Kajal Satyabhama Release Date: కాజల్ సత్యభామ రిలీజ్ వాయిదా.. ఆ రోజు నుంచి వరుసగా తప్పుకుంటున్న సినిమాలు
Kajal Satyabhama Release Date: కాజల్ నటిస్తున్న సత్యభామ మూవీ రిలీజ్ వాయిదా పడింది. తాజాగా మేకర్స్ కొత్త రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. మే 31వ తేదీ నుంచి వరుసగా అన్ని సినిమాలు తప్పుకుంటున్నాయి.
Kajal Satyabhama Release Date: సత్యభామ మూవీ కూడా ఆ రోజు రేసు నుంచి తప్పుకుంది. కాజల్ నటిస్తున్న ఈ సినిమా మే 31న రానుందని ముందుగా చెప్పినా.. తాజాగా మేకర్స్ కొత్త తేదీని అనౌన్స్ చేశారు. ఇప్పటికే ఆ రోజు రిలీజ్ కావాల్సిన సుధీర్ బాబు మూవీ హరోం హర కూడా వాయిదా పడిన విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుతం ఆ రోజు నాలుగు సినిమాలు బరిలో నిలిచాయి.
సత్యభామ కొత్త రిలీజ్ డేట్ ఇదే
టాలీవుడ్ చందమామ కాజల్ నటించిన సత్యభామ మూవీ మే 31 బదులు జూన్ 7న థియేటర్లలోకి రానుంది. ఈ విషయాన్ని మేకర్స్ గురువారం (మే 23) వెల్లడించారు. సుమన్ చిక్కాల డైరెక్ట్ చేసిన ఈ సినిమా కాజల్ కెరీర్లో 60వది కావడం విశేషం. నవీన్ చంద్ర కూడా ఇందులో నటించాడు. నిజానికి ఈ సత్యభామ రిలీజ్ డేట్ ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది.
తాజాగా మరోసారి మే 31 నుంచి వారం ఆలస్యంగా జూన్ 7కు వాయిదా వేశారు. కాజల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఈ సినిమాలో నటించింది. కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ ఓ కొత్త పోస్టర్ ను కూడా లాంచ్ చేశారు. ఇందులో కాజల్ చేతిలో గన్ పట్టుకొని గురి పెడుతూ చాలా ఇంటెన్స్ లుక్ లో కనిపించింది. మూవీ కోసం ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే ప్రమోషన్లను కూడా జోరుగా చేస్తోంది.
ఇక శుక్రవారం (మే 24) ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కూడా జరగనుంది. దీనికి బాలకృష్ణ ముఖ్య అతిథిగా రానుండటం విశేషం. క్వీన్ ఆఫ్ మాసెస్ కాజల్ కోసం గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ వస్తున్నారంటూ సత్యభామ మూవీని నిర్మించిన ఆరమ్ ఆర్ట్స్ వెల్లడించింది. బాలకృష్ణ, కాజల్‍తో కలిపి ట్రైలర్ లాంట్ ఈవెంట్‍కు పోస్టర్ ట్వీట్ చేసింది. మే 24న సత్యభామ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‍లో నందమూరి బాలకృష్ణ గర్జన చూసేందుకు రెడీగా ఉండండి అంటూ రాసుకొచ్చింది.
గూఢచారి, మేజర్ చిత్రాలకు దర్శకత్వం వహించిన శశి కిరణ్ తిక్కా ఈ చిత్రానికి స్క్రీన్‍ప్లే అందించాడు. సత్యభామ సినిమాలో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కాజల్ నటించింది.
మే 31 నుంచి తప్పుకుంటున్న సినిమాలు
నిజానికి మే 31వ తేదీన మొదట ఆరు సినిమాలు రానున్నాయని భావించారు. విశ్వక్సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సహా మరో ఐదు సినిమాలు వస్తున్నాయని ముందుగానే ఆయా సినిమాల మేకర్స్ అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు మాత్రం ఒక్కో సినిమా ఆ తేదీ నుంచి తప్పుకుంటోంది. ఇప్పటికే సుధీర్ బాబు నటించిన హరోం హర మూవీ మే 31 నుంచి జూన్ 14కు వాయిదా పడింది.
ఇక ఇప్పుడు సత్యభామ కూడా జూన్ 7కు వెళ్లింది. దీంతో మే 31వ తేదీన రిలీజ్ కాబోయే పెద్ద సినిమాగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నిలవనుంది. ఈ మూవీతోపాటు ఆ రోజు కార్తికేయ భజే వాయు వేగం, చాందినీ చౌదరి మ్యూజిక్ షాప్ మూర్తి, ఆనంద్ దేవరకొండ గం గం గణేశా సినిమాలు ఉన్నాయి.