Phalana Abbayi Phalana Ammayi Review: ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి రివ్యూ - నాగశౌర్య సినిమా ఎలా ఉందంటే
Phalana Abbayi Phalana Ammayi Review: నాగశౌర్య హీరోగా శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో రూపొందిన ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి సినిమా శుక్రవారం థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది.
Phalana Abbayi Phalana Ammayi Review: ఊహలు గుసగుసలాడే, జ్యో అచ్యుతానంద తర్వాత హీరో నాగశౌర్య, దర్శకుడు శ్రీనివాస్ అవసరాల కాంబినేషన్‌లో రూపొందిన సినిమా ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి. బ్యూటీఫుల్ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాలో మాళవికా నాయర్ హీరోయిన్‌గా నటించింది. శుక్రవారం థియేటర్ల ద్వారా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాతో నాగశౌర్య, శ్రీనివాస్ అవసరాల హ్యాట్రిక్ హిట్‌ను అందుకున్నారా? లేదా? అన్నది తెలియాలంటే కథలోని వెళ్లాల్సిందే...
సీనియర్‌తో ప్రేమాయణం…
బీటెక్‌లో జాయిన్ అయిన సంజయ్(నాగశౌర్య)కి సీనియర్ అయిన అనుపమతో(మాళవికా నాయర్) స్నేహం మొదలవుతుంది. ఆ తర్వాత ఇద్దరు కలిసి ఎంఎస్ చదవడానికి లండన్ వెళతారు. ఆ సమయంలో వారి మధ్య ప్రేమ చిగురిస్తుంది. లివింగ్ రిలేషన్‌లో ఉంటారు. ఎంఎస్ తర్వాత ఉద్యోగం కోసం మరో సిటీకి మారుతుంది అనుపమ.
అది నచ్చని సంజయ్ ఆమెతో గొడవపడతాడు. కొన్ని పరిస్థితుల వల్ల సంజయ్, అనుపమ విడిపోతారు. అందుకు గల కారణాలేమిటి? వారిద్దరు తిరిగి మళ్లీ ఎలా కలుసుకున్నారు? అనుపమ దూరమైన తర్వాత సంజయ్ జీవితంలోకి వచ్చిన పూజ (మేఘా చౌదరి) ఎవరు? సంజయ్, అనుపమ ప్రయాణంలో గిరి(అవసరా శ్రీనివాస్) పాత్ర ఏమిటన్నది? గిరితో పెళ్లికి సిద్ధమైన అనుపమ అతడితో ఏడడుగులు వేసిందా? లేదా అన్నదే ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి(Phalana Abbayi Phalana Ammayi Review) కథ.
ఏడు ఛాప్టర్స్‌లో...
ఓ జంట ప్రేమ ప్రయాణాన్ని ఏడు ఛాప్టర్స్‌గా చూపిస్తూ దర్శకుడు శ్రీనివాస్ అవసరాల ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి సినిమాను తెరకెక్కించారు. బీటెక్‌లో చిగురించిన ప్రేమ ఎలా పెళ్లిపీటల వరకు చేరుకున్నదన్నది పొయోటిక్ వేలో అందమైన దృశ్యకావ్యంగా ఈ సినిమాలో చూపించారు.
సింపుల్ కథను ఎంచుకున్న దర్శకుడు శ్రీనివాస్ అవసరాల తనదైన మార్కు కథనంతో మ్యాజిక్ చేసి ప్రేక్షకుల్ని మెప్పించాలని అనుకున్నారు. లవ్, ఫన్, సెంటిమెంట్‌తో ఎమోషనల్ రైడ్‌గా చివరి వరకు సినిమాను నడిపించే ప్రయత్నం చేశారు
ఎమోషనల్ రైడ్…
బీటెక్‌లో సంజయ్ జాయిన్ కావడం, సీనియర్స్ ర్యాంగింగ్ నుంచి అనుపమ అతడినిసేవ్ చేసే సీన్స్‌తో హీరోహీరోయిన్ల మధ్య బాండింగ్ మొదలైనట్లుగా చూపించడం బాగుంది. ఆ సీన్స్‌లో ఫన్ చక్కగా వర్కవుట్ అయ్యింది.
ఆ తర్వాత కథను ఫారిన్‌కు ఫిష్ట్ చేశారు డైరెక్టర్. సంజయ్, అనుపమ లివింగ్ రిలేషన్, వారి మధ్య దూరం పెరగడం, అనుపమపై ద్వేషంతో పూజకు సంజయ్ దగ్గర అయ్యే సీన్స్‌తో ఆహ్లాభరితంగా కథ ముందుకు సాగుతుంది. ఆ తర్వాత సంజయ్, అనుపమ తిరిగి కలవడం, తమ మధ్య ఉన్న ప్రేమను గుర్తుచేసుకుంటూ ఒక్కటి అయ్యే సీన్స్‌తో ఎమోషనల్ క్లైమాక్స్‌తో సినిమా ముగుస్తుంది.
సింపుల్ స్టోరీ...
సింపుల్ కథ కావడమే ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయికి పెద్ద మైనస్‌గా మారింది. చాలా సినిమాల్లో వచ్చిన కథకే కొత్త మెరుగులు దిద్దిన భావన కలుగుతుంది. హీరో హీరోయిన్లు విడిపోవడానికి, కలవడానికి చూపించిన కారణాల్లో డెప్త్ లేదు. కథాగమనం నిదానంగా సాగడం ఓపికకు పరీక్షగా ఈ సినిమా నిలిచింది.
రెండు పాత్రలు హైలైట్...
ఈ సినిమా కథ మొత్తం నాగశౌర్య, మాళవికా నాయర్ పాత్రల చుట్టే తిరుగుతుంది. స్టూడెంట్ నుంచి మెచ్యూర్డ్ పర్సన్‌గా నాగశౌర్య ట్రాన్స్‌ఫర్మెషన్ బాగుంది. లుక్స్ పరంగా వేరియేషన్‌చూపించాడు. అనుపమ పాత్రలో మాళవికా నాయర్ యాక్టింగ్ బాగుంది. ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకుంది. శ్రీనివాస్ అవసరాల , అభిషేక్ మాహర్షి క్యారెక్టర్స్ సినిమాకు ప్లస్సయ్యాయి.
Phalana Abbayi Phalana Ammayi Review- క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కానీ...
ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి రొటీన్ లవ్‌స్టోరీ. అశ్లీలతకు తావు లేకుండా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు శ్రీనివాస్ అవసరాల ఈ సినిమాను తెరకెక్కించారు.కానీ కథ, కథనాల పరంగా కొత్తదనం లేకపోవడంతో ఈ సినిమా ప్రేక్షకుల్ని మెప్పించడం కష్టమే.