SS Rajamouli: షూటింగ్ మొదలుకాకుండానే ఆగిపోయిన బాహుబలి ప్రొడ్యూసర్లతో రాజమౌళి డెబ్యూ మూవీ ఏదంటే?
SS Rajamouli: ఎన్టీఆర్ హీరోగా నటించిన స్టూడెంట్ నంబర్ వన్ మూవీతో డైరెక్టర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు రాజమౌళి. స్టూడెంట్ నంబర్ వన్ కంటే ముందే బాహుబలి ప్రొడ్యూసర్లతో రాజమౌళి ఓ సినిమా చేయాల్సింది. షూటింగ్ మొదలుకాకుండానే ఆ మూవీ ఆగిపోయింది.
SS Rajamouli: ప్రస్తుతం టాలీవుడ్‌లోనే కాకుండా ఇండియన్ సినీ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్లలో ఒకరిగా కొనసాగుతోన్నాడు రాజమౌళి. ఆర్ఆర్ఆర్ మూవీతో ఇండియన్ సినిమా ఖ్యాతిని ఆస్కార్ లెవెల్‌కు తీసుకెళ్లాడు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆర్ఆర్ఆర్ మూవీ ఆస్కార్ అవార్డును సొంతం చేసుకున్నది. రాజమౌళి డైరెక్షన్‌కు హాలీవుడ్ స్టార్స్ సైతం ఫిదా అయ్యారు. రాజమౌళితో సినిమా చేసేందుకు ఇండియాలోని టాప్ హీరోలందరూ రెడీగా ఉన్నారనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.
టీవీ సీరియల్ డైరెక్టర్‌గా...
టీవీ సీరియల్ డైరెక్టర్‌గా రాజమౌళి కెరీర్ ఆరంభమైంది.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన శాంతినివాసం సీరియల్‌కు రాజమౌళి దర్శకత్వం వహించాడు.
ఆ తర్వాత ఎన్టీఆర్ హీరోగా నటించిన స్టూడెంట్ నంబర్‌వన్ మూవీతో డైరెక్టర్‌గా మారాడు. తొలి మూవీతోనే బ్లాక్‌బస్టర్ అందుకున్నాడు. 42 సెంటర్స్‌లో స్టూడెంట్ నంబర్ వన్ మూవీ 100 రోజులు ఆడింది.
స్టూడెంట్ నంబర్ వన్ కంటే ముందే...
స్టూడెంట్ నంబర్ వన్ కంటే ముందు డైరెక్టర్‌గా రాజమౌళికి ఓ సినిమా ఛాన్స్ వచ్చింది. బాహుబలి ప్రొడక్షన్ హౌజ్ ఆర్కా మీడియాతోనే రాజమౌళి దర్శకుడిగా టాలీవుడ్‌కు పరిచయం కావాల్సింది.
శాంతినివాసం సీరియల్‌ను ఆర్కా మీడియా ప్రొడ్యూస్ చేసింది. ఈ సీరియల్‌కు వర మూళ్లపూడితో కలిసి రాజమౌళి దర్శకత్వం వహించాడు. సీరియల్ పెద్ద హిట్టయ్యింది. రాజమౌళి టాలెంట్, ఎమోషన్స్ పండించడంలో ఆయనకు ఉన్న పట్టు చూసి ఆర్కా మీడియా అధినేతలు ప్రసాద్ దేవినేని, శోభూ యార్లగడ్డ ఇంప్రెస్ అయ్యారట. రాజమౌళితో ఓ సినిమా చేసేందుకు సిద్ధమయ్యారు.
రెండు లక్షలు అడ్వాన్స్...
ఈ సినిమా కోసం రాజమౌళికి రెండు లక్షలు అడ్వాన్స్‌గా కూడా ఇచ్చారట. ఈ మూవీతోనే అటు డైరెక్టర్‌గా రాజమౌళి, ప్రొడ్యూసర్లుగా ప్రసాద్ దేవినేని, శోభు యార్లగడ్డ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వాల్సింది. కథ సిద్ధమైన తర్వాత ప్రీ ప్రొడక్షన్ స్టేజ్‌లో ఏర్పడిన ఆటంకాల వల్ల అనుకోకుండా సినిమా ఆగిపోయింది. అలా బాహుబలి ప్రొడ్యూసర్లతో రాజమౌళి చేయాల్సిన డెబ్యూ మూవీ షూటింగ్ మొదలుకాకముందే ఆటకెక్కింది.
ఈ సినిమా ఆగిపోయిన కొన్నాళ్లకే రాజమౌళికి స్టూడెంట్ నంబర్ వన్ చేసే ఛాన్స్ వచ్చింది. ఈ మూవీతో రాజమౌళి టాలెంట్ ఏమిటో అందరికి తెలిసిపోయింది. డెబ్యూ మూవీ ఆగిపోయిన పదేళ్ల తర్వాత ఆర్కా మీడియాలో మర్యాద రామన్న సినిమా చేశాడు రాజమౌళి. ఆ తర్వాత ఇదే బ్యానర్‌లో వచ్చిన బాహుబలితో రాజమౌళి పేరు జాతీయ స్థాయిలో మారుమ్రోగిపోయింది.
మహేష్‌బాబు మేకోవర్...
ఆర్ఆర్ఆర్ బ్లాక్‌బస్టర్ తర్వాత మహేష్‌బాబుతో ఓ యాక్షన్ అడ్వెంచర్ మూవీ చేయబోతున్నాడు రాజమౌళి. ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ సినిమా కోసం లుక్, ఫిజిక్ పరంగా మహేష్‌బాబు కంప్లీట్ మేకోవర్ అవుతోన్నారు. లాంగ్ హెయిర్ స్టైల్, గడ్డంతో రాజమౌళి మూవీలో మహేష్‌బాబు కనిపించబోతున్నాడు.