Rana in Thalaivar 170: అఫీషియల్: రజినీకాంత్ చిత్రంలో టాలీవుడ్ హల్క్, మలయాళ స్టార్
Rana in Thalaivar 170: రజినీకాంత్ తదుపరి చిత్రంలో స్టార్ హీరో దగ్గుబాటి రానా నటించనున్నారు. ఓ మలయాళ స్టార్ నటుడు కూడా కీలక పాత్ర పోషించనున్నారు. ఈ విషయంపై అధికారిక ప్రకటన వచ్చింది. వివరాలివే.
Rana in Thalaivar 170: టాలీవుడ్ హల్క్, స్టార్ యాక్టర్ దగ్గుబాటి రానాకు పాన్ ఇండియా రేంజ్‍లో క్రేజ్ ఉంది. ప్రస్తుతం ఆయన హిరణ్యకశ్యప మూవీ పనుల్లో బిజీగా ఉన్నారు. భారీ బడ్జెట్‍తో రానానే ఆ చిత్రాన్ని నిర్మించనున్నారు. అలాగే, హిరణ్యకశ్యప పాత్రను చేయనున్నారు. ఈ తరుణంలో మరో చిత్రం చేసేందుకు దగ్గుబాటి రానా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ 170వ చిత్రం (తలైవర్ 170)లో రానా నటించనున్నారు. ఈ విషయంపై నేడు (అక్టోబర్ 3) అధికారిక ప్రకటన వచ్చింది. వివరాలివే..
జైభీమ్ మూవీ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రజినీకాంత్ హీరోగా ఈ మూవీ రూపొందనుంది. ఇది రజినీకాంత్‍కు 170వ చిత్రం కావడంతో ప్రస్తుతం తలైవర్ 170గా పిలుస్తున్నారు. ఈ సినిమాలో దగ్గుబాటి రానా భాగస్వామ్యం అవుతున్నారంటూ లైకా ప్రొడక్షన్స్ నేడు వెల్లడించింది. ఈ మేరకు ట్వీట్ చేసింది. “సూపర్ కూల్ టాలెంట్ దగ్గుబాటి రానాకు తలైవర్ 170లోకి స్వాగతం చెబుతున్నాం. డ్యాషింగ్ రానా రాకతో తలైవర్ 170 మరింత ఆకర్షణీయంగా మారింది” అని లైకా ప్రొడక్షన్స్ ట్వీట్ చేసింది.
అలాగే, మలయాళ స్టార్ నటుడు ఫాహద్ ఫాజిల్ కూడా తలైవర్ 170 చిత్రంలో నటించనున్నారు. ఈ విషయాన్ని కూడా లైకా ప్రొడక్షన్స్ నేడు అధికారికంగా వెల్లడించింది. ఎన్నో విభిన్నమైన పాత్రలతో ఫాహద్ మంచి నటుడిగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. పుష్ప 2 చిత్రంలోనూ నటిస్తున్నారు.
అయితే, తలైవర్ 170 సినిమాలో రానా పాత్ర ఎలా ఉండనుందో ప్రస్తుతం వెల్లడికాలేదు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మిస్తున్నారు. జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. అలాగే, ఈ చిత్రంలో నటించనున్న కొందరిని కూడా ఇటీవల ప్రకటిస్తూ వస్తోంది లైకా ప్రొడక్షన్స్.
దసరా విజయన్, రితికా సింగ్, మంజు వారియర్ తలైవర్ 170లో కీలకపాత్రలు పోషించనున్నారు. అలాగే, బాలీవుడ్ సీనియర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఈ మూవీలో ముఖ్యమైన క్యారెక్టర్ చేస్తారని తెలుస్తోంది.
తలైవర్ 170 చిత్రంలో రజినీకాంత్ పోలీస్ పాత్ర చేయనున్నారని తెలుస్తోంది. కొన్ని యథార్థ ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని జ్ఞానవేల్ తెరకెక్కిస్తారని సమాచారం. ఈ సినిమా షూటింగ్ అతిత్వరలోనే మొదలుకానుంది. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని మేకర్స్ టార్గెట్ పెట్టుకున్నారు.
కాగా, రజినీకాంత్ హీరోగా నటించిన జైలర్ సినిమా ఆగస్టులో రిలీజై సూపర్ హిట్ కొట్టింది. దాదాపు రూ.650కోట్లకుపైగా కలెక్షన్లను రాబట్టి బాక్సాఫీస్ వద్ద బ్లాక్‍బాస్టర్ అయింది. దీంతో తలైవర్ 170పై అంచనాలు మరింత పెరిగాయి.