Fighter teaser: గూస్‌బంప్స్ తెప్పిస్తున్న ఫైటర్ టీజర్.. గాల్లో యాక్షన్ అదిరిపోయింది
Fighter teaser: బాలీవుడ్ స్టార్స్ హృతిక్ రోషన్, దీపికా పదుకోన్ నటించిన ఫైటర్ టీజర్ గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. టీజర్ మొత్తం ఫైట్ జెట్స్ తో వీళ్లు చేసిన సాహసాలు చూపు తిప్పుకోలేకుండా ఉన్నాయి.
Fighter teaser: ఫైటర్ మూవీ టీజర్ శుక్రవారం (డిసెంబర్ 8) ఉదయం రిలీజైంది. హృతిక్ రోషన్, దీపికా పదుకోన్, అనిల్ కపూర్ నటించిన ఈ సినిమా వచ్చే ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా రిలీజ్ కాబోతోంది. తాజాగా రిలీజైన టీజర్ గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. షారుక్ ఖాన్‌తో పఠాన్ లాంటి రూ.1000 కోట్ల సినిమా అందించిన సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ కూడా యాక్షన్ లవర్స్ ను ఆకట్టుకునేలా ఉంది.
ఫైటర్ మూవీ టీజర్ మొత్తం ఫుల్ యాక్షన్ తో నిండిపోయింది. గాల్లో ఫైటర్ జెట్స్ తో హృతిక్, దీపికా చేసిన విన్యాసాలు మునివేళ్లపై నిలబెట్టేలా ఉన్నాయి. ఈ 70 సెకన్ల టీజర్ తోనే సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేసేశాడు డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్. ఈ ఏడాది జనవరిలో పఠాన్ మూవీని కూడా యాక్షన్ సీక్వెన్స్ తో నింపేసి అభిమానులకు పిచ్చెక్కించేసిన అతడు.. ఫైటర్ తో మరోసారి అదే రిపీట్ చేయబోతున్నాడు.
ఫైటర్ టీజర్ ఎలా ఉందంటే..
ఫైటర్ టీజర్ మొత్తం ఫైటర్ జెట్ విన్యాసాలతోనూ నింపేశారు. మూవీలో లీడ్ క్యాస్ట్ హృతిక్, దీపికా, అనిల్ కపూర్ లకు చెందిన ప్యాటీ, మిన్నీ, రాకీ స్క్వాడ్రన్ లీడర్లుగా నటించారు. వీళ్లంతా ఓ మిషన్ పై తమ ఫైటర్ జెట్స్ లో వెళ్తారు. అవి గాల్లోకి ఎగిరిన మరుక్షణం నుంచీ జెట్స్ చేసే స్టంట్స్ ఊపిరి బిగపట్టి చూసేలా ఉన్నాయి. నిమిషం టీజర్ తోనే ఇంతలా ఊపేస్తే ఇక సినిమా మొత్తం ఏ రేంజ్ లో ఉండబోతోందో ఊహించుకోవచ్చు.
మధ్యలో హృతిక్, దీపికా ఘాటు రొమాన్స్ సీన్స్ కూడా ఇలా వచ్చి అలా వెళ్లిపోతాయి. టీజర్ చివర్లో సుజలాం సుఫలాం అంటూ జాతీయ గేయం వినిపిస్తుంది. హృతిక్ ఓ ఫైటర్ జెట్ నుంచి బయటకు వస్తుండగా.. త్రివర్ణ పతాకం బ్యాక్‌గ్రౌండ్ లో కనిపిస్తుంది. ఈ సినిమా రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 25న రిలీజ్ కాబోతోంది. ఈ ఏడాది అదే తేదీన రిలీజైన పఠాన్ ఎంతటి సంచలన విజయం సాధించిందో చూశాం.
ఇప్పుడు అదే డైరెక్టర్ సిద్థార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేసిన ఫైటర్ మూవీ కూడా అలాంటి సంచలనమే సాధించడానికి సిద్ధమవుతోంది. యాక్షన్ సీన్స్ ను తీయడంలో దిట్ట అయిన సిద్ధార్థ్.. ఈ ఫైటర్ లో ఏం చూపించబోతున్నాడో టీజర్ చూస్తేనే స్పష్టమవుతోంది. ఇండియాలో రూపొందిన తొలి ఏరియల్ యాక్షన్ సినిమాగా ఫైటర్ ను అభివర్ణిస్తున్నారు. పఠాన్ లో నటించిన దీపికా ఈ సినిమాలోనూ కనిపించబోతోంది. మరి ఈ సినిమా కూడా మరో వెయ్యి కోట్ల మూవీ అవుతుందేమో చూడాలి.