Dead Pixels Review: అంతా గేమ్ మయం.. డెడ్ పిక్సెల్స్ సిరీస్ ఎలా ఉందంటే?
Dead Pixels Review: నిహారిక కొణిదెల నటించిన తాజా వెబ్ సిరీస్ డెడ్ పిక్సెల్స్. ఆరు ఎపిసోడ్‌లుగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. వైవా హర్ష, అక్షయ్ లగుసాని తదితరులు ఇందులో నటించారు. మరి ఈ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
వెబ్ సిరీస్- డెడ్ పిక్సెల్స్
నటీనటులు- నిహారికా కొణిదెల, అక్షయ్ లగుసాని, వైవా హర్ష, సాయి రోణక్, భావనా సాగి తదితరులు.
రైటర్- అక్షయ్ పుల్ల
దర్శకత్వం- ఆదిత్య మందల
నిర్మాతలు- సమీర్ గోగటే, సాయిదీప్ రెడ్డి బొర్రా, రాహుల్ తమడా
స్ట్రీమింగ్ తేదీ- 2023 మే 19
ఓటీటీ ప్లాట్ ఫాం- డిస్నీ ప్లస్ హాట్ స్టార్
చాలా కాలం గ్యాప్ తర్వాత మెగా డాటర్ నిహారిక కొణిదెల(Niharika Konidela) నటించన వెబ్ సిరీస్ డెడ్ పిక్సెల్స్(Dead pixels). హాలీవుడ్ సిరీస్ అదే పేరుతో తెలుగులో రీమేక్ చేసిన ఈ బీబీసీ టీవీ షో శుక్రవారం నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. వైవా హర్ష, అక్షయ్ లగుసాని, సాయి రోణక్ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ వెబ్ సిరీస్‌ను ఆదిత్య మందల దర్శకత్వం వహించగా.. అక్షయ్ పుల్ల తెలుగు నేటివిటికీ తగినట్లుగా అడాప్షన్ తీసుకుని రాశారు. మరి ఈ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
కథ..
గాయత్రి(నిహారిక కొణిదెల), భార్గవ్(అక్షయ్ లగుసాని) బెస్ట్ ఫ్రెండ్స్. వీరి మరో స్నేహితురాలు ఐశ్వర్య(భావన సాగి)తో కలిస ఒకే అపార్ట్మెంటులో ఉంటారు. గాయత్రి, భార్గవ్ ఫ్రెండ్స్ అయినప్పటికీ డైరెక్టుగా కంటే కూడా వీడియో గేమింగ్ ఫ్లాట్‌ఫాంలోనే మాట్లాడుకుంటూ ఉంటారు. వీరి మరో ఫ్రెండ్ ఆనంద్(వైవా హర్ష)తో కలిసి బ్యాటిల్ ఆఫ్ థ్రోన్స్ అనే వీడియో గేమ్ ఆడుతుంటారు. ఎంతలా అంటే అదో ప్యాషన్ కాదు.. పిచ్చి పట్టినట్లుగా గేమ్ కోసం పరితపిస్తుంటారు. జాబ్ చేస్తూ కూడా ఖాళీ దొరికినప్పుడల్లా గేమింగ్‌లో మునిగి తేలుతుంటారు. ఇలాంటి సమయంలోనే రోషన్(సాయి రోణక్) గాయత్రికి ఆఫీసులో పరిచయమవుతాడు. అప్పటి నుంచి వీరి జీవితంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. అవేంటి? గేమింగ్ కోసం వీరేం చేశారు? చివరకు ఏమైంది? లాంటి విషయాలు తెలియాలంటే ఈ వెబ్ సిరీస్ చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
డెడ్ పిక్సెల్స్ వెబ్ సిరీస్‌ను ఒక్క మాటలో చెప్పాలంటే గేమింగ్ తప్ప ఇందులో మరి ఇంకేమి లేదు. పూర్తిగా గేమర్స్ కోసమే ఈ సిరీస్ తీసినట్లు ఉంటుంది. హాలీవుడ్ కంటెంట్ ప్రతి ఒక్కటి ఇక్కడ వర్కౌట్ అవుతుందా? అంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే మన నేటివిటికి కొన్ని సెట్ కావు అనడానికి ఈ సిరీస్ ఉదాహరణగా నిలుస్తుంది. ప్రతి ఒక్క సిరీస్ లేదా సినిమాకు కొంతమంది టార్గెట్ ఆడియెన్స్ ఉంటారు. ఇది పూర్తిగా వీడియో గేమర్స్ కోసం తీసిన సిరీస్. ఈ షో రెండో ఎపిసోడ్‌లోనే గేమ్ అంటే తనకు ఎంతో ఫ్యాషనో ఓ యువతితో నిహారిక వివరిస్తుంది. గేమర్ అని రాసి ఉన్న టీషర్టును ఓ యువతి ధరించడం చూసిన నిహారిక.. బకెట్‌లో షిట్ అంటూ ఓ దారుణమైన ఉదాహరణ ఇస్తుంది. వీడియో గేమర్స్ అంటే ఎంతో ఫ్యాషనేట్‌గా ఉంటారని ఆమె చెప్పిన ఈ ఒక్క డైలాగ్ వింటే మనకు ఆశ్చర్యమేస్తుంది.
ఇక మధ్యలో కాసేపు అక్షయ్, నిహారిక, సాయి రోణక్ మధ్య ట్రై యాంగిల్ లవ్ స్టోరీ అంత ఆసక్తికరంగా ఉండదు. బెడ్ పై రోషన్.. మైండ్ లో భార్గవ్ ఉన్నాడంటూ నిహారిక చెప్పిన లాజిక్ అంతు చిక్కదు. ఈ లవ్ స్టోరీని డైరెక్టర్ కాస్తంత కన్ఫ్యూజన్ గా చెప్పాడనిపిస్తుంది. హాలీవుడ్ సంగతేమే కానీ.. మనవాళ్లకు పెద్దగా ఇలాంటి రిలేషన్స్ మన వాళ్లకు పెద్దగా రుచించవనే చెప్పాలి. చివర్లో కూడా నిహారిక వెంటనే డెసిషన్ తీసుకుని ఒకరినే ఎంచుకోవడం విచిత్రంగా అనిపిస్తుంది.
ఆరంభం నుంచి ఈ సిరీస్ చప్పగా సాగుతుంది. అర్బన్ సొసైటీలో వీడియో గేమ్ పిచ్చొళ్లు ఎలా ఉంటారు? ఎలా గేమ్‌కు అడిక్ట్ అవుతారు? అనేది ఓ సందేశాత్మకంగా చెప్పినా బాగుండేది. కానీ అదేదో వారు గొప్ప పని చేస్తున్నారనే ఫీలింగ్ తీసుకొస్తారు. మధ్య మధ్యలో ఫన్నీ సంభాషణలు, కామెడీ సన్నివేశాలు ఉన్నప్పటికీ.. అంతా గేమే అన్నట్లు ఉండే ఈ సిరీస్ పెద్దగా ఆసక్తికరంగా ఉండదు. వీడియో గేమ్స్ అంటే ఇంట్రెస్ట్ లేని వాళ్లకు సహనానికి పరీక్ష పెడుతుంది. గేమర్స్‌కు మాత్రం కాస్త ఇంట్రెస్ట్‌గా అనిపించవచ్చు. అయితే ట్విస్టులు, ఎమోషన్, ఎఫెక్షన్ లాంటి వాటిని ఆశించి చూస్తే మాత్రం తప్పకుండా నిరాశ చెందుతారు.
ఎవరెలా చేశారంటే..
గాయత్రి పాత్రలో నిహారిక బాగా సూటవుతుంది. ఛాలెంజింగ్ రోల్స్ సంగతేమో కానీ.. టిపికల్ అర్బన్ గర్ల్‌గా నిహారిక బాడీ లాంగ్వేజ్, నటన ఆకట్టుకుంటాయని మరో సారి తేలింది. ఈ సిరీస్‌లో ఆమె పర్ఫార్మెన్స్ బాగుంది. అక్షయ్ లగుసాని వీడియో గేమ్స్‌కు అడిక్ట్ అయ్యే యువకుడు భార్గవ్ పాత్రలో బాగా చేశాడు. కొన్నిసార్లు కొంచెం అతిగా చేశాడని అనిపించినా.. గాయత్రితో లవ్, రోషన్ అంటే జెలసీ లాంటి సీన్లలో అదరగొట్టాడు. చూడటానికి అందంగా ఉండి కాస్త డంబ్‌గా(బుర్ర తక్కువ) కనిపించే రోషన్ పాత్రలో సాయి రోణక్ ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా డంబ్ క్యారెక్టర్‌లో అతడి పర్ఫార్మెన్స్‌కు మంచి మార్కులు పడతాయి. వైవా హర్షకు కొన్ని కామెడీ డైలాగ్స్ ఉన్నప్పటికీ.. అతడి నుంచి మరింత హాస్యాన్ని ఆశిస్తాం. ఈ విషయంలో అతడికి పెద్దగా స్కోప్ రాలేదు. ఐశ్వర్య పాత్రలో భావనా సాగి ఫర్వాలేదనిపించింది.
సాంకేతిక వర్గం..
ఈ సిరీస్‌ను ఎక్కువగా అపార్ట్మెంట్, ఆఫీసు గదుల్లోనే తీశారు కాబట్టి పెద్దగా ఖర్చు కాలేదని తెలుస్తోంది. ఉన్నంతలో నిర్మాణ విలువలు ఫర్వాలేదనిపిస్తాయి. సినిమాటోగ్రాఫర్ గురించి చెప్పడానికి ఏం లేదు. పెద్దగా కెమెరాకు పని చెప్పడానికి స్కోప్ ఇవ్వలేదు. ఇందులో పాటలు లేవు కాబట్టి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చిన సిద్ధార్థకు ఓ మోస్తరు మార్కులు పడతాయి. హాలీవుడ్ నుంచి తెలుగు అడాప్షన్ తీసుకున్న రైటర్ అక్షయ్ పుల్ల ఈ కథను తెలుగు నెటివిటికీ మార్చడంలో విఫలమయ్యాడనే చెప్పాలి. డైరెక్టర్ ఆదిత్య మందల తన మార్కు చూపించలేదు.
చివరగా.. డెడ్ పిక్సెల్.. గేమింగ్ తప్ప ఇంకేమి లేదు
రేటింగ్.. 2.25/5
సంబంధిత కథనం