Liger: లైగర్ నాకు రెండో ఇన్నింగ్స్ లాంటిది.. పూరి జగన్నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు-puri jagannadh says liger movie is second innings for him ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Liger: లైగర్ నాకు రెండో ఇన్నింగ్స్ లాంటిది.. పూరి జగన్నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Liger: లైగర్ నాకు రెండో ఇన్నింగ్స్ లాంటిది.. పూరి జగన్నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Maragani Govardhan HT Telugu
Aug 20, 2022 09:02 AM IST

పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన లైగర్ సినిమా ఆగస్టు 25న విడుదల కాబోతోంది. విజయ్ దేవర కొండ నటించిన ఈ చిత్రంలో అనన్యా పాండే హీరోయిన్. ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయాలను తెలియజేశారు పూరి.

పూరి జగన్నాథ్
పూరి జగన్నాథ్ (HT)

విజయ్ దేవరకొండ హీరోగా, పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన సినిమా లైగర్. అనన్యా పాండే హీరోయిన్‌గా చేసిన ఈ చిత్రం ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల దగ్గరకొచ్చే కొద్ది చిత్రబృందం కూడా ప్రమోషన్లను వేగవంతం చేసింది. దేశవ్యాప్తంగా విభిన్న నగరాల్లో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంది. ఎక్కడకు వెళ్లిన విజయ్‌పై అభిమానులు తమ అభిమానాన్ని చూపిస్తూ.. లైగర్‌పై ప్రేమ కురిపిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో విజయ్, చార్మీ, పూరి జగన్నాథ్ పాల్గొన్నారు. పూరి తన కెరీర్ గురించి మాట్లాడుతూ.. ఈ సినిమా తనకు రెండో ఇన్నింగ్స్ లాంటిదని స్పష్ట చేశారు.

"లైగర్ పక్కా కమర్షియల్ చిత్రం. ట్రైలర్‌లో చాలా మంది ఈ డైలాగులను ఊహించారు. అయితే సినిమా కథ అందరికీ కనెక్ట్ అవుతుంది. కరీంనగర్ నుంచి ముంబయికి వెళ్లిన తల్లి, కొడుకుల కథ ఇది. కుమారుడిని ఛాంపియన్‌గా చూడాలనేది ఆ తల్లి కల." అని పూరి జగన్నాథ్ సినిమా స్టోరీ లైన్ గురించి వివరించారు.

గతంలో పూరి జగన్నాథ్ ఆరు నెలలకో చిత్రాన్ని తీసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేవారు. కానీ లైగర్ కోసం మూడేళ్ల పాటు సమయాన్ని తీసుకున్నారు. ఈ విషయం గురించి అడగ్గా.. పూరి ఆసక్తికర సమాధానాన్ని ఇచ్చారు.

"కరోనాకు ముందు నేను చేసిన సినిమాలు, ఇప్పుడు నేను చేస్తున్న సినిమాలు పూర్తిగా విభిన్నం. లైగర్ నాకు రెండో ఇన్నింగ్స్ లాంటిది. ఇది నా తొలి చిత్రం మాదిరిగా అనిపిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు నేను ఎక్కువ సమయాన్ని వెచ్చించడంతో పాటు నా పూర్తి కష్టాన్ని ఇందులో పెట్టాను. నేను మహా అయితే మరో 10 సినిమాలు చేస్తానేమో" అని పూరి జగన్నాథ్ స్పష్టం చేశారు.

ఈ చిత్రానికి పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించారు. ఆయనతో పాటు కరణ్‌ జోహార్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇది విజయ్‌కు హిందీలో తొలి చిత్రం. రమ్య కృష్ణ ఇందులో రౌడీ హీరోకు తల్లి పాత్రలో కనిపించనుంది. అనన్యా పాండే హీరోయిన్ కాగా.. రోనిత్ రాయ్ విజయ్‌కు కోచ్‌ పాత్రలో కనిపించనున్నారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లోనూ ఈ సినిమా ఏకకాలంలో విడుదలకానుంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం