Guntur Kaaram First Glimpse: బీడీ త్రీడీలో కనిపిస్తోందా.. గుంటూరు కారం అదిరిపోయింది
Guntur Kaaram First Glimpse: బీడీ త్రీడీలో కనిపిస్తోందా అంటూ గుంటూరు కారం ఫస్ట్ గ్లింప్స్ అదిరిపోయింది. అందరూ ఊహించినట్లే ఎస్ఎస్ఎంబీ28కి గుంటూరు కారం అనే పెట్టారు.
Guntur Kaaram First Glimpse: సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కు పండగలాగా వచ్చేసింది గుంటూరు కారం ఫస్ట్ గ్లింప్స్. ఇన్నాళ్లూ ఎస్ఎస్ఎంబీ28గా పిలుస్తున్న మూవీకి అందరూ ఊహించినట్లే, సూపర్ స్టార్ మెచ్చిన గుంటూరు కారం టైటిల్ పెట్టారు. దీనికి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ ను కృష్ణ జయంతి సందర్భంగా బుధవారం (మే 31) రిలీజ్ చేశారు.
ఇందులో మహేష్ స్టైలిష్ లుక్ లో కనిపించాడు. అయితే నోటిలో నుంచి బీడీ తీస్తూ.. ఏందట్టా జూస్తున్నావ్.. బీడీ త్రీడీలో కనిపిస్తోందా అనే మాస్ డైలాగ్ తో మహేష్ అదరగొట్టాడు. అతడు, ఖలేజాలాంటి సూపర్ హిట్ మూవీస్ తర్వాత త్రివిక్రమ్, మహేష్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక గుంటూరు కారం అనే టైటిల్ తో ఈ అంచనాలను మరింత పెంచేశారు.
గుంటూరు కారం ఎలా అదిరిపోయి నషాళానికి అంటుతుందో.. ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్ కూడా అలాగే ఉంది. సూపర్ స్టార్ ఫ్యాన్స్ పండగ చేసుకునేలా మేకర్స్ ఈ ఫస్ట్ గ్లింప్స్ తీసుకొచ్చారు. హైలీ ఇన్‌ఫ్లేమబుల్ అనే ట్యాగ్‌లైన్ పెట్టారు. తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. గుంటూరు యాసలో మహేష్ మాట్లాడటం ఈ మూవీకే హైలైట్ గా నిలవనుంది.
మహేష్ ను ఎప్పుడూ స్టైలిష్ గా చూపిస్తూ, తన మార్క్ డైలాగులతో అదరగొట్టే త్రివిక్రమ్ శ్రీనివాస్.. ఈ గుంటూరు కారంతోనూ అదే రిపీట్ చేయబోతున్నట్లు గ్లింప్స్ చూస్తేనే తెలుస్తోంది. ఈ మూవీలో పూజా హెగ్డే, శ్రీలీల నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న గుంటూరు కారం రిలీజ్ కాబోతోంది.