Porinju Mariam Jose Movie Review: పొరింజు మరియం జోస్ రివ్యూ - నాగార్జున నా సామిరంగకు స్ఫూర్తి ఈ మలయాళం మూవీనే!
Porinju Mariam Jose Movie Review: జోజు జార్జ్ హీరోగా నటించిన మలయాళ సినిమా పొరింజు మరియం జోస్ సినిమాను నా సామి రంగ పేరుతో నాగార్జున తెలుగులోకి రీమేక్ చేస్తున్నాడు. ఈ మలయాళ సినిమా కథ ఏమిటంటే...
Porinju Mariam Jose Movie Review: జోజు జార్జ్ (Joju George), చెంబన్ వినోద్ జోస్ హీరోలుగా నటించిన మలయాళ మూవీ పొరింజు మరియం జోస్. జోషి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మలయాళంలో(Malayalam Movie) పెద్ద విజయాన్ని సాధించింది. ఈ సినిమాను నా సామి రంగ (Naa Saamiranga)పేరుతో నాగార్జున (Nagarjuna Akkineni) తెలుగులోకి రీమేక్ చేస్తున్నాడు. పీరియాడికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మలయాళం మూవీ ఎలా ఉందంటే?
ముగ్గురు స్నేహితుల కథ...
పొరింజు (జోజు జార్జ్) , జోస్ (చెంబన్ వినోద్ జోస్) చిన్ననాటి నుంచి ప్రాణస్నేహితులు. మరియమ్‌ను (నైలా జోస్)ప్రేమిస్తాడు పొరింజు. కానీ ఆ విషయం ఆమెకు చెప్పడానికి భయపడుతుంటాడు. స్కూల్‌లో మరియమ్‌ను ఓ విద్యార్థి ఏడిపిస్తాడు. ఆ గొడవ కారణంగా పొరింజు, జోస్ చదువుకు దూరమవుతారు. బతుకుతెరువు కోసం పొరింజు మటన్ షాప్ పెడతాడు.
ముతాళలి అనే రియల్ ఎస్టేట్ డీలర్‌కు నమ్మకస్తుడిగా పనిచేస్తుంటాడు. తన కొడుకుల కంటే పొరింజునే ఎక్కువగా నమ్ముతుంటాడు ముతాళలి. జోస్ చిన్న చిన్న పనులు చేస్తూ జీవిస్తుంటాడు. పొరింజును ప్రేమించిన మరియం అతడిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. కానీ పొరింజును మరియం పెళ్లిచేసుకోవడం ఆమె తండ్రి విక్టర్‌కు ఇష్టం ఉండదు.
కూతురిని బెదిరించబోయి ప్రమాదంలో విక్టర్ కన్నుమూస్తాడు. తన తండ్రి చావుకు పొరింజు కారణం అని అతడిని ద్వేషిస్తుంటుంది మరియం. పొరింజు, మరియంలను కలిపేందుకు జోస్ ప్రయత్నిస్తుంటాడు. చర్చి ఉత్సవాల్లో ముతాళలి మనవడు ప్రిన్స్..మరియంతో అసభ్యంగా ప్రవర్తించడంతో జోస్ అతడికి వార్నింగ్ ఇస్తాడు. దాంతో ప్రిన్స్‌తో పాటు ముతాళలి కొడుకులు కలిసి జోస్‌పై చేయిచేసుకుంటారు. అప్పుడే అక్కడకు వచ్చిన పొరింజు ప్రిన్స్‌తో పాటు ముతాళలి కొడుకులను చితక్కోడతాడు.
తన కొడుకుల్ని పొరింజు కొట్టడం చూసి కూడా ముతాళలి వారించడు. పొరింజుతో పాటు జోస్‌పై కోపంతో అతడిని చంపేందుకు ముతాళలి కొడుకులతో పాటు ప్రిన్స్ ప్రయత్నిస్తుంటారు. ఆ ఏరియాలో పొరింజును చంపడానికి రౌడీలు ఎవరూ ముందుకు రాకపోవడంతో మరో ప్రాంతం నుంచి రౌడీలను తీసుకొచ్చి తన ఇంట్లోనే పెడతాడు ప్రిన్స్. ఓరోజు థియేటర్‌లో సినిమా చూస్తోన్న జోస్‌ను ప్రిన్స్‌తో పాటు అతడి మనుషులు చంపేస్తారు.
ఆ తర్వాత ఏమైంది? ప్రిన్స్‌పై పొరింజు ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? తన మనవడిని చంపేసిన పొరింజును ముతాళలి ఏం చేశాడు? పొరింజు ప్రేమను మరియం అర్థం చేసుకున్నదా? లేదా? అన్నదే పొరింజు మరియం జోస్(Porinju Mariam Jose Movie Review) మూవీ కథ.
సినిమాటిక్ రూల్‌కు భిన్నంగా...
క్లైమాక్స్‌లో విలన్‌ను హీరో చంపడం అన్నది అన్ని సినిమాల్లో కామన్‌గా కనిపిస్తుంది. భాష ఏదైనా అన్ని సినిమాల్లో ఈ రూల్‌ను తప్పకుండా డైరెక్టర్స్ ఫాలో అవుతోంటారు. కానీ ఈ సినిమాటిక్ రూల్‌ను బ్రేక్ చేసే కథలు చాలా అరుదుగా వస్తాయి. పొరింజు మరియం జోస్ అలాంటి కథే. డిఫరెంట్ క్లైమాక్స్‌తో సినిమా ఎండ్ చేశాడు డైరెక్టర్ జోషి. ఆ ట్విస్ట్ నచ్చడంతోనే మలయాళ ఆడియెన్స్ సినిమాను పెద్ద హిట్ చేశారు.
పీరియాడికల్ లవ్ స్టోరీ...
ప్రేమ, స్నేహంతో పాటు రివేంజ్ అంశాలతో సాగే పీరియాడికల్ మూవీగా దర్శకుడు జోషి... పొరింజు మరియం జోస్ మూవీని తెరకెక్కించాడు. సినిమా మొత్తం 1965, 1985 కాలాల వ్యవధుల్లో నడుస్తుంది. సింపుల్ స్టోరీని పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్ చెప్పడం ఈ సినిమాకు(Porinju Mariam Jose Movie Review) ప్లస్ పాయింట్‌గా నిలిచింది. అప్పటి బాలీవుడ్ హిట్ సాంగ్స్ ద్వారా ఆనాటి కాలాన్ని రీక్రియేట్ చేశాడు డైరెక్టర్.
రివేంజ్ డ్రామా...
తన స్నేహితుడి మరణానికి కారణమైన వారిపై ప్రతీకారం తీర్చుకునే ఓ వ్యక్తి కథ ఇది. ఈ రివేంజ్ స్టోరీకి ప్రేమికుల మధ్య సంఘర్షణను జోడిస్తూ చివరి వరకు సినిమా ఆసక్తికరంగా సాగుతుంది. 1965లో పొరింజు, మరియం, జోస్ చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు కథ మొదలవుతుంది.
వారి మధ్య ఉన్న స్నేహానికి కులం, ఆస్తి అంతస్థులు ఎలా అడ్డుగోడగా నిలిచాయన్నది చూపించారు. ఆ తర్వాత 1985లో చర్చి ఉత్సవాలతో కథ ఇంట్రెస్టింగ్ మొదలవుతుంది. ఆ ఉత్సావాల్లోనే గొడవలు జరగడం, ముతాళలి కొడుకులు పొరింజు , జోస్‌పై పగను పెంచుకునే సీన్స్‌తో సినిమాను ఎంగేజింగ్‌గా ముందుకు నడిపించారు.
ఓ వైపు రివేంజ్ డ్రామా మరోవైపు పొరింజు, మరియం విఫల ప్రేమకథను సమాంతరంగా చూపించారు డైరెక్టర్. జోస్, ఆ తర్వాత పొరింజు మరణంతో సూపర్బ్ ట్విస్ట్‌తో సినిమా(Porinju Mariam Jose Movie Review) ఎండ్ అవుతుంది.
కామెడీ ప్లస్...
కథలోనే అంతర్లీనంగా డైరెక్టర్ కామెడీని పండించిన తీరు బాగుంది. పొరింజు, జోస్‌లను బెదిరించడానికి శత్రువులు వారికి శవపేటికల్ని గిఫ్ట్‌గా ఇస్తారు. ఆ శవ పేటికను పొరింజు తండ్రి బెడ్‌గా వాడుకోవడం లాంటి సీన్స్ లోని కామెడీ బాగా వర్కవుట్ అయ్యింది. మరియం తండ్రి చావుకు కారణమైన కీలకమైన సీన్ కాస్త సిల్లీగా అనిపిస్తుంది.
జోజు జార్జ్ హైలైట్...
పొరింజు మరియం జోస్ సినిమాలో జోజు జార్జ్ హీరోయిజం, ఎలివేషన్స్ ఆకట్టుకుంటాయి. కరుడుగట్టిన రౌడీ పాత్రలో అతడి హావభావాలు, యాక్టింగ్ బాగున్నాయి. జోస్‌గా చెంబన్ వినోద్ జోస్ ఫన్ రోల్‌లో మెప్పించాడు. ప్రేమ కోసం పరితపించే, సమాజంలో ఒంటరిగా బతికే ధైర్యవంతురాలైన యువతిగా నైలా ఉషా తన యాక్టింగ్‌తో అదొరగొట్టింది.
కథ రొటీన్ అయినా...
జోజు జార్జ్ యాక్టింగ్, జోషి టేకింగ్ కోసం చూడాల్సిన మలయాళ సినిమా ఇది. కథ రొటీన్ అయినా డైరెక్టర్ స్క్రీన్‌పైఆవిష్కరించిన తీరు మాత్రం కొత్తగా ఉంటుంది.