Spy Movie Trailer: “చరిత్ర నిజం చెప్పదు”: నిఖిల్ ‘స్పై’ సినిమా ట్రైలర్ వచ్చేసింది.. ఇంట్రెస్టింగ్‍గా.. చివర్లో రానా కూడా
Spy Movie Trailer Release: నిఖిల్ హీరోగా నటిస్తున్న స్పై మూవీ ట్రైలర్ విడుదలైంది. సుభాష్ చంద్రబోస్ మరణం మిస్టరీపై తెరకెక్కిన ఈ చిత్ర ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది.
Spy Movie Trailer Release: హీరో నిఖిల్ నటించిన స్పై చిత్రం ట్రైలర్ వచ్చేసింది. అల్లు అర్జున్‍కు చెందిన ఏఏఏ సినిమాస్‍లో స్పై మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నేడు (జూన్ 22) జరిగింది. నేటి ఉదయమే ఈ ఈవెంట్ జరగాల్సి ఉండగా.. సాయంత్రానికి వాయిదా పడింది. ఎట్టకేలకు స్పై ట్రైలర్ సాయంత్రం రిలీజ్ అయింది. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణం మిస్టరీని ఛేదించే కథాంశంతో స్పై మూవీ రూపొందింది. స్పై మూవీ ట్రైలర్.. చాలా ఆసక్తికరంగా ఉంది. చివర్లో ఓ సర్‍ప్రైజ్ ఉంది.
“చరిత్ర మనకెప్పుడూ నిజం చెప్పదు..దాస్తుంది. దానికి సమాధానం మనమే వెతకాలి” అనే డైలాగ్‍తో స్పై సినిమా ట్రైలర్ మొదలవుతుంది. యాక్షన్ సీన్లు కూడా ట్రైలర్‌లో ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. సుభాష్ చంద్రబోస్ మరణం వెనుక మిస్టరీని కనుగొనే స్పై పాత్రలో నిఖిల్ నటించాడు. “స్వతంత్రం అంటే ఒకడు ఇచ్చేది కాదు. లాక్కునేది. ఇది నేను చెప్పింది కాదు.. నేతాజీ చెప్పింది” అని చివర్లో హీరో రానా డైలాగ్ ఉంది. ట్రైలర్ చివర్లో పైలట్‍గా రానా కనిపించాడు. పాన్ ఇండియా మూవీగా రూపొందిన ‘స్పై’ జూన్ 29న అంటే మరో ఏడు రోజుల్లో థియేటర్లలో విడుదల కానుంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ మలయాళం భాషల్లో రిలీజ్ కానుంది.
స్పై మూవీకి బీహెచ్ గ్యారీ దర్శకుడిగా ఉన్నాడు. ఐశ్యర్య మీనన్, సాన్య ఠాకూర్ హీరోయిన్లుగా ఉన్నారు. అభినవ్ గోమఠం, ఆర్యన్ రాజేశ్, జిస్సు సెంగుప్త, మార్కండ్ దేశ్‍పాండే తదిదరులు ఈ సినిమాలో నటించారు.
స్పై చిత్రాన్ని కే రాజశేఖర్ రెడ్డి, చరణ్ తేజ్ ఉప్పాలపాటి నిర్మించారు. విశాల్ చంద్రశేఖర్, శ్రీచరణ్ పాకాల సంయుక్తంగా సంగీతం అందించారు.
గతేడాది కార్తికేయ-2 సినిమాతో పాన్ ఇండియా రేంజ్‍లో సూపర్ హిట్ కొట్టాడు నిఖిల్. అధ్యాత్మికతతో కూడిన సబ్జెక్టుతో బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా చేరువయ్యాడు. ఇప్పుడు స్పై మూవీతో మరో వైవిధ్యమైన కథతో నిఖిల్ వస్తున్నాడు. సుభాష్ చంద్రబోస్, దేశభక్తితో కూడిన కథాంశాలతో స్పై చిత్రం ఉంది. ట్రైలర్ రేంజ్‍లోనే స్పై మూవీ ఉంటే.. నిఖిల్‍కు మరో బ్లాక్‍బాస్టర్ పడే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి.