Zara Patel on Rashmika Fake Video: ఇంటర్నెట్‌లో కనిపించేదంతా నిజం కాదు - రష్మిక ఫేక్ వీడియోపై జారా పటేల్ ఆవేదన
Zara Patel on Rashmika Fake Video: రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియోపై సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ జారా పటేల్ స్పందించింది. తన బాడీ, రష్మిక మందన్న ఫేస్‌ను ఉపయోగించి ఈ ఫేక్ వీడియోను ఎవరో మార్ఫింగ్ చేశారని జారా పటేల్ చెప్పింది.
Zara Patel on Rashmika Fake Video: రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియో టాలీవుడ్, బాలీవుడ్‌తో పాటు అన్ని ఇండస్ట్రీలలో కలకలం రేపుతోంది. అమితాబ్‌బచ్చన్, నాగచైతన్య, కల్వకుంట్ల కవితతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు రష్మికకు మద్ధతుగా నిలుస్తోన్నారు. ఈ ఫేక్ మార్ఫింగ్ వీడియోలకు అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోన్నారు.
జారా పటేల్ అనే సోషల్ మీడియా ఇన్‌ప్లూయెన్సర్ బాడీకి ఏఐ టెక్నాలజీతో రష్మిక మందన్న ఫేస్‌ను జోడించి మార్ఫింగ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది ఫేక్ వీడియో అని ఎవరికి డౌట్ రాకుండా మార్ఫింగ్ చేయడం ఆసక్తికరంగా మారింది. నెటిజన్లతో పాటు ఫ్యాన్స్ కూడా ఇది నిజంగానే రష్మిక మందన్న వీడియో అని పొరపడ్డారు. కానీ ఓ నెటిజన్ చేసిన ట్వీట్‌తో ఈ ఫేక్ వీడియో బండారం మొత్తం బయటపడింది.
మార్ఫింగ్ వీడియో ఇండస్ట్రీని కుదిపేస్తోంది. ఈ ఫేక్ వీడియోపై రష్మిక కూడా ఆందోళన వ్యక్తం చేసింది. తాజాగా ఈ ఫేక్ వీడియోపై జారా పటేల్ స్పందించింది. ఈ వీడియో మార్ఫింగ్‌లో తన ప్రమేయమేమీ లేదని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. తన శరీరాన్ని, రష్మిక మందన్న ఫేస్‌ను ఉపయోగిస్తూ ఎవరో వీడియోను మార్ఫింగ్ చేశారని, ఈ ఫేక్ వీడియోను ఎవరు క్రియేట్ చేశారో తనకు తెలియదని చెప్పింది.
ఈ వీడియో తనను ఎంతగానో డిస్ట్రబ్ చేసిందని, చాలా అప్‌సెట్ అయ్యానని జారా పటేల్ పేర్కొన్నది. మహిళలలు, ఆడపిల్లల భద్రత గురించి తలుచుకుంటే భయమేస్తోందని, సోషల్ మీడియాలో తమ ఫొటోలను పోస్ట్ చేసే విషయంలో మహిళలు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని జారా పటేల్ చెప్పింది. ఇంటర్‌నెట్‌లో కనిపించేది అంతా నిజం కాదని, నిజానిజాలేమిటో తెలుసుకొన్న తర్వాత నిర్ధారణకు వస్తే మంచిదని జారా పటేల్ సూచించింది జారా పటేల్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.