా ఉంది. కాగా, ఈ సినిమాలో బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ కీలకపాత్ర పోషిస్తున్నారు. దీంతో రజినీ, అమితాబ్ సుమారు 33ఏళ్ల తర్వాత కలిసి నటించనున్నారు. తాజాగా, ఈ సినిమాలోకి అమితాబ్‍ను రజినీకాంత్ ఆహ్వానించారు. ఈ మేరకు నేడు (అక్టోబర్ 25) ట్వీట్ చేశారు.
తలైవర్ 170 సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబైకు చేరింది. అమితాబ్‍తో కలిసి దిగిన ఫొటోను రజినీకాంత్ షేర్ చేశారు. సంతోషంగా ఓ ట్వీట్ చేశారు. “33ఏళ్ల తర్వాత నా మెంటర్‌తో నేను మళ్లీ కలిసి పని చేస్తున్నా. టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్న లైకా నిర్మిస్తున్న తలైవర్ 170లో అద్భుతమైన అమితాబచ్చన్ నటించనున్నారు. నా మనసు సంతోషంతో గంతులేస్తోంది” అని రజినీకాంత్ ట్వీట్ చేశారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
1991లో హమ్ అనే హిందీ సినిమాలో అమితాబ్ బచ్చన్‍తో కలిసి నటించారు రజినీకాంత్. ఆ చిత్రంలో అప్పట్లో బ్లాక్‍బాస్టర్ హిట్ అయింది. ఇప్పుడు మళ్లీ సుమారు మూడు దశాబ్దాల తర్వాత రజినీ-అమితాబ్ కలిసి యాక్ట్ చేస్తున్నారు.
తలైవర్ 170లో టాలీవుడ్ స్టార్ రానా దగ్గుబాటి, మలయాళ స్టార్ ఫాహద్ ఫాజిల్, మంజు వారియర్, రితికా సింగ్, దసరా విజయన్ కూడా నటిస్తున్నారు. ఈ సినిమా తమిళనాడు, కేరళ చిత్రీకరణ షెడ్యూల్స్ ఇటీవలే పూర్తయ్యాయి. ఈ చిత్రానికి కూడా అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.
రజినీకాంత్ హీరోగా నటించిన జైలర్ మూవీ ఈ ఏడాది ఆగస్టులో రిలీజై అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించారు. సుమారు రూ.650కోట్లకుపైగా కలెక్షన్లను జైలర్ సాధించింది. రజినీకి చాలా ఏళ్ల తర్వాత సూపర్ హిట్ దక్కింది. కాగా, తలైవర్ 170 పూర్తయిన వెంటనే.. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో మరో సినిమా (తలైవర్ 171) చేయనున్నారు రజినీకాంత్.