Hanuman Box Office Collections day 4: బాక్సాఫీస్‌పై హనుమాన్ దండయాత్ర.. రూ.100 కోట్లకు చేరువైన సూపర్ హీరో మూవీ
Hanuman Box Office Collections day 4: బాక్సాఫీస్ పై హనుమాన్ దండయాత్ర కొనసాగుతోంది. ఈ సినిమా నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ కు చేరువవుతోంది.
Hanuman Box Office Collections day 4: మన సంక్రాంతి సూపర్ హీరో హనుమాన్ దూకుడు కొనసాగిస్తున్నాడు. బాక్సాఫీస్ దుమ్ము దులుపుతూ కలెక్షన్ల సునామీని కొనసాగిస్తున్నాడు. సంక్రాంతికి ఓ చిన్న సినిమాగా రిలీజై.. నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.97 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిందీ సినిమా. కేవలం రూ.26 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో వచ్చిన ఈ సినిమా.. లాభాల పంట పండిస్తోంది.
తేజ సజ్జ నటించిన ఈ హనుమాన్ మూవీ గత శుక్రవారం (జనవరి 12) రిలీజ్ కాగా.. సోమవారానికి నాలుగు రోజుల్లో రూ.97 కోట్లు రాబట్టింది. సంక్రాంతి రోజు ఈ మూవీ మరింత చెలరేగింది. తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించింది. తొలి షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో హనుమాన్ వసూళ్లు రోజురోజుకూ పెరుగుతూనే ఉండటం విశేషం.
హనుమాన్.. నాలుగో రోజు హయ్యెస్ట్
హనుమాన్ మూవీ నాలుగో రోజు తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా రూ.11 కోట్లు వసూలు చేసింది. అంటే తొలి రోజు వసూళ్ల కంటే కూడా ఇది రెట్టింపు. ఆ లెక్కన హనుమాన్ దూకుడు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక హిందీ బెల్ట్ లో మాత్రం సోమవారం వసూళ్ల కాస్త తగ్గాయి. తెలుగు రాష్ట్రాల్లో పండగ హాలీడే ఉన్నా.. అక్కడ చాలా రాష్ట్రాల్లో లేకపోవడంతో ఆ ప్రభావం వసూళ్లపై పడింది.
మూడో రోజు అక్కడ అత్యధికంగా రూ.6 కోట్లు రాగా.. నాలుగో రోజు రూ.3.75 కోట్లు వచ్చాయి. అలా చూసుకున్నా తొలి రోజు కంటే ఇవి ఎక్కువే. హనుమాన్ రిలీజ్ రోజు హిందీ బెల్ట్ లో రూ.2.1 కోట్లు వసూలు చేసింది. ఫస్ట్ వీకెండ్ లో ప్రపంచవ్యాప్తంగా రూ.73 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన హనుమాన్.. నాలుగో రోజు మరో రూ.24 కోట్లతో మొత్తంగా రూ.97 కోట్ల గ్రాస్ వచ్చింది.
తెలుగులో నాలుగు రోజులు కలిపి రూ.39.21 కోట్లు వసూలు చేయగా.. హిందీలో రూ.15.75 కోట్లు వచ్చాయి. మిగతా భాషలైన తమిళం, కన్నడ, మలయాళంలలో మాత్రం ఊహించిన రెస్పాన్స్ రావడం లేదు. తెలుగులో గుంటూరు కారం, సైంధవ్, నా సామిరంగలాంటి పెద్ద హీరోల సినిమాలకు గట్టి పోటీ ఇస్తూ హనుమాన్ ఈ స్థాయిలో వసూళ్లు సాధించడం నిజంగా విశేషమే.
నార్త్ అమెరికాలో రికార్డు
హనుమాన్ మూవీ నార్త్ అమెరికాలో రికార్డు క్రియేట్ చేసింది. అక్కడ 4 రోజుల్లో 3 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. దీంతో నార్త్ అమెరికాలో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 తెలుగు సినిమాల్లో ఒకటిగా హనుమాన్ నిలిచింది.
హనుమాన్ సీక్వెల్
హనుమాన్ మూవీ సక్సెస్ తో డైరెక్టర్ ప్రశాంత్ శర్మ జోరు మీదున్నాడు. ఇలాంటి ఇండియన్ సూపర్ హీరో సినిమాలు మొత్తం 12 తీస్తానని ఇప్పటికే అనౌన్స్ చేసిన అతడు.. ఇప్పుడు హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ ను వచ్చే ఏడాది రిలీజ్ చేయనున్నట్లు చెప్పాడు. సముద్రఖని క్యారెక్టర్ ద్వారా సీక్వెల్ పాయింట్‌ను చెప్పించాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.
ఈ ఏడాది వేసవిలో జై హనుమాన్ మూవీ షూటింగ్ ప్రారంభమవుతుందని అంటున్నారు. హనుమాన్‌లో ఉన్న నటీనటులతో పాటు మరికొంద మంది పాన్ ఇండియన్ స్టార్స్ ఈ సీక్వెల్‌లో కనిపించబోతున్నట్లు సమాచారం. జై హనుమాన్ కూడా పాన్ ఇండియన్ లెవెల్‌లో అన్ని భాషల్లో రిలీజ్ చేసేందుకు ప్రశాంత్ వర్మ సన్నాహాలు చేస్తున్నట్లు చెబుతున్నారు.