Telugu Dubbing Movies: 2023లో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన టాప్ టెన్ తెలుగు డబ్బింగ్ మూవీస్ ఇవే!
Telugu Dubbbing Movies: రజనీకాంత్ జైలర్, రణ్‌బీర్‌కపూర్ యానిమల్‌తో పాటు ఈ ఏడాది పలు డబ్బింగ్ సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్నికురిపించాయి. ఈ ఏడాది తెలుగులో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన డబ్బింగ్ సినిమాలు ఏవంటే?
Telugu Dubbbing Movies: ఈ ఏడాది తెలుగులో స్ట్రెయిట్ సినిమాలకు ధీటుగా డబ్బింగ్ మూవీస్ బాక్సాఫీస్ వద్ద కోట్లు కుమ్మరించాయి. తమిళం, మలయాళంతో పాటు బాలీవుడ్ డబ్బింగ్ సినిమాలు సైతం ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లకు భారీగా లాభాలను తెచ్చిపెట్టాయి. డబ్బింగ్ సినిమాల దెబ్బకు టాలీవుడ్ స్టార్లు సైతం డీలా పడే పరిస్థితి వచ్చింది. 2023లో తెలుగులో రిలీజైన డబ్బింగ్ మూవీస్‌లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన టాప్ టెన్ సినిమాలు ఇవే…
జైలర్ టాప్….
రజనీకాంత్ జైలర్ మూవీ ఈ ఏడాది తెలుగులో విడుదలైన డబ్బింగ్ మూవీస్‌లో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టి సెన్సేషనల్ రికార్డ్ క్రియేట్ చేసింది. నెల్సన్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీ 85 కోట్ల వరకు గ్రాస్,దాదాపు యాభై కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ రాబట్టింది. తెలుగులో రిలీజైన రజనీకాంత్ ఆల్‌టైమ్ డబ్బింగ్ మూవీస్‌లో హయ్యెస్ట్ కలెక్షన్స్ దక్కించుకొన్న సినిమాగా జైలర్ నిలిచింది.
జైలర్‌కు ముందు రజనీకాంత్ నటించిన డబ్బింగ్ సినిమాలు చాలా వరకు డిజాస్టర్స్‌గా నిలిచాయి. వాటి రిజల్ట్‌తో సంబంధం లేకుండా జైలర్ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. తొలి రోజు తెలుగులో ఈ సినిమా ఏడు కోట్ల వరకు వసూళ్లను రాబట్టి బాక్సాఫీస్ వద్ద దమ్మురేపింది. జైలర్ సినిమాలో శివరాజ్‌కుమార్, మోహన్ లాల్ కీలక పాత్రలు పోషించారు.
యానిమల్ ఊచకోత
రణ్‌బీర్ కపూర్ యానిమల్ మూవీ బాక్సాఫీస్ వద్ద కుమ్మేస్తోంది. ఆరు రోజుల్లోనే తెలుగు వెర్షన్ అరవై కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టింది. రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది.
అర్జున్ రెడ్డి తో యూత్ ఆడియెన్స్‌లో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాకు యూత్‌లో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడటం, రష్మిక మందన్న ఈ సినిమాలో హీరోయిన్ కావడం కూడా తెలుగు వెర్షన్‌పై బజ్ ఏర్పడటానికి కారణమైంది. యానిమల్ తెలుగులో 80 కోట్ల వరకు వసూళ్లను రాబట్టే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి.
షారుఖ్ డబుల్ ట్రీట్...
షారుఖ్‌ఖాన్ జవాన్ తెలుగు డబ్బింగ్ వెర్షన్ టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది. అట్లీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా తెలుగులో 65 కోట్ల వరకు కలెక్షన్స్ సొంతం చేసుకున్నది. తెలుగులో డబ్ అయిన బాలీవుడ్ మూవీస్‌లో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన మూవీగా జవాన్ టాప్ ప్లేస్‌లో నిలిచింది.
జవాన్‌లో నయనతార హీరోయిన్‌గా నటించగా దీపికా పడుకోణ్ గెస్ట్‌రోల్ చేసింది. విజయ్ సేతుపతి విలన్‌గా నటించాడు. ఈ ఏడాది జనవరిలో రిలీజైన షారుఖ్‌ఖాన్ పఠాన్ కూడా పదిహేను కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టి బ్రేక్ ఈవెన్ ను సాధించింది.
విజయ్ కెరీర్‌లో హయ్యెస్ట్...
దళపతి విజయ్, లోకేష్ కనకరాజ్ కాంబోలో రూపొందిన లియో మూవీ తెలుగు వెర్షన్ 46 కోట్ల కలెక్షన్స్ రాబట్టి నిర్మాతలకు లాభాల పంటను పండించింది. లియో తెలుగు వెర్షన్‌ను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ రిలీజ్ చేసింది. విజయ్, లోకేష్ కనకరాజ్ కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ కారణంగా ఈ సినిమా తెలుగులో భారీ అంచనాలతో రిలీజైంది. ఆ అంచనాలకు తగ్గట్లుగానే భారీ ఓపెనింగ్స్‌ను రాబట్టింది.
సంక్రాంతికి రిలీజైన విజయ్ వారసుడు మూవీ కూడా ఈ ఏడాది తెలుగులో కమర్షియల్ హిట్స్‌లో ఒకటిగా నిలిచింది. వంశీపైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ 28 కోట్ల వరకు గ్రాస్‌ను పదిహేను కోట్లకుపైగా షేర్ కలెక్షన్స్ రాబట్టి నిర్మాత దిల్ రాజుకు లాభాలను మిగిల్చింది.
విజయ్ ఆంటోనీ బిచ్చగాడు 2 కూడా కమర్షియల్ హిట్స్ జాబితాలో చోటు దక్కించుకున్నది. ఆరు కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో రిలీజైన ఈ మూవీ పది కోట్ల కుపైగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమాలతో పాటు మలయాళ మూవీ 2018 తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా చక్కి వసూళ్లను సొంతం చేసుకున్నది.