Martin Luther King Teaser: సంపూర్ణేశ్ బాబు ‘మార్టిన్ లూథర్ కింగ్’ టీజర్ వచ్చేసింది.. రాజకీయాలపై సెటైరికల్ కామెడీ
Martin Luther King Teaser: మార్టిన్ లూథర్ కింగ్ సినిమా ట్రైలర్ వచ్చేసింది. సంపూర్ణేశ్ బాబు ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించారు.
Martin Luther King Teaser: బర్నింగ్ స్టార్ సంపూర్ణేశ్ బాబు ప్రధాన పాత్రలో ‘మార్టిన్ లూథర్ కింగ్’ సినిమా రూపొందుతోంది. రాజకీయాలపై సెటైరికల్ కామెడీ మూవీగా ఈ చిత్రం ఉండనుంది. తమిళ సూపర్ హిట్ మూవీ మండేలాకు రీమేక్‍గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. మండేలా సినిమాలో యోగిబాబు పోషించిన ప్రధాన పాత్రను మార్టిన్ లూథర్ కింగ్‍లో సంపూర్ణేశ్ పోషిస్తున్నారు. ఈ చిత్రానికి పూజ కొల్లూరు దర్శకత్వం వహించారు. యువ డైరెక్టర్ వెంకటేశ్ మహా స్క్రీన్‍ప్లే, డైలాగ్‍లు అందింటంతో పాటు కీలకపాత్ర పోషించారు. అక్టోబర్ 27న ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది. కాగా, నేడు (అక్టోబర్ 2) ‘మార్టిన్ లూథర్ కింగ్’ టీజర్ రిలీజ్ అయింది.
ఓ గ్రామంలో దక్షిణం, ఉత్తరం వారంటూ అంటూ రెండు వర్గాలు వాదించుకుంటుండటంతో ‘మార్టిన్ లూథర్ కింగ్’ టీజర్ మొదలైంది. ఇందుకు సంబంధించి హరికథ ఉంది. ఆ తర్వాత నరేశ్ (ఉత్తరం), వెంకటేశ్ మహా (దక్షిణం).. గ్రామ ప్రెసిడెంట్ అయ్యేందుకు పోటీ పడతారు. ప్రతీదానికి ఉత్తరం, దక్షిణం అంటూ నాయకులు, ప్రజలు గొడవ పడుతుంటారు. ఇలా గొడవలు కూడా కామెడీగా ఉంటాయి. ఎన్నికల్లో నరేశ్, వెంకటేశ్ మహా పోటీ చేస్తారు. కులాల ప్రస్తావన తెచ్చి కూడా ఓట్లు అడుగుతారు. అయితే, ఓటరు జాబితాను లెక్కిస్తే.. నరేశ్, వెంకటేశ్ మహాకు సమానమైన ఓట్లు వచ్చేలా కనిపిస్తాయి. దీంతో గ్రామంలో సంపూర్ణేశ్ బాబు ఎవరికి ఓటేస్తే వారే గెలిచే అవకాశం ఉంటుంది. దీంతో అప్పటి వరకు గ్రామంలో ఎవరూ పట్టించుకోని.. కనీసం పేరు కూడా పెట్టని సంపూర్ణేశ్ బాబు చుట్టూ నరేశ్, వెంకటేశ్ మహాతో పాటు గ్రామస్తులు తిరుగుతారు. ఆ ఒక్క ఓటు కోసం సంపూర్ణేశ్ బాబుకు చాలా బహుమతులు ఇస్తారు. కింగ్.. కింగ్.. అని పిలుస్తుంటారు. ఆలోచిస్తానంటూ సంపూ తిరుగుతుంటారు. ఇలా టీజర్ ఆసక్తికరంగా సాగింది.
సినిమాలో పేరు కూడా లేని సంపూకు మార్టిన్ లూథర్ కింగ్ అని హీరోయిన్ శరణ్య ప్రదీప్ పేరు పెడతారు. ఈ మార్టిన్ లూథర్ కింగ్ ఎవరికి ఓటు వేస్తాడు.. ఓటు వేశాక అతడి పరిస్థితి ఏంటి అనేదే ఈ మూవీ కథగా ఉంది. ఓట్ల కోసం కొందరు రాజకీయ నాయకులు ఎలా ప్రలోభపెడతారు.. ఎన్నికలు అయిపోయాక ఎలా ప్రవర్తిస్తారన్న విషయాలపై సెటైరికల్ కామెడీ డ్రామాగా మార్టిన్ లూథర్ కింగ్ మూవీ ఉండనుంది.
మార్టిన్ లూథర్ కింగ్ చిత్రానికి డైలాగ్స్, స్క్రీన్‍ప్లే అందించి క్రియేటివ్ ప్రొడ్యూజర్‌గా కూడా వెంకటేశ్ మహా వ్యవహరించారు. శశికాంత్, చక్రవర్తి రామచంద్ర సంయుక్తంగా ఈ మూవీని నిర్మించారు. స్మరణ్ సాయి సంగీతం అందించారు.