NTR30 | తారక్-కొరటాల శివ సినిమా మొదలయ్యేది అప్పటి నుంచే?
జూనియర్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్‌లో సినిమా కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. NTR30 వర్కింగ్ టైటిల్‌తో రానున్న ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ జులై నుంచి ప్రారంభమవుతుందని ఫిల్మ్ వర్గాల సమాచారం.
టాలీవుడ్ సంచలన దర్శకుడు కొరటాల శివ.. తన తదుపరి చిత్రాన్ని జూనియర్ ఎన్టీఆర్‌తో చేయనున్నాడనే విషయం అందరికి తెలిసిందే. ఇటీవలే ఆయన తెరకెక్కించిన ఆచార్య చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. దీంతో ఎన్టీఆర్ సినిమాతో అయినా విజయాన్ని కచ్చితంగా కొట్టాలనే పట్టుదలతో ఉన్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రకటన వచ్చినప్పటికీ షూటింగ్ మాత్రం ప్రారంభం కాలేదు. తాజాగా ఈ సినిమా షూట్‌కు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది.
కొరటాల శివ- తారక్ కాంబినేషన్‌లో రానున్న ఈ చిత్ర షూటింగ్ జులై నుంచి ప్రారంభం కానుందని సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన విడుదల కానుంది. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్‌ను తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం.
వరుసగా నాలుగు సూపర్ హీట్లు అందుకున్న కొరటాల శివకు ఆచార్యతో భారీ ఫ్లాప్ ఎదురైంది. దీంతో ఎలాగైన తారక్‌తో సినిమాతో కచ్చితంగా హిట్ కొట్టాలనే కసితో ఉన్నారు. ఈ సినిమాతో సక్సెస్ అందుకుని మళ్లీ ట్రాక్‌లో పడాలని భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్స్ పనులు శరవేగంగా జరుగుతున్ ఈ చిత్రాన్ని పాన్ఇండియా స్థాయిలో విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నహాలు చేస్తోంది.
ఆర్ఆర్ఆర్ చిత్రంతో ఎన్టీఆర్ క్రేజ్ హిందీ మార్కెట్‌లో గణనీయంగా పెరిగింది. కాబట్టి తారక్ తదుపరి చిత్రంపై భారీగానే అంచనాలు నెలకొన్నాయి. రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించాలనే ఆలోచనో ఉన్నట్లు సమాచారం. జులైలో పట్టాలెక్కనున్న ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది.
ఇప్పటికే ఎన్టీఆర్ కూడా ఈ సినిమా కోసం కసరత్తులు మొదలుపెట్టారు. జనతా గ్యారేజ్ లాంటి సూపర్ హిట్ ఇచ్చిన వీరి కాంబినేషన్ కోసం తారక్ అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కాబట్టి సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్.. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోనూ ఓ సినిమాకు పచ్చజెండా ఊపారు. ఈ చిత్రం కూడా ఈ ఏడాదే పట్టాలెక్కే అవకాశముంది.
సంబంధిత కథనం
టాపిక్