Godfather Twitter Review: నిశ్శబ్ద విస్ఫోటనం.. బాస్ ఈజ్ బ్యాక్.. గాడ్‌ఫాదర్ ట్విటర్ రివ్యూ
Godfather Twitter Review: నిశ్శబ్ద విస్ఫోటనం.. బాస్ ఈజ్ బ్యాక్.. అంటూ మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్‌ఫాదర్ మూవీపై నెటిజటన్లు ట్విటర్‌లో తమ రివ్యూలు చెబుతున్నారు. దసరా సందర్భంగా బుధవారం (అక్టోబర్ 5) ఈ సినిమా రిలీజ్ కానుండగా.. ఇప్పటికే పలుచోట్ల బెనిఫిట్ షోలు వేసేశారు.
Godfather Twitter Review: ఈసారి దసరా మెగాభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేసింది. తమ అభిమాన నటుడు చిరంజీవి నటించిన గాడ్‌ఫాదర్ దసరా రోజే రిలీజ్ అయింది. ఆచార్యలాంటి డిజాస్టర్ తర్వాత వచ్చిన సినిమా కావడంతో ఆ చేదు జ్ఞాపకాలను ఈ గాడ్‌ఫాదర్ చెరిపేయాలని ప్రతి మెగాభిమానీ కోరుకున్నాడు.
అందుకు తగినట్లే ఈ సినిమా ట్విటర్ రివ్యూలు ఉన్నాయి. నిశ్శబ్ద విస్ఫోటనం, బాస్ ఈజ్ బ్యాక్ అంటూ బుధవారం తెల్లవారుఝుము నుంచే ట్విటర్లో అభిమానుల సందడి మొదలైంది. కళ్లతోనే సినిమా మొత్తం నడిపించేశాడు బాస్ అంటూ చిరంజీవి నటనకు ఫిదా అవుతున్నారు. ఫస్ట్ హాఫ్ అద్భుతం.. సెకండాఫ్‌లో డైలాగులు, చిరు, నయనతార మధ్య బంధానికి సంబంధించిన సీన్లు హైలైట్ అని మరో అభిమాని ట్వీట్ చేశాడు.
ఇక చాలా మంది ఈ మూవీలో చిరు ఎంట్రీకి సంబంధించిన వీడియోలను ట్విటర్‌లో పోస్ట్ చేశారు. బ్రహ్మ క్యారెక్టర్‌లో బాస్ ఇరగదీశాడంటూ మరికొందరు తమ రివ్యూలు రాశారు. యూకే ఆడియెన్స్ మూవీ చూసి థ్రిల్ అయ్యారంటూ కొందరు వాళ్ల రెస్పాన్స్ వీడియోను కూడా పోస్ట్ చేశారు. వెనక్కి తగ్గిన సముద్రం ముందుకొచ్చి సునామీలా ముంచేస్తే ఎలా ఉంటుందో తెలుసా.. గాడ్‌ఫాదర్ రీసౌండింగ్‌లా ఉంటుంది అంటూ మరో మెగాభిమాని ట్వీట్ చేశాడు.
ఈ మూవీలో సత్యదేవ్ యాక్టింగ్ చాలా బాగుందని కొందరు.. ఇక గాడ్‌ఫాదర్‌లో చిరంజీవితోపాటు డైరెక్టర్ మోహన్ రాజా కూడా హీరోనే అని మరికొందరు ట్వీట్లు చేశారు. గాడ్‌ఫాదర్ మూవీ మలయాళంలో వచ్చిన లూసిఫర్ మూవీకి రీమేక్ అన్న విషయం తెలిసిందే. తాను వరుసగా రీమేక్‌లు చేయడంపై మూవీ రిలీజ్‌కు ముందు చిరంజీవి స్పందించాడు.
రీమేక్‌లు చేసినప్పుడు పోలిక అనేది వస్తుంది కదా అని అడిగితే.. అదే తనకు కావాలని, ఆ పోలిక వచ్చినప్పుడు కూడా తన రీమేక్‌లే ఒరిజినల్ కంటే ఎక్కువ సక్సెస్ అయిన విషయాన్ని గుర్తుంచుకోవాలని చిరు అనడం విశేషం. ఈ సినిమాలో చిరంజీవితోపాటు సత్యదేవ్, నయనతార, పూరి జగన్నాథ్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించారు. సల్మాన్ ఖాన్ గెస్ట్ అప్పియరెన్స్ కూడా ఫ్యాన్స్‌ను థ్రిల్ చేసింది.