Lokesh Kanagaraj Aamir Khan Movie: అదిరిపోయే కాంబినేషన్.. లోకేష్ కనగరాజ్‌తో ఆమిర్ ఖాన్ మూవీ!
Lokesh Kanagaraj Aamir Khan Movie: లోకేష్ కనగరాజ్, ఆమిర్ ఖాన్ కలిసి ఓ సినిమా చేయబోతున్నట్లు వస్తున్న వార్తలు ఆసక్తి రేపుతున్నాయి. ఈ మధ్య టాప్ బాలీవుడ్ హీరోలు సౌత్ డైరెక్టర్లతో కలిసి సినిమాలు చేస్తున్న క్రమంలో ఓ మంచి హిట్ కోసం చూస్తున్న ఆమిర్ ఖాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Lokesh Kanagaraj Aamir Khan Movie: పాన్ ఇండియా స్థాయిలో మరో అదిరిపోయే కాంబినేషన్ తెరపైకి వస్తోంది. మరోసారి ఓ బాలీవుడ్ టాప్ హీరో.. సౌత్ ఇండియాకు చెందిన డైరెక్టర్ నే నమ్ముకొని భారీ హిట్ కొట్టాలని ఆశ పడుతున్నాడు. ఆ హీరో పేరు ఆమిర్ ఖాన్ కాగా.. ఆ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. ఈ ఇద్దరి కాంబినేషన్ పాన్ ఇండియా స్థాయిలో మ్యాజిక్ చేస్తుందని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు.
లోకేష్, ఆమిర్ మూవీ
బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ వరుసగా థగ్స్ ఆఫ్ హిందుస్థాన్, లాల్ సింగ్ చద్దా సినిమాల వైఫల్యాలతో డిఫెన్స్ లో పడిపోయాడు. ఈ నేపథ్యంలో షారుక్, సల్మాన్ లాంటి టాప్ హీరోల బాటలోనే వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తమిళ డైరెక్టర్ అట్లీతో కలిసి షారుక్ ఖాన్ జవాన్ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. ఇక మురగదాస్ తో సల్మాన్ ఖాన్ ఇప్పుడు సికందర్ మూవీ చేస్తున్నాడు.
ఈ నేపథ్యంలో ఆమిర్ కూడా తన నెక్ట్స్ మూవీ కోసం మరో తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తో చేతులు కలపాలన్న ఆలోచనలో ఉన్నట్లు ఆకాశవాణి అనే ఓ తెలుగు పోర్టల్ తన అధికారిక ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. ఈ ప్రాజెక్ట్ కన్ఫమ్ అయినట్లు తమకు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిందని కూడా ఆ పోర్టల్ చెప్పడం విశేషం.
క్రేజీ కాంబినేషన్
ఈ క్రేజీ కాంబినేషన్ గురించి సదరు పోర్టల్ ఏం చెప్పిదంటే.. "బిగ్ బ్రేకింగ్.. ఓ మైండ్ బ్లోయింగ్ కాంబో. ఆమిర్ ఖాన్, లోకేష్ కనగరాజ్, మైత్రీ మూవీస్ ఓ పాన్ ఇండియా మూవీని త్వరలోనే ప్లాన్ చేస్తున్నారు. అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా ఈ ప్రాజెక్ట్ కన్ఫమ్ అని తెలిసింది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే త్వరలోనే మనకు అధికారిక ప్రకటన వస్తుంది" అని వెల్లడించింది.
అంతకు ఓ గంట ముందు మరో ట్వీట్ చేసింది. జవాన్ తో షారుక్ ఖాన్, సికందర్ తో సల్మాన్.. ఇప్పుడు మరో సౌత్ ఇండియా స్టార్ డైరెక్టర్ తో ఆమిర్ కలవబోతున్నాడా? త్వరలోనే ఓ పెద్ద బ్రేకింగ్ న్యూస్ అనే ట్వీట్ తో ఆసక్తి రేపిన సదరు పోర్టల్.. కాసేపటికే ఆ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ అని చెప్పింది. అయితే దీనిపై అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలి.
ఫ్యాన్స్ రియాక్షన్ ఇదీ
లోకేష్ కనగరాజ్ విక్రమ్, లియోలాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తో ఊపు మీదున్నాడు. మరోవైపు ఆమిర్ తన చివరి రెండు సినిమాల ఫ్లాపులతో ఢీలా పడ్డాడు. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరూ చేతులు కలపబోతున్నారన్న వార్తలపై ఫ్యాన్స్ స్పందించారు. అట్లీతో షారుక్, సందీప్ వంగాతో రణ్‌బీర్.. ఇప్పుడు లోకేష్ తో ఆమిర్ అంటూ ఓ అభిమాని కామెంట్ చేశారు. కమ్‌బ్యాక్ లోడింగ్ అని మరో అభిమాని అన్నారు.
ఆమిర్ ఖాన్ చివరిసారిగా 2022లో లాల్ సింగ్ చద్దా మూవీలో కనిపించాడు. కానీ ఆ సినిమా దారుణంగా ఫ్లాపయింది. ఇప్పుడతడు సితారే జమీన్ పర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.