Jawan Review: జవాన్ రివ్యూ - షారుఖ్‌ఖాన్, అట్లీ కాంబో మూవీ ఎలా ఉందంటే?
Jawan Review: షారుఖ్‌ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వంలో రూపొందిన జవాన్ మూవీ ఈ గురువారం (సెప్టెంబర్ 7న) థియేటర్లలో రిలీజైంది. నయనతార హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా ఎలా ఉందంటే?
Jawan Review: పఠాన్ సక్సెస్ తర్వాత షారుఖ్‌ఖాన్ (Shahrukh Khan) హీరోగా నటించిన జవాన్ దేశవ్యాప్తంగా భారీ అంచనాలతో గురువారం (సెప్టెంబర్ 7న) థియేటర్లలో రిలీజైంది. నయనతార (Nayanthara) హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో దీపికా పడుకోణ్(Deepika Padukone), సంజయ్‌దత్ అతిథి పాత్రలు చేశారు. అట్లీ (Atlee) దర్శకత్వం వహించాడు. కోలీవుడ్ డైరెక్టర్‌ను నమ్ముకొని షారుఖ్‌ఖాన్ చేసిన ఈ సినిమా ఎలా ఉంది? పఠాన్ సక్సెస్‌ను జవాన్ తో షారుఖ్ ఖాన్ కంటిన్యూ చేశాడా?లేదా? అన్నది తెలియాలంటే కథలోని వెళ్లాల్సిందే…
విక్రమ్ రాథోడ్ కథ...
విక్రమ్ రాథోడ్ (షారుఖ్‌ఖాన్)తో పాటు అతడి గ్యాంగ్ మెట్రో ట్రైన్‌ను హైజాక్ చేస్తారు. అతడి చేతిలో బందీగా ఉన్న అమాయకుల్ని విడిపించే బాధ్యతను స్పెషల్ టాస్క్‌ఫోర్స్ ఆఫీసర్ నర్మద (నయనతార) చేపడుతుంది. పారిశ్రామికవేత్తలు, రాజకీయాల్ని టార్గెట్ చేస్తూ వారిని చాలా కాలంగా దోచుకుంటున్నది కూడా విక్రమ్ రాథోడ్ అనే నిజం నర్మద ఇన్వేస్టిగేషన్‌లో తేలుతుంది.
నలభై వేల కోట్లు ఇస్తే బందీలను విడుదలచేస్తానని విక్రమ్ రాథోడ్ ప్రకటిస్తాడు. ఆ డబ్బును ప్రభుత్వం కాకుండా విక్రమ్ రాథోడ్ హైజాక్ చేసిన ట్రైన్‌లోనే ఉన్న కాళీ గైక్వాడ్ (విజయ్ సేతుపతి) ఇస్తాడు? వెపన్స్ డీలర్ కాళీతో విక్రమ్ రాథోడ్‌కు ఇదివరకే శత్రుత్వం ఉందా? కాళీని విక్రమ్ రాథోడ్ ఎందుకు టార్గెట్ చేశాడు?
జైలర్‌గా పనిచేసిన ఆజాద్...విక్రమ్ రాథోడ్‌కు ఉన్న సంబంధం ఏమిటి? విక్రమ్ రాథోడ్ గతాన్ని ఎందుకు మర్చిపోయాడు? అతడి భార్య ఐశ్వర్య (దీపికా పడుకోణ్) ఏమైంది? నర్మద భర్తకు ఈ హైజాక్‌తో ఎలాంటి సంబంధం ఉంది? పారిశ్రామిక వేత్తల నుంచి తాను దోచుకుంటున్న డబ్బును విక్రమ్ రాథోడ్ ఏం చేస్తున్నాడు అన్నదే జవాన్ సినిమా కథ.
గురువు దారిలోనే...
సమాజంలో పేరుకుపోయిన అవినీతి, అక్రమాల్ని కమర్షియల్ హంగులు మేళవించి సిల్వర్ స్క్రీన్‌పై చెప్పడంలో తమిళ దర్శకులు ముందుంటారు. ఈ ఫార్మెట్‌లో సినిమాలు చేస్తూ శంకర్, మురుగదాస్ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్స్ అందుకున్నారు. శంకర్ శిష్యుడైన అట్లీ జవాన్ సినిమా కోసం తన గురువు బాటలోనే అడుగులు వేశాడు.
దేశభద్రతకు కీలకంగా నిలుస్తోన్న ఆర్మీలో అన్యాయాలు జరుగుతుంటాయని, డబ్బు కోసం నాయకులు, అధికారులు కొన్ని కంపెనీలతో ఒప్పందాలు చేసుకొని పనికిరాని ఆయుధాల్ని ఆర్మీకి సరఫరా చేస్తుండటంతో జవాన్లు ప్రాణాలను కోల్పోతున్నారనే మెసేజ్‌తో జవాన్ కథను రాసుకున్నాడు. ఈ పాయింట్‌కు రివేంజ్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ జోడించి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా జవాన్ సినిమాను తెరకెక్కించారు.
ఫస్ట్ హాఫ్ ఫన్...సెకండాఫ్ ఎమోషన్...
తీవ్ర గాయాలతో దేశ సరిహద్దుల్లో ఓ గ్రామ ప్రజలకు షారుఖ్ ఖాన్ కనిపించడం, అతడిని గ్రామస్తులు కాపాడే సీన్‌తో ఈ సినిమాను మొదలుపెట్టారు దర్శకుడు అట్లీ. గతం మర్చిపోయిన అతడిని ఆ ఊరి ప్రజలు దేవుడిగా భావించే సన్నివేశాలతో కథ నెమ్మదిగా ముందుకు సాగుతుంది.
ట్రైన్ హైజాక్ ఎపిసోడ్‌తోనే జవాన్ సినిమా వేగం అందుకుంటుంది. ఫన్, ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్ అంశాలకు ప్రాధాన్యతనిస్తూ ఫస్ట్ హాఫ్ ఎంగేజింగ్‌గా సాగుతుంది. విరామంలో వచ్చే ట్విస్ట్‌తో సెకండాఫ్‌పై క్యూరియాసిటీ కలిగించారు డైరెక్టర్. విక్రమ్ రాథోడ్, ఐశ్వర్య ఫ్లాష్‌బ్యాక్ తో సెకండాఫ్ మొదలవుతుంది. ఈ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్ మొత్త రొటీన్ డ్రామాతో సోసోగానే ఉంటాయి.
షారుఖ్ క్యారెక్టర్స్‌కు సంబంధించి ఒక్కో ట్విస్ట్‌ను రివీల్ చేస్తూ ఎంగేజింగ్‌గా స్క్రీన్‌ప్లే రాసుకున్నాడు. కాళీతో విక్రమ్ రాథోడ్ పోరాటం, అతడి అక్రమాలకు చెక్ పెట్టే యాక్షన్ ఎపిసోడ్స్ గూస్‌బంప్స్ కలిగిస్తాయి. సంజయ్ దత్ అతిథి పాత్ర కూడా ఆడియెన్స్‌ను సర్‌ప్రైజ్ చేస్తుంది.
షారుఖ్ ఇమేజ్...
షారుఖ్‌ఖాన్‌కు ఉన్న మాస్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని ఫక్తు కమర్షియల్ సినిమాగా జవాన్ సినిమాను తెరకెక్కించాడు అట్లీ. యాక్షన్ ఎపిసోడ్స్, షారుఖ్ తో పాటు మెయిన్ క్యారెక్టర్స్ రాసుకున్న తీరులో తన వైవిధ్యతను చాటుకున్నాడు. షారుఖ్‌ఖాన్, నయనతార, ప్రియమణితో పాటు ప్రతి పాత్రకు కథలో ఇంపార్టెన్స్ ఇవ్వడం బాగుంది.
వన్ మెన్ షో...
షారుఖ్‌ఖాన్ వన్ మెన్ షోగా జవాన్ సినిమా నిలిచింది. విక్రమ్ రాథోడ్‌గా, ఆజాద్‌గా డిఫరెంట్ షేడ్స్‌తో కూడిన క్యారెక్టర్‌లో చెలరేగిపోయాడు. కామెడీ టైమింగ్, యాక్షన్, ఎమోషన్స్ అన్నింటిలో తన మార్కును చూపించాడు.
యాక్షన్ ప్రధాన పాత్రలో నయనతార ఇంటెన్స్ యాక్టింగ్ తో మెప్పించింది. దీపికా పడుకోణ్, సంజయ్‌దత్ పాత్రల నిడివి తక్కువే అయినా ఆడియెన్స్‌ను సర్‌ప్రైజ్ చేస్తాయి. విలన్‌గా విజయ్ సేతుపతి లుక్ కొత్తగా ఉంది. షారుఖ్‌కు ధీటుగా నటించాడు.
యాక్షన్ లవర్స్‌కు...
షారుఖ్‌ఖాన్ అభిమానులతో పాటు యాక్షన్ లవర్స్ కు జవాన్ సినిమా విందుభోజనంలా ఉంటుంది. లాజిక్స్ పక్కనపెట్టి మంచి కమర్షియల్ సినిమా చూడాలనుకుంటే జవాన్ బెస్ట్ ఆప్షన్‌గా చెప్పవచ్చు.