Naveen Polishetty Movie Update: జాతిరత్నాలు హీరో న్యూ ఇయర్ వీడియో.. సినిమా అప్డేట్‌పై నవీన్ హింట్
Naveen Polishetty Movie Update: నూతన సంవత్సరం సందర్భంగా నవీన్ పోలిశెట్టి అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు. తన తదుపరి చిత్రాలకు సంబంధించిన అప్డేట్ కోసం అద్భుతమైన వీడియోతో ముందుకొచ్చారు.
Naveen Polishetty Movie Update: టాలీవుడ్ హీరో నవీన్ పోలిశెట్టి గతేడాది జాతి రత్నాలు చిత్రంతో సూపర్ సక్సెస్ అందుకున్నాడు. ఈ సినిమా విడుదలై ఏడాదిన్నర కావస్తున్నా.. అతడి తదుపరి చిత్రం గురించి అప్డేట్ మాత్రం రావట్లేదు. ప్రస్తుతం అతడు రెండు సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. జాతిరత్నాలు లాంటి హిట్ తర్వాత సినిమా చేయడంతో అభిమానుల్లో అంచనాలు భారీగా పెరిగాయి. దీంతో క్వాలిటీ పరంగా ఆచితూచి కథలను ఎంచుకుంటున్నాడు. ఇదిలా ఉంటే తన తదుపరి చిత్రాల అప్డేట్‌కు సంబంధించి అదిరే వీడియోను షేర్ చేశాడు నవీన్.
ఈ వీడియోలో నవీన్‌ను కలిసిన ప్రతి ఒక్కరూ అతడి తదుపరి సినిమాల అప్డేట్ గురించి అడుగుతుంటారు. ఇందుకు నవీన్ కూడా తనదైన కామెడీ టైమింగ్‌తో వారి నుంచి తప్పించుకుని తిరుగుతుంటాడు. ఇలా విభిన్న వ్యక్తులు అతడిని అప్డేట్ గురించి అడగడం, వారికి తనదైన కామెడీతో సమాధానమిస్తూ నవీన్ తప్పించుకోవడం ఆసక్తిని కలిగిస్తుంది. నవీన్ తన మార్కు కామెడీతో అలరించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది.
వీడియో చివర్లో నవీన్ తన ఫ్యాన్స్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపుతాడు. అంతేకాకుండా తన చేస్తున్న సినిమాల షూటింగులు దాదాపు పూర్తయ్యాయని, 2023లో విడుదలయ్యేందుకు సిద్ధమవుతున్నాయని హింట్ ఇచ్చాడు. టాలీవుడ్‌లో ఉన్న హీరోల్లో తనదైన నటనతో ఆకట్టుకున్న హీరోల్లో నవీన్ ఒకడు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, జాతిరత్నాలు లాంటి వరుస హిట్లతో సూపర్ హిట్లు అందుకున్నాడు.
నవీన్.. అనుష్క శెట్టితో కలిసి ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి మహేష్ దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ-ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. వచ్చే ఏడాది విడుదలయ్యే అవకాశముంది. ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు, విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు మేకర్స్. ఇది కాకుండా అనగనగా ఓ రాజు అనే సినిమా కూడా చేస్తున్నాడు.
టాపిక్