Prasanth Varma: ఫేక్ ప్రొఫైళ్లతో ప్రచారం జరుగుతోంది.. కానీ: హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ-i have encountered propaganda hanuman director prasanth varma reveals ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Prasanth Varma: ఫేక్ ప్రొఫైళ్లతో ప్రచారం జరుగుతోంది.. కానీ: హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ

Prasanth Varma: ఫేక్ ప్రొఫైళ్లతో ప్రచారం జరుగుతోంది.. కానీ: హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ

Chatakonda Krishna Prakash HT Telugu
Jan 15, 2024 03:09 PM IST

HanuMan Director Prasanth Varma: సోషల్ మీడియాతో తమ సినిమాకు వ్యతిరేకంగా ఫేక్ ప్రొఫైళ్లతో ప్రచారం జరుగుతోందని హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెలిపారు. ఈ విషయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఓ ట్వీట్ చేశారు.

హనుమాన్ పోస్టర్
హనుమాన్ పోస్టర్

HanuMan Director Prasanth Varma: హనుమాన్ సినిమా సంచలనం సృష్టిస్తోంది. బడ్జెట్ పరంగా చిన్న మూవీగా జనవరి 12న థియేటర్లలోకి వచ్చి.. అంచనాలకు మించి కలెక్షన్లను రాబడుతోంది. తెలుగుతో పాటు హిందీ సహా అన్ని భాషల్లోనూ పాజిటివ్ టాక్‍తో భారీ వసూళ్లను రాబడుతోంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా ఈ మైథలాజికల్ సూపర్ హీరో మూవీ ‘హనుమాన్’ వచ్చింది. అంతటా పాజిటివ్ టాక్‍తో దూసుకెళుతోంది. అయితే, ఈ తరుణంలో హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సోషల్ మీడియాలో ఓ విషయాన్ని వెల్లడించారు. తమ టీమ్ చుట్టూ వ్యతిరేక ప్రచారం జరుగుతోందని ట్వీట్ చేశారు. ఆ వివరాలివే..

సోషల్ మీడియాలో ఫేక్ ప్రొఫైళ్లు పెరిగిపోయాయని, తమ టీమ్‍పై ప్రచారం జరుగుతోందని ప్రశాంత్ పేర్కొన్నారు. కానీ ధర్మం కోసం నిలబడే వారు ఎప్పటికీ గెలుస్తారని ఆయన ట్వీట్ చేశారు. హనుమాన్‍కు మద్దతు తెలుపుతున్న సినీజనాలకు కృతజ్ఞతలు తెలియజేశారు.

“సోషల్ మీడియాలో ఫేక్ ప్రొఫైళ్లతో పాటు మా టీమ్ చుట్టూ చాలా ప్రచారం జరుగుతోందని గుర్తించా. నిన్నటి భోగి మంటల్లో ఈ డిజిటల్ చెత్తలో కొంత వేయడం మర్చిపోయినట్టుంది. మాకు ఎనలేని మద్దతు తెలియజేస్తున్న సినీ ప్రేక్షకులకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ధర్మం కోసం నిలబడే వారు ఎప్పుడూ విజయం సాధిస్తారు. మొత్తంగా హనుమాన్ గాలిపటం ఈ సంక్రాంతికి మరింత ఎత్తుకు ఎగరనుంది. నెగెటివ్ ట్రెండ్‍ను పాతాళంలోకి తొక్కేస్తోంది” అని ప్రశాంత్ వర్మ ట్వీట్ చేశారు.

దర్శకుడు ప్రశాంత్ వర్మ, హీరో తేజ సజ్జా.. కొన్ని చెప్పని మాటలను చెప్పినట్టు సోషల్ మీడియాలో కొంత ఫేక్ ప్రచారం జరుగుతోంది. అలాగే, సింపతీ కోసం ప్రయత్నిస్తున్నారని కూడా కొందరు కామెంట్లు చేస్తున్నారు. దీని గురించే ప్రశాంత్ వర్మ ఈ ట్వీట్ చేసినట్టున్నారు.

మరోవైపు, నైజాంలో హనుమాన్‍కు థియేటర్ల కేటాయింపు అంశంపై ఇటీవలే మూవీ టీమ్ నిర్మాతల మండలికి కూడా ఫిర్యాదు చేసింది. అగ్రిమెంట్లు చేసుకున్న థియేటర్లు కూడా తమ మూవీని ప్రదర్శించడం లేదని నిర్మాత నిరంజన్ రెడ్డి, నైజాం డిస్ట్రిబ్యూటర్ మైత్రీ మూవీమేకర్స్ కంప్లైట్ చేశారు.

హనుమాన్ సినిమా అన్ని చోట్ల దుమ్మురేపుతోంది. అధిక శాతం థియేటర్లు హౌస్‍ఫుల్ అవుతున్నాయి. దీంతో స్క్రీన్‍లను కూడా పెంచాలన్న డిమాండ్ సోషల్ మీడియాలో వ్యక్తమవుతోంది.

హనుమాన్ సినిమా మూడో రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.75కోట్ల మార్కును దాటిపోయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా దూసుకుపోతోంది. హిందీలోనూ తొలి రోజు కంటే మూడో రోజే ఎక్కువ కలెక్షన్లను దక్కించుకుంది. అమెరికాలో 2 మిలియన్ డాలర్ల మార్కును అధిగమించి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. హనుమాన్ సినిమాకు ఫుల్ పాజిటివ్ టాక్ రావడం, స్క్రీన్లను పెంచుతుండటంతో కలెక్షన్లు జోరు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి.

హనుమాన్ చిత్రంలో తేజా సజ్జా సరసన అమృత అయ్యర్ హీరోయిన్‍గా నటించగా.. వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, సముద్ర ఖని, గెటప్ శ్రీను, వెన్నెల కిశోర్, రాజ్ దీపక్ శెట్టి కీలకపాత్రలు పోషించారు. ప్రైమ్ షో ఎంటర్‌టైన్‍మెంట్ పతాకంపై నిరంజన్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రాన్ని ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన విధానంపై, హనుమంతుడిని చూపించిన విధానంపై సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయి.

సంక్రాంతి సందర్భంగా మహేశ్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమా కూడా జనవరి 12నే వచ్చింది. వెంకటేశ్ సైంధవ్ ఆ తర్వాతి రోజు రాగా.. నాగార్జున ‘నా సామిరంగ’ జనవరి 13న రిలీజ్ అయింది. ఈ చిత్రాల నుంచి పోటీ ఉన్నా హనుమాన్ మాత్రం సత్తాచాటుతోంది.

Whats_app_banner