Lootere Web series: ఓటీటీలోకి వచ్చేసిన మరో థ్రిల్లర్ వెబ్ సిరీస్.. రెండు ఎపిసోడ్లతోనే..
Lootere Web series: ఓటీటీలోకి శుక్రవారం (మార్చి 22) మరో థ్రిల్లర్ వెబ్ సిరీస్ వచ్చింది. షిప్ హైజాక్ నేపథ్యంలో సాగే ఈ సిరీస్ ట్రైలర్ తోనే ఆకట్టుకోగా.. ఇప్పుడు రెండు ఎపిసోడ్లను రిలీజ్ చేశారు.
Lootere Web series: ఓటీటీలోకి మరో థ్రిల్లర్ వెబ్ సిరీస్ వచ్చింది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో వచ్చిన లూటేరే అనే ఈ సిరీస్ తొలి రెండు ఎపిసోడ్లను మాత్రం శుక్రవారం (మార్చి 22) రిలీజ్ చేశారు. షిప్ హైజాక్ నేపథ్యంలో ఈ సిరీస్ సాగింది. సోమాలియా సముద్రపు దొంగల చుట్టూ తిరిగే ఈ సిరీస్ ట్రైలర్ తోనే ఆసక్తి రేపగా.. ఊహించినట్లే తొలి రెండు ఎపిసోడ్లు సాగాయి.
లూటేరే వెబ్ సిరీస్
లూటేరే వెబ్ సిరీస్ నిజానికి రెండేళ్ల కిందటే ప్రారంభమైంది. సెప్టెంబర్, 2022లోనే ఈ సిరీస్ టీజర్ రిలీజ్ చేశారు. అయితే షూటింగ్ పూర్తవడానికి మాత్రం చాలా సమయం పట్టింది. ఈ మధ్యే ట్రైలర్ ద్వారా సిరీస్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. మొత్తానికి శుక్రవారం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే కేవలం తొలి రెండు ఎపిసోడ్లనే రిలీజ్ చేశారు.
ఈ లూటేరే వెబ్ సిరీస్ ను ప్రముఖ డైరెక్టర్ హన్సల్ మెహతా క్రియేట్ చేయగా.. అతని తనయుడు జై మెహతా డైరెక్ట్ చేశాడు. సోమాలియా పైరేట్స్ ఓ షిప్ ను హైజాక్ చేయడం, దానిని విడిపించడానికి జరిగే ప్రయత్నాలు చుట్టూ ఈ సిరీస్ సాగుతుంది. ఈ సిరీస్ లో రజత్ కపూర్, వివేక్ గోంబర్, అమృతా ఖన్విల్కర్, ప్రీతికా చావ్లా, చందన్ రాయ్ సన్యాల్ నటించారు.
లూటేరే తొలి రెండు ఎపిసోడ్లలో ఏం జరిగిందంటే..
లూటేరే వెబ్ సిరీస్ కొన్ని నిజ జీవిత ఘటనల ఆధారంగానే రూపొందించారు. సముద్రం నడిబొడ్డున సోమాలియా పైరేట్స్ అకృత్యాలు ఏ స్థాయిలో ఉంటాయో చూపించే ప్రయత్నం ఈ సిరీస్ ద్వారా చేశారు. నిజానికి 1993లో ఇదే లూటేరే పేరుతో బాలీవుడ్ లో ఓ సినిమా వచ్చింది. అయితే దానికి, ఈ సిరీస్ కు ఎలాంటి సంబంధం లేదు.
ఉక్రెయిన్ నుంచి సోమాలియాకు కొన్ని విలువైన సరుకులతో ఓ ఓడ బయలుదేరుతుంది. సోమాలియాలో స్థిరపడిన ఓ భారత సంతతికి చెందిన బడా వ్యాపారవేత్తకు చెందిన సరుకులు అందులో ఉంటాయి. అయితే ఆ సరుకులు ఏంటన్నది మాత్రం తొలి రెండు ఎపిసోడ్లలో ఎక్కడా చూపించలేదు. సోమాలియా రాజధాని మగదిషు పోర్ట్ అధ్యక్షుడు కావడంతో అతడు చట్ట విరుద్ధమైన సరుకులను కూడా యథేచ్ఛగా దేశంలోకి తీసుకొస్తుంటాడు.
ఆ విషయం తెలిసి పోర్ట్ లోని మిగతా సభ్యులు అలాంటి సరుకులతో వస్తున్న ఆ ఓడను అడ్డుకోవడానికి ప్లాన్ చేస్తారు. అయితే ఆ లోపే ఆ ఓడ అక్కడికి రాకుండా చేయడానికి సదరు వ్యాపారవేత్త ప్లాన్ చేస్తాడు. ఇందులో భాగంగా తన స్నేహితుడికి ఆ పని అప్పగించగా.. అతడు సోమాలియా పైరేట్స్ తో ఓడను హైజాక్ చేయిస్తాడు. ఆ హైజాక్ ఎలా జరిగింది? తర్వాత ఓడలో ఎలాంటి విషాదకర ఘటనలు జరిగాయన్నది ఈ రెండు ఎపిసోడ్లలో చూడొచ్చు.
హైజాకర్ల నుంచి తమను తాము రక్షించుకోవడానికి నౌకలోని సిబ్బంది ప్రయత్నించడం, ఆ ప్రయత్నంలో తమ సహచరుడిని కోల్పోవడం వంటి వాటితో రెండో ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. ఈ సిరీస్ లో మూడో ఎపిసోడ్ వచ్చే గురువారం (మార్చి 28) హాట్‌స్టార్ లోకి రానుంది. అయితే తొలి రెండు ఎపిసోడ్లు సాగిన తీరు చూస్తే.. మిగిలినవి కూడా ఎంతో ఉత్కంఠ రేపబోతున్నట్లు స్పష్టమవుతోంది.
టాపిక్