Mumbaikar Movie Review: ముంబైకర్ మూవీ రివ్యూ - విజయ్ సేతుపతి బాలీవుడ్ డెబ్యూ మూవీ ఎలా ఉందంటే?
Mumbaikar Movie Review: విజయ్ సేతుపతి బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తూ నటించిన మూవీ ముంబైకర్ ఇటీవల జియో సినిమా ఓటీటీలో రిలీజైంది. సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ఎలా ఉందంటే...
Mumbaikar Movie Review: కోలీవుడ్ అగ్ర హీరో విజయ్ సేతుపతి (Vijay Sethupathi) ముంబైకర్ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్(Santosh Sivan) దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ఇటీవల జియో సినిమా (Jio Cinema Ott) ద్వారా డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజైంది. విక్రాంత్ మస్సే, తాన్య, హ్రిదూ హరున్ ప్రధాన పాత్రల్లో నటించారు. కోలీవుడ్ అగ్ర దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఫస్ట్ మూవీ మా నగరం ఆధారంగా రూపొందిన ఈ మూవీ ఎలా ఉంది? ఫస్ట్ సినిమాతోనే విజయ్ సేతుపతి బాలీవుడ్ ప్రేక్షకుల్ని మెప్పించాడా? లేదా? అన్నది తెలియాలంటే కథలోని వెళ్లాల్సిందే...
ఐదుగురి జీవితాలు...
మున్ను అలియాస్ డాన్ (విజయ్ సేతుపతి) గ్యాంగ్‌స్టర్ కావాలని కలలుకంటాడు. ఓ కిడ్నాప్ గ్రూప్‌లో జాయిన్ అవుతాడు. వారందరూ కలిసి స్కూల్ పిల్లాడిని కిడ్నాప్ చేసి డీల్ కుదుర్చుకుంటారు. మున్ను కన్ఫ్యూజన్ కారణంగా తాము కిడ్నాప్ చేయాల్సిన పిల్లాడి బదులు ముంబైని శాసిస్తోన్న బడా రౌడీ పీకేపీ (రణ్‌వీర్ షోరే) కొడుకును ఎత్తుకొస్తారు.
విక్రాంత్ (విక్రాంత్ మస్సే) చదువు పూర్తయినా ఏ ఉద్యోగం చేయకుంగా బలాదూర్‌గా తిరుగుతుంటాడు. కోపం ఎక్కువ. ఓ బీపీఓ కంపెనీలో పనిచేస్తోన్న కాలేజీ ఫ్రెండ్ ఇషితను (తాన్య) ప్రాణంగా ప్రేమిస్తాడు. విక్రాంత్ బాధ్యతారాహిత్యంగా ఉండటం ఇషితకు నచ్చదు. అందుకే అతడిని దూరం పెడుతుంది. ఓ రౌడీ కారణంగా ఇషిత ప్రాణాలు ప్రమాదంలో పడటంతో ఆమెను సేవ్ చేయబోయి విక్రాంత్ పోలీసుల చేతికి చిక్కుతాడు.
ఆదిల్ (హిద్రూ హరున్) ఉద్యోగం కోసం ముంబయి వస్తాడు. ఇషిత బీపీఓ కంపెనీలో జాబ్‌కు సెలెక్ట్ అవుతాడు. కానీ అతడి సర్టిఫికెట్స్‌ను రౌడీలు ఎత్తికెళ్లిపోతారు. ఆ సర్టిఫికేట్స్ దొరికితేనే అతడి ఉద్యోగం పోకుండా ఉంటుంది. విక్రాంత్ కారణంగా ఆదిల్ పోలీస్ స్టేషన్ వెళ్లాల్సివస్తుంది.
ముంబయిలో తనకు అన్ని రూట్స్ తెలుసునని అబద్దం ఆడిన ఓ టాక్సీ డ్రైవర్ (సంజయ్ మిశ్రా) ఇషిత కంపెనీలోనే చేరుతాడు. ఏ సంబంధం లేని ఈ ఐదుగురి జీవితాలు ఒక్కరోజు రాత్రిలో ఎలాంటి మలుపులు తిరిగాయి? పీకేపీ బారి నుంచి డాన్ తప్పించుకున్నాడా? విక్రాంత్ ప్రేమను ఇషితా గుర్తించిందా? ఆదిల్ సర్టిఫికెట్స్ దొరికాయా? టాక్సీ డ్రైవర్ ప్రాణాపాయంలో చిక్కుకోవడానికి కారణం ఏమిటి? అన్నదే ముంబైకర్(Mumbaikar Movie Review) కథ.
మా నగరం రీమేక్...
తమిళంలో రూపొందిన మా నగరం సినిమాకు రీమేక్‌గా ముంబైకర్ సినిమాను దర్శకుడు సంతోష్ శివన్ తెరకెక్కించారు. తమిళంలో ఈ సినిమాకు లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించాడు. మల్టీలీనియర్ స్క్రీన్‌ప్లేతో తెరకెక్కిన ఈ సినిమాకు కోలీవుడ్‌లో విమర్శకుల ప్రశంసల్ని అందుకున్నది. మా నగరం కథను మక్కికి మక్కీగా ఎలాంటి మార్పులు చేయకుండా సీన్ టూ సీన్ సంతోశ్ శివన్ హిందీలో రీమేక్ చేశారు. తమిళ మూవీలో ఓ రియలిస్టిక్ ఫీల్ ఉంటుంది. ఆ ఒరిజినాలిటీ హిందీలో మిస్సయ్యింది.
క్లైమాక్స్ బాగుంది...
ఒకరికొకరు ఏ మాత్రం సంబంధం లేని వ్యక్తుల జీవితాల్ని లింక్ చేస్తూ ఎండింగ్ వరకు ఎంగేజింగ్‌గా ఈ సినిమాను నడిపించే ప్రయత్నం చేశారు దర్శకుడు సంతోశ్ శివన్. విక్రాంత్, ఇషితా లవ్ ట్రాక్‌లోకి ప్రమేయం లేకుండా ఆదిల్ ఎంట్రీ ఇచ్చే సీన్స్ తమిళంలో థ్రిల్లింగ్‌గా సాగుతాయి. ఆ ఎగ్జైట్‌మెంట్, ఎమోషన్స్ హిందీలో(Mumbaikar Movie Review) సరిగా వర్కవుట్ కాలేదు.
తన సర్టిఫికెట్స్ తాను ప్రయాణిస్తోన్న టాక్సీ డ్రైవర్‌కే దొరకడం, అతడి ప్రాణాల్ని కాపాడటానికే రౌడీలతో ఆదిల్ పోరాడే సీన్స్ మాత్రం ఇంట్రెస్టింగ్‌ను కలిగిస్తాయి. డాన్ కిడ్నాప్ చేసిన పిల్లాడి ప్రాణాలను కాపాటానికి విక్రాంత్ తన స్వంత బాబాయ్‌తోనే ఎలా ఫైట్ చేయాల్సివచ్చిందన్నది కూడా ఆకట్టుకుంటుంది. డాన్ ప్రాణాలను తీయాలని అనుకున్న పీకీపీ అతడి క్షమించే సీన్‌ను సినిమాను ఎండ్ చేయడం మెప్పిస్తుంది.
ఇంపార్టెన్స్ లేని క్యారెక్టర్...
ముంబైకర్ సినిమాతోనే విజయ్ సేతుపతి బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. కానీ అతడి నటనా ప్రతిభకు తగ్గ క్యారెక్టర్ మాత్రం కాదిది. తమిళంలో ఓ కమెడియన్ చేసిన పాత్రను విజయ్‌తోచేయించారు. ఎలాంటి ఇంపార్టెన్స్ లేని ఈ క్యారెక్టర్‌ను విజయ్ సేతుపతి కూడా మొక్కుబడిగా చేసిన ఫీలింగ్ కలుగుతుంది.
కమెడియన్ కంటే ఎక్కువ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కంటే తక్కువ అన్న చందంగా సాగుతుంది. విక్రాంత్ మస్సే, హ్రిదూ హరున్, తాన్యా యాక్టింగ్ ఒకే. సంజయ్ మిశ్రా, రణ్‌వీర్ షోరే, సచిన్ ఖేడ్కర్ పాత్రలు చిన్నవే అయినా తమ అనుభవంతో వాటికి న్యాయం చేయడానికి ప్రయత్నించారు.
విజువల్స్ హైలైట్…
దర్శకుడిగా ఆకట్టుకోలేకపోయినా సినిమాటోగ్రాఫర్‌గా సంతోష్ శివన్ మెప్పించారు. ఆయన విజువల్స్ బాగున్నాయి. తమిళ సినిమా మా నగరంలో చిన్న చిన్న లోపాలు ఉన్నాయి. లోకేష్ కనకరాజ్‌కు అదే మొదటి సినిమా కావడం బడ్జెట్ పరిమితుల కారణంగా కాంప్రమైజ్ అయ్యాడు. ఆ లోపాలను సరిచేసే అవకాశం రీమేక్‌లో ఉన్నా సంతోష్ శివన్ ఆ దిశగా దృష్టిపెట్టలేదు. విజయ్ సేతుపతి లాంటి నటుడిని సరిగా వినియోగించుకోలేదు.
Mumbaikar Movie Review -తమిళ సినిమా చూస్తే…
తమిళ సినిమా మా నగరం చూసిన ఆడియెన్స్‌ను ముంబైకర్ ఏ మాత్రం మెప్పించదు. విజయ్ సేతుపతి యాక్టింగ్ కోసం చూడాలని అనుకున్నా కూడా ఆ విషయంలోనూ నిరాశే మిగులుతుంది. నేటివిటీ ఇష్యూస్ కారణంగా ముంబైకర్ ఓటీటీ ఆడియెన్స్‌ను ఇంప్రెస్ చేయడం కష్టమనే చెప్పవచ్చు.